మింగింది కొండంత..కక్కమంది గోరంత!

ABN , First Publish Date - 2020-02-20T09:34:07+05:30 IST

ప్రపంచంలో అరుదుగా లభ్యమయ్యే సిలికా గనులు జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో వేల ఎకరాల్లో ఉన్నాయి. ఇక్కడ లభ్యమయ్యేది క్వాలిటీ సిలికా కావడంతో

మింగింది కొండంత..కక్కమంది గోరంత!

సిలికా ఘనులకు బంపర్‌ ఆఫర్‌!

పెనాల్టీ రూ.10.12 కోట్లు.. తగ్గించింది రూ.9.9 కోట్లు

తెర వెనుక సూత్రధారులు ఎందరో!?


నెల్లూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలో అరుదుగా లభ్యమయ్యే సిలికా గనులు జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో వేల ఎకరాల్లో ఉన్నాయి. ఇక్కడ లభ్యమయ్యేది క్వాలిటీ సిలికా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ అనుమతులతో కొందరు లీజుకు తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారు. ఈ సిలికా వ్యాపారం అధికారికంగా జరిగేదానికన్నా అనధికారికంగా జరిగేదే ఎక్కువ. బిల్లులు లేకుండా, ఒకే బిల్లుతో రెండు మూడు లారీల సిలికాను చెన్నై, బెంగళూరు తరలిస్తుంటారు. ప్రభుత్వానికి తక్కువ రాయల్టీ చెల్లిస్తూ అనేక మంది అక్రమార్కులు రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఈ అక్రమాలను అధికారులు బట్టబయలు చేశారు. కాగా నిబంధనలను అతిక్రమించి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. దీనిపై గతేడాది అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి సాంకేతికతను ఉపయోగించి భారీగా జరిమానాలు విధించారు. ఇప్పటివరకు మొత్తం 58 సిలికా మైనింగ్‌ లీజులకు సంబంధించి రూ.299.74 కోట్ల జరిమానాలు వేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. అయితే ఈ జరిమానాలపై 27 మంది లీజుదారులు ప్రభుత్వం వద్ద రివిజన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.


వారిలో ముగ్గురికి ప్రభుత్వం ఫెనాల్టీలను భారీస్థాయిలో తగ్గించింది. రూ.10.12 కోట్లకు కేవలం రూ.21.45 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని రివిజన్‌ సందర్భంగా తీర్పునిచ్చింది. ఇంత భారీస్థాయిలో తగ్గించారంటే అధికారులు పెనాల్టీలు తప్పుగా వేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అన్ని మైన్స్‌కు ఒకే పద్ధతిలో పెనాల్టీలు విధించారు. ఆ లెక్కన అన్ని పెనాల్టీలు తప్పేనా.. అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మరి అటువంటి సందర్భంలో అన్ని పెనాల్టీలను అదే స్థాయిలో ఎందుకు తగ్గించలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అలా కాకుండా అధికారులు పద్ధతి ప్రకారమే పెనాల్టీలు విధించి ఉంటే ముగ్గురుకు మాత్రమే తగ్గించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న కూడా రేకెత్తుతోంది. సాధారణంగా రివిజన్‌కు వెళ్లినప్పుడు మైన్‌ లీజు దారుడు తన వాదనను ప్రభుత్వం వద్ద వినిపిస్తారు.


అదే విధంగా అధికారులు కూడా ఏ ప్రాతిపాదికన పెనాల్టీలు విధించారో తెలియజేస్తారు. రివిజన్‌లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మరోసారి మైన్‌లో రీ సర్వే జరిపి, లీజుదారుడు పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని పెనాల్టీలు మార్పు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడమేమిటని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం.  కాగా మరికొంత మంది లీజుదారులు కూడా ప్రభుత్వం వద్ద రివిజన్‌కు వెళ్లి ఉన్నారు. వారు కూడా పెనాల్టీలను వీలైనంత తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇందుకోసం రాజకీయ, ఆర్థిక బలాన్ని ఉపయోగించుకుంటున్నట్లు వినికిడి. సిలికాలో ఆరితేరిన ఓ లీజుదారుడికి సంబంధించిన మైన్స్‌కు ఏకంగా రూ.60 కోట్లకుపైగా పెనాల్టీలు విధించినట్లు సమాచారం. స్వతహాగా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో ప్రభుత్వం వద్ద పెద్ద స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు తగ్గించారని, అయితే అంతకన్నా ఇంకా తగ్గించాలని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నలుగురు లీజు దారులు పెనాల్టీలపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. 


ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది..వెంకటేశ్వరరెడ్డి, మైన్స్‌ శాఖ ఏడీ

సిలికా మైన్స్‌కు సంబంధించి నిబంధనలు అతిక్రమించిన ప్రకారం మేము పెనాల్టీలు విధించాం. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది ప్రభుత్వం వద్ద రివిజన్‌కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వం విచారణ జరిపి తగ్గించింది. ఎంత తగ్గించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 

Updated Date - 2020-02-20T09:34:07+05:30 IST