Chitrajyothy Logo
Advertisement

అగ్ర హీరోలు నిర్మించు...

twitter-iconwatsapp-iconfb-icon

చిన్న... పెద్ద... బడ్జెట్‌ పరంగా మాత్రమే! ప్రేక్షకులు మెచ్చినవన్నీ మంచి చిత్రాలే!!

అటువంటి మంచి కథలకు... జనం మెచ్చిన స్టార్స్‌ చెయ్యి అందిస్తే?

సమ్‌థింగ్‌ స్పెషలే! ఆ క్రేజ్‌ మామూలుగా ఉండదు మరి!!

ఓవైపు భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మిస్తూ...మరోవైపు చిన్న చిత్రాలు తీస్తున్నారు ఈ స్టార్స్‌!

వాళ్లు ఎవరో ఓసారి చూడండి!


మహేశ్‌బాబు ‘మేజర్‌’ స్టెప్‌!

ముంబై ఉగ్రదాడి(2008)లో అమరులైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న తెలుగు, హిందీ సినిమా ‘మేజర్‌’. ఈ చిత్రనిర్మాతల్లో మహేశ్‌బాబు ఒకరు. ఓ విధంగా ఆయన వేసిన మేజర్‌ స్టెప్‌ ఇది. ఎందుకంటే... మహేశ్‌ చిత్రాలకు మాత్రమే ఇన్నాళ్లు ఆయన నిర్మాణ సంస్థ జీఎంబీ (జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌) భాగస్వామిగా ఉంటూ వస్తోంది. తొలిసారి మహేశ్‌ కాకుండా మరొకరితో జీఎంబీ సంస్థపై ఓ సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. ‘మేజర్‌’తో నిర్మాతగా మహేశ్‌ హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. హీరోగా కంటే నిర్మాతగా బాలీవుడ్‌కు ముందు వెళ్తుండటం విశేషం.


‘డ్రీమ్‌ గాళ్‌’ రీమేక్‌...

రానా దగ్గుబాటి... సినిమా కుటుంబంలో జన్మించారు. ఆయన తాతయ్య రామానాయుడు, తండ్రి డి. సురేశ్‌బాబు నిర్మాతలుగా ఎన్నో విజయాలు అందుకున్నారు. నిర్మాతగా తొలి సినిమాతో వాళ్లిద్దరి వారసత్వాన్ని రానా నిలబెడ్డారు. ‘లీడర్‌’తో హీరోగా తెరపైకి అడుగుపెట్టడానికి ముందే ‘బొమ్మలాట’ను నిర్మించారు... గంగరాజు గుణ్ణం, ఆర్‌.కె. ఫిల్మ్‌ అసోసియేట్స్‌తో కలిసి! దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. తర్వాత మళ్లీ సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’కు రానా పేరు సమర్పకుడిగా పడింది. ఆ సినిమా పనులు ఆయనే పర్యవేక్షించారట. హిందీ హిట్‌ ‘డ్రీమ్‌ గాళ్‌’ తెలుగు రీమేక్‌ పనులు సైతం ఆయనే చూస్తున్నారట. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతగా రానా పేరు తెరపై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.


తమ్ముడితో ఒకటి... కొత్తవాళ్లతో ఇంకొకటి!

ఈతరం యువత అభిమానించే హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. చిన్న చిత్రాలతో ప్రారంభమైన అతని ప్రయాణం ఈరోజు స్టార్‌ స్టేటస్‌కు చేరింది. అలాగని, చిన్న చిత్రాలను విజయ్‌ దేవరకొండ వదల్లేదు. ‘పెళ్లి చూపులు’తో తనకు మంచి విజయం ఇచ్చిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా తన సమర్పణ, తండ్రి గోవర్ధన్‌ నిర్మాణంలో ‘పుష్పక విమానం’ చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. కొత్తవాళ్లతో మరొకటి ప్రారంభించారు. ఆ చిత్రానికి పృథ్విసేనారెడ్డి దర్శకుడు. కింగ్‌ ఆఫ్‌ హిల్స్‌ ప్రొడక్షన్‌లో మరిన్ని చిన్న చిత్రాలు నిర్మించాలని కథలు వింటున్నారట.


రాజ్‌తరుణ్‌ హీరోగా ముచ్చటగా మూడోది!

అన్నపూర్ణ స్టూడియోస్‌... అక్కినేని కుటుంబానిది! అది స్టూడియో మాత్రమే కాదు... నిర్మాణ సంస్థ కూడా! అందులో అక్కినేని కుటుంబ నాయకులతో మాత్రమే కాదు... చోటా హీరోలతో కూడా చిత్రాలు చేస్తారు. రాజ్‌తరుణ్‌ హీరోగా పరిచయమైన ‘ఉయ్యాలా జంపాలా’తో చిన్న చిత్రాలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌తో ‘నిర్మల కాన్వెంట్‌’, రాజ్‌తరుణ్‌తో ‘రంగులరాట్నం’ నిర్మించారు. ఇప్పుడు రాజ్‌తరుణ్‌తో ముచ్చటగా మూడో చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి శ్రీనివాస గవిరెడ్డి దర్శకుడు. ఈ సినిమా కాకుండా... వైష్ణవ్‌తేజ్‌తో మరో సినిమా నిర్మించనున్నట్టు నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే.


పవన్‌... చరణ్‌ కూడా!

నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘ఛల్‌ మోహన్‌రంగ’ నిర్మాతల్లో పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఉన్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఇతర చిత్రాలేవీ నిర్మించలేదు. అయితే, చిన్న చిన్న చిత్రాలను పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై నిర్మించే ఆలోచనలో పవన్‌ ఉన్నారట. చిరంజీవి కుటుంబం కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పటివరకూ చిరంజీవి చిత్రాలు మాత్రమే ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి. అయితే, మలయాళ హిట్‌ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ను మెగా హీరోలతో కాకుండా ఇతరులతో నిర్మించాలనుకుంటున్నారట. ఇందులో ఓ స్టార్‌ హీరో, మరో చిన్న హీరో నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. స్టార్‌ హీరోలు చిన్న చిత్రాలు నిర్మించడం వల్ల ఆ సినిమాలకు ఎక్కువ క్రేజ్‌ వస్తుందనీ, జనాల్లోకి సినిమా సులభంగా వెళుతుందని ట్రేడ్‌ పండితులు చెప్పేమాట.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...