భవనంపైన పెట్రోల్‌ బాటిల్‌తో...

ABN , First Publish Date - 2021-04-23T06:27:06+05:30 IST

భవనంపైన పెట్రోల్‌ బాటిల్‌తో...

భవనంపైన పెట్రోల్‌ బాటిల్‌తో...
బిల్డింగ్‌ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న శోభారాణి

 ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనం పైనే..  

 స్పృహ తప్పిపడిపోయాక ఆస్పత్రికి తరలింపు

సుబేదారి, ఏప్రిల్‌ 22 : గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 58వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన మహిళా నేత తుమ్మల శోభారాణి నిరసన తెలిపారు. హన్మకొండ అదాలత్‌ సెంటర్‌లోని ఓ ప్రైవేట్‌ బిల్డింగ్‌ ఎక్కి పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేపట్టింది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు దాదాపు 10గంటల పాటు నిరసన తెలిపింది. 

15 ఏళ్లుగా టీఆర్‌ఎ్‌సలో ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేశానని, తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోల్లో పాల్గొన్నానని, సుమారు 150 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అయినప్పటికీ తనకు టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేశారని శోభారాణి ఆరోపించారు. గత ఎన్నికల్లో 46వ డివిజన్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవగా ఎమ్మెల్యే, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు నచ్చజెప్పి ఇతర పదవులు ఇస్తానని ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం 58వ డివిజన్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో టికెట్‌ ఆశించానని.. కానీ తనను కాదని జనరల్‌ స్థానంలో ఎస్సీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చారని కన్నీటిపర్యంతమయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులను అణిచివేస్తూ ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. 

పట్టించుకోని నాయకులు

సుమారు 10 గంటల పాటు శోభారాణి బిల్డింగ్‌పై ఉండి నిరసన వ్యక్తం చేసినా ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ నాయకుడు పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర టీఆర్‌ఎస్‌ బాధ్యులు ఎవరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చి హామీ ఇవ్వలేదు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో శోభారాణి ఆరోగ్యం క్షీణించడంతో సుబేదారి పోలీసులు ఆమెను రోహిణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2021-04-23T06:27:06+05:30 IST