హోరాహోరీగా జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2021-01-16T05:14:31+05:30 IST

పర్చూరు మండల పరిధిలోని అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

హోరాహోరీగా జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
పోటీలలో బండలాగుతున్న ఎడ్లు

ఫ్లడ్‌లైట్‌ల మధ్య పోటీలు.. తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

అన్నంబొట్లవారిపాలెం(పర్చూరు), జనవరి 15 : మండల పరిధిలోని అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. దివంగత గోరంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోటీలను డీసీఎంఎస్‌ చైౖర్మన్‌, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబు ప్రారంభించారు. తొలిరోజు గురువారం ఆరుపళ్ల విభాగంగా నిర్వహించిన పోటీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాల సంయుక్త ఎడ్ల జత 4288.5 అడుగుల దూరం లాగి ప్రథమస్థానం కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా ప్రకాశంజిల్లా, కారంచేడు మండలం పోతినవారిపాలేనికి చెందిన పోతిన లక్షిత్‌చౌదరి ఎడ్ల జత 4200 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం పొందాయి. ఖమ్మం జిల్లాకు చెందిన జమ్ములదిన్నె బసిరెడ్డి ఎడ్లు 3600 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచాయి. అమరావతికి చెందిన బండి సాహిత్‌ శ్రీభువన్‌ ఎడ్లు 3570.1 అడుగుల దూరం లాగి నాల్గో స్థానం గెలుచుకున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా, దర్శి మండలం, కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఆవుల రమణారెడ్డి ఎడ్లు 2100 అడుగుల దూరం లాగి ఐదో స్థానం సొంతం చేసుకున్నాయి. కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం సేద్యపు విభాగపు పోటీల్లో ఆయా జిల్లాల నుంచి 10 జతల ఎడ్లు పాల్గొన్నాయి. తొలుత బరిలోకి దిగిన గుంటూరు జిల్లా, కర్లపాలేనికి చెందిన మంతెన మధుసూదన్‌రావు ఎడ్లు నిర్ణీత సమయంలో 3,966.3 అడుగుల దూరం, ఆ తర్వాత గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జాష్టిడోలానంద సాయి, సాత్విక్‌ ఎడ్లు 3081.8 అడుగుల దూరం లాగాయి. ఫ్లడ్‌ లైట్లు, విద్యుత్‌ కాంతుల మధ్య పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. పోటీలను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పశుపోషకులు, జంతు ప్రేమికులు వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒకే గ్రామంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు నిర్వహించటంతో సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.

ఢీ అంటే ఢీ

పర్చూరు మండలంలోని అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పొటేళ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. వీటిని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలిరావటంతో ప్రాంగణం కిక్కిరిసింది.



Updated Date - 2021-01-16T05:14:31+05:30 IST