వైద్యం అందేదెప్పుడో?

ABN , First Publish Date - 2022-01-20T05:30:00+05:30 IST

కోట్లాది రూపాయల వ్యయంతో ఆసుపత్రి భవనాలు నిర్మించినా.. వైద్య సేవల ప్రారంభానికి నోచుకోవడం లేదు. అత్యాధునిక పరికరాలు, అన్ని వసతులతో కూడిన సంపూర్ణ భవనాలు, నిరంతర ఆక్సిజన్‌ సరఫరాకు వీలయ్యే ప్లాంట్లు, వసతులతో ఓపీ, ఐపీ, శస్త్రచికిత్స విభాగాలు ఇలా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చారు. కానీ సేవలు ప్రారంభించకపోవడంతో వైద్యం కోసం పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ టెక్కలి నూతన జిల్లా ఆస్పత్రి భవనాల పరిస్థితి.

వైద్యం అందేదెప్పుడో?
వైద్యసేవలు ప్రారంభానికి ఎదురుచూస్తున్న టెక్కలి జిల్లా ఆసుపత్రి

- భవన నిర్మాణాలు పూర్తయినా, ప్రారంభం కాని సేవలు

- కరోనా మూడో దశ ముప్పుతో ఆందోళన

- టెక్కలి జిల్లా ఆస్పత్రిలో బాధితులకు తప్పని అవస్థలు

(టెక్కలి రూరల్‌)

కోట్లాది రూపాయల వ్యయంతో ఆసుపత్రి భవనాలు నిర్మించినా.. వైద్య సేవల ప్రారంభానికి నోచుకోవడం లేదు. అత్యాధునిక పరికరాలు, అన్ని వసతులతో కూడిన సంపూర్ణ భవనాలు, నిరంతర ఆక్సిజన్‌ సరఫరాకు వీలయ్యే ప్లాంట్లు, వసతులతో ఓపీ, ఐపీ, శస్త్రచికిత్స విభాగాలు ఇలా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చారు. కానీ సేవలు ప్రారంభించకపోవడంతో వైద్యం కోసం పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ టెక్కలి నూతన జిల్లా ఆస్పత్రి భవనాల పరిస్థితి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో రూ.20కోట్ల నాబార్డు నిధులతో టెక్కలిలో నూతన జిల్లా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుత జిల్లా ఆసుపత్రి భవనాల్లో ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేక.. ఆసుపత్రి భవనాలూ సరిపోక.. శస్త్రచికిత్సకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఆసుపత్రి భవనాల మంజూరుకు చొరవ తీసుకున్నారు. కొద్ది నెలల కిందట భవన నిర్మాణాలు పూర్తయినా, వైద్యసేవలు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొవిడ్‌ మొదటి, రెండవ దశల్లో ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వైద్యసేవలు ప్రారంభించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదు. కరోనా రెండు దశల్లోనూ స్థానిక జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు లిక్విడ్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సరఫరా ఉన్న బెడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మూడో దశలో భాగంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నూతన ఆసుపత్రి భవనాల్లో వైద్యసేవలు ప్రారంభిస్తే పేద రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు, నేతలు చర్యలు చేపట్టడం లేదు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరువాత టెక్కలిలో కార్పొరేట్‌స్థాయి మెరుగైన వైద్యసేవలు అందుతాయని భావించిన డివిజన్‌ పరిధిలోని మండలాల ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. 


సాంకేతిక అడ్డంకులు

నూతన జిల్లా ఆసుపత్రి భవనాల్లో వైద్యసేవలకు అవసరమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌లను సిద్ధం చేశారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి అందజేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌తో పాటు మరో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం, దానికి అనుసంధానమైన పైప్‌లైన్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ నూతన ఆస్పత్రిలో వైద్యం ప్రారంభానికి సాంకేతిక కారణాలు సైతం అడ్డుతగులుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. నూతన భవనాల్లో వైద్యసేవలు ప్రారంభించాలంటే ప్రస్తుత ఆసుపత్రి భవనాల్లోని పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌ పరికరాలు, ఎక్స్‌రే, సీటీస్కాన్‌, కొవిడ్‌ను నిర్ధారించే ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌, ప్రసూతి వైద్య విభాగం, ఫార్మసీ, ఎస్‌ఎన్‌సీయు(పసి పిల్లల వైద్య విభాగం), ఎంఎంఐడీ, ట్రామాకేర్‌ తదితర వాటిని యుద్ధప్రాతిపదికన తరలించాల్సి ఉంది. నూతన ఆసుపత్రి భవనాల్లో వైద్యసేవలు ప్రారంభిస్తే.. సామగ్రి తరలింపు ఎలా చేపడతాం? ఓపీ, ఐపీ, శస్త్రచికిత్సలకు సంబంధించిన రోగులతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధుల రోగుల పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్నలు ఆసుపత్రి వర్గాలతో పాటు అటు అధికారులకు సైతం సవాల్‌గా మారనున్నాయి. 

- సిబ్బంది కొరత కూడా ఓ ప్రధాన సమస్య కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  డివిజన్‌ కేంద్రమైన టెక్కలితో పాటు నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, మెళియాపుట్టి, పాతపట్నం తదితర మండలాల నుంచి నిత్యం ఆసుపత్రికి రోగులు వస్తారు. మరోవైపు కిడ్నీవ్యాధిగ్రస్థులకు, అత్యవసర ప్రమాద కేసులకు, ట్రామాకేర్‌, చిన్నపిల్లల విభాగాలతో పాటు పలు దీర్ఘకాలిక రోగులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందజేయాల్సి ఉంది. నూతన ఆసుపత్రిలో  వైద్యులు, వైద్యసిబ్బంది, ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, ల్యాబ్‌టెక్నీషియన్లు, కార్యాలయ సిబ్బంది, రేడియాలజీ సిబ్బంది, ఫార్మసీ, పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటేనే అనుకున్నస్థాయిలో వైద్యసేవలు అందుతాయి. 

- కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ టెక్కలి జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మారిస్తే వైద్యసేవలు పటిష్టంగా అందజేయాలి. అరకొర సిబ్బంది, ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు, పూర్తిస్థాయిలో వైద్యులు, ఆయా విభాగాల సిబ్బంది లేకపోవడం తదితర అనేక సమస్యలు నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించి.. నూతన భవనాల్లో వైద్యసేవలు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. 


భవనాలు సిద్ధం

టెక్కలి నూతన జిల్లా ఆసుపత్రి భవనాలను సంబంధితశాఖ అధికారులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆసుపత్రిలో వైద్యసేవలకు అన్ని భవనాల నిర్మాణాల్ని పూర్తి చేశాం. 

- బీఎన్‌ ప్రసాద్‌, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ. 

Updated Date - 2022-01-20T05:30:00+05:30 IST