గృహాలు నిర్మించుకోండి

ABN , First Publish Date - 2021-08-04T05:28:19+05:30 IST

విమానాశ్రయ నిర్వాసితులంతా పునరావాస కాలనీల్లో శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధం కావాలని ఆర్డీవో భవానీశంకర్‌ సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం రెల్లిపేట, బొల్లింకలపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసిత గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించారు.

గృహాలు నిర్మించుకోండి
నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్డీవో భవానీశంకర్‌

వచ్చేనెలలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

నిర్వాసితులతో ఆర్డీవో భవానీశంకర్‌

భోగాపురం, ఆగస్టు 3: విమానాశ్రయ నిర్వాసితులంతా పునరావాస కాలనీల్లో శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధం కావాలని ఆర్డీవో భవానీశంకర్‌ సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం రెల్లిపేట, బొల్లింకలపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసిత గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఎయిర్‌పోర్టు ఏర్పాటులో భాగంగా 120 కుటుంబాలు గృహాలు కోల్పోతున్నారని, వీరందరికీ గూడెపువలస సమీపంలో అన్ని సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా కుటుంబాల వారు భూమి పూజచేసి గృహాలు నిర్మించుకోవాలని కోరారు. ఈనెల 8వ తేదీతో ఆషాడం పోతుందని, మంచి రోజులు వస్తున్నాయని అందరూ భూమిపూజ చేసుకోవాలన్నారు. ప్రతీ కుటుంబానికీ ముందుగా రూ.50వేలు అందజేస్తామని, తరువాత రూ.4.35లక్షలు చొప్పున రెండు పర్యాయాలు అందజేస్తామన్నారు. మొత్తం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.9.20 లక్షలు ఇస్తామని చెప్పారు. దీనిపై నిర్వాసితులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందజేయడం దారుణమని, అప్పటితో పోల్చితే ధరలు మూడింతలు పెరిగాయని, రూ.2.84లక్షలతో ఏవిదంగా గృహం నిర్మించుకోగలమని నిరాశ వ్యక్తం చేశారు. అప్పట్లోనే స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే అప్పుడు గృహాలు నిర్మించుకుండేవారమన్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లను ఖాళీ చేయలేమని, నిర్మాణాలు పూర్తయ్యాకే అక్కడికి వెళ్తామన్నారు. ఇసుక, సిమెంట్‌, ఇటుక ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని, సమస్యలు పరిష్కారం అయ్యాకే స్థలాలు ఖాళీ చేస్తామన్నారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తామని, నిర్వాసితుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.కల్పవల్లి, ఎయిర్‌పోర్టు అధికారి అప్పలనాయుడు, హెచ్‌డీటీ డి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

 వచ్చేనెలలో సీఎంతో శంకుస్థాపన

వచ్చేనెలలో ఇక్కడకు సీఎం వచ్చే అవకాశం ఉందని, ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు అవకాశం ఉందని ఆర్డీవో తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, భూసేకరణ కూడా పూర్తి కావస్తోందన్నారు. బీచ్‌ కారిడార్‌, ఎయిర్‌పోర్టు శంకుస్థాపన ఒకే సమయంలో జరిగే అవకాశం ఉందన్నారు. 



Updated Date - 2021-08-04T05:28:19+05:30 IST