రెండున్నరేళ్లగా క్లెయిమ్‌లు చెల్లించని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-02T05:37:20+05:30 IST

ప్రభుత్వం దారి మళ్లించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.830 కోట్లు వెంటనే జయచేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్‌ హెచ్చరించారు.

రెండున్నరేళ్లగా క్లెయిమ్‌లు చెల్లించని ప్రభుత్వం
ఆకివీడులో భవన నిర్మాణ కార్మికుల నినాదాలు

కార్మికుల సంక్షేమ నిధుల మళ్లింపు తగదు

4 కార్మిక కోడ్‌ చట్టాలను రద్దు చేయాలి

భవన నిర్మాణ కార్మికుల నిరసన ప్రదర్శన


ఆకివీడు, డిసెంబరు 1: ప్రభుత్వం దారి మళ్లించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు రూ.830 కోట్లు వెంటనే జయచేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్‌ హెచ్చరించారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల నిలుపుదల చేసిన జీవో 12,14 ఉపసంహరించుకోవాలంటూ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ సునీల్‌కు వినతిపత్రం అందజేశారు.ఆందోళనలో రాగుల సత్తిబాబు, చిలకా సురేష్‌, కేఎల్‌.మనోహర్‌, కె.ధనరాజ్‌, నూకల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


పెనుగొండ : భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ డెల్టా జిల్లా సహాయ కార్యదర్శి నాగిరెడ్డి గంగారావు డిమాండ్‌ చేశారు. సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం భవన నిర్మాణ కార్మికులు తహసీల్దార్‌  కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ బి.మాలతికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన  కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఉందన్న భరోసాను జగన్‌ ప్రభుత్వం నీరు గార్చుతుందన్నారు.కార్యక్రమంలో ఎస్‌.వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వరరావు, కంబాల ఆదినారాయణ, వేపకాయల గంగరాజు, కార్మికులు పాల్గొన్నారు. 


ఆచంట :  భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరిచాలని కోరుతూ బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ఫాజిల్‌కు వినతిపత్రం అందజేశారు. భవన నిర్మాణ రంగం మెటీరియల్‌, సిమ్మెంటు, ఇసుక, ఐరెన్‌, కలప రంగులు పెరిగిన ధరల పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని , ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే 44 కార్మిక చట్టాలను సవరించి  యజమానులకు అనుకూలంగా తీసుకువచ్చిన 4 కార్మిక కోడ్లగా మార్పు చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలన్నారు. ఈ  కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  దాసిరెడ్డి కోటేశ్వరరావు, సీఐటీయూ మండల కార్యదర్శి ఆర్‌.ఆంజనేయులు, కేతా రామాంజనేయులు, మానేపల్లి సత్యనారాయణ,లంక లక్ష్మినారాయణ, ఉన్నమట్ల ప్రసాద్‌, శరణ్య పాల్గొన్నారు. 


యలమంచిలి : భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి దేవ సుధాకర్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని, కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికు లందరికీ రూ.7500 ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన వడ్డికాసులు, గూడూరి నాగేశ్వరరావు, ఐ.శ్రీనివాస్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T05:37:20+05:30 IST