అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-04-17T05:17:25+05:30 IST

ప్రభుత్వ భవనాల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు
అర్ధంతరంగా ఆగిన ఐసీడీఎస్‌ భవనం

 కాంట్రాక్టర్లకు చెల్లించని బిల్లులు

పనులు నిలిపివేత

అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

పొదిలి, ఏప్రిల్‌ 16: ప్రభుత్వ భవనాల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.  ఆయా ప్రభుత్వ కార్యాలయాలు నేటికీ అద్దె భవనాలలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయంలో రూ.53 లక్షలతో ఐసీడీఎస్‌ కార్యాలయం భవన నిర్మాణానికి టెండర్లు వేశారు. ఈ టెండర్‌కు 2018 ఫిబ్రవరి నుంచి నవంబర్‌ 2018 వరకు కాలపరిమితి ఉంది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ శ్లాబు వేసి వదలివేశాడు. చేసిన పనులకు రూ.11లక్షలు నిధులు డ్రా చేశారు. ప్రభుత్వం మారడంతో నిధులు రాక నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌ నిలిపి వేశాడు. గత రెండు సంవత్సరాలుగా పనుల ప్రారంభానికి అధికారులు చొరవ చూపలేదు. దీంతో కాంట్రాక్టర్‌ కూడా పనులు చేయకుండా నిలిపివేశాడు. అయితే, అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో తాను పనులు చేయించలేనని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. టెండర్‌ను రద్దు చేసి తిరిగి పనులు ప్రారంభించాల్సి ఉంది.

అదే విధంగా స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శ్రీశక్తి భవన నిర్మాణ పనులకు రూ.32 లక్షలతో కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకున్నారు. రెండతస్థులు శ్లాబు వేశాడు. రూ.16 లక్షలకు బిల్లు పెట్టగా, నేటికీ ఒక్క పైసా బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపి వేశాడు. వైసీపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు నిలిపివేయడంతో భవన నిర్మాణ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులకు నిధులు కేటాయించి కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-04-17T05:17:25+05:30 IST