లాక్‌డౌన్‌తో కరువైన కల్లు, మద్యం

ABN , First Publish Date - 2020-03-30T11:26:05+05:30 IST

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైన్‌షాపులు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి.

లాక్‌డౌన్‌తో కరువైన కల్లు, మద్యం

లిక్కర్‌ కోసం బలవన్మరణాలకు పాల్పడుతున్న మద్యంప్రియులు

గుట్టుగా రెండింతల ధరకు అమ్ముతున్న మద్యం

వైన్‌షాపులు తెరుస్తున్నట్లు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం

ఫేక్‌ జీవోలు, న్యూస్‌ నమ్మొద్దంటున్న ఎక్సైజ్‌ అధికారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైన్‌షాపులు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు మందు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మందు దొరక్కా నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు కల్లు తాగే అలవాటు ఉన్న వారు అల్లాడిపోతున్నారు.  ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో కల్లు, మద్యం కోసం నానా తంటాలు పడుతున్నారు. భయంకరమైన కరోనా వ్యాధిని అరికట్టేందుకు సర్కారు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసివేసింది. దీనిలో భాగంగానే మద్యం దుకాణాలు, బార్లు కూడా మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులకు తిప్పలు మొదలయ్యాయి? జనతా కర్ఫ్యూ ప్రకటనతో రెండు రోజుల ముందుగానే కొంతమంది మద్యం బాటిళ్లను తెచ్చిపెట్టుకున్నారు. జనతా కర్ఫ్యూ ముగిసే సమయానికి ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది.


దీంతో రవాణా వ్యవస్థతోపాటు అన్నీ మూతపడ్డాయి. అయితే సడెన్‌గా వైన్‌షాప్స్‌ బంద్‌ కావడంతో మద్యం ప్రియులు మందు దొరక తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముతుండటంతో కొనలేక లబోదిబోమంటున్నారు. ఓ వైపు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే.. మద్యానికి బానిసైన కొందరు మందు దొరకక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. షాబాద్‌కు చెందిన లంబాడి సత్తయ్య (46) ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అలాగే కొడంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ముందుగా తెచ్చుకున్న మద్యం కాస్త అయిపోవడంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రాత్రి వేళలో మద్యం షాపుల వైపు వెళుతున్నారు. దుకాణాదారులకు ఫోన్లు చేస్తున్నారు. ప్లీజ్‌... ఎలాగైనా సరే... నాకు ఒక్క బాటిల్‌ ఇవ్వరా అంటూ ప్రాదేయ పడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరూ.. ఒక్కో బాటిల్‌ను రెండుమూడింతల ధరలకు విక్రయుస్తున్నారు.


వేయి రూపాయల బాటిల్‌కు అదనంగా వేయికి పైగా వసూలు చేస్తున్నారు. మద్యం దుకాణాదారులు కొందరూ గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళ్లలో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. మద్యం లభించని కొందరు కల్లుకు ఎగబడుతున్నారు. కల్లు కోసం ఉదయం సాయంత్రం వేళలో కల్లు దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. గుట్టు చప్పుడుగా తెరచిన కల్లు దుకాణాల వద్ద గుంపులుగా చేరడంతో పోలీసులు చర్యలు తీసుకుంటు న్నారు. దీంతో కొందరు మద్యం దొరకక పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. మందు కోసం రోడ్లపైకి వస్తున్నారు. మద్యం షాపుల వద్ద గేట్లు దొబ్బుతున్నారు. మద్యం షాపులు తెరిపించాలని మందుబాబులు వేడుకుంటున్నారు. 

అసత్య ప్రచారంతో హల్‌చల్‌

కొంతమంది వ్యక్తులు సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారు. ఫేక్‌న్యూస్‌, అసత్య ప్రచారాలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. జనాలు కన్‌ఫ్యూజ్‌ అవు తున్నారు. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక కంగారు పడుతున్నారు. తాజాగా కరోనా వైరస్‌ గురించి లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇలాచేస్తే  కరోనా రాదు, అలా చేస్తే కరోనా రాదంటూ ఎవరికి వారు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు మరో న్యూస్‌ వైరల్‌ చేశారు. వైన్‌ షాపులు తెరుస్తున్నట్లు... ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సంతకంతో ఆర్డర్‌ జారీ చేసినట్లు డూప్లికేట్‌ సర్క్యూలర్‌ జారీ చేశారు. ఇది నిజం అనుకుని  మందుబాబులు తెగ ఖుషీ అయ్యారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఎక్సైజ్‌శాఖ అధికారులు తేల్చి చెప్పడంతో డీలా పడ్డారు. 

Updated Date - 2020-03-30T11:26:05+05:30 IST