మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు.. మమ్మల్ని అవమానించడమే!

ABN , First Publish Date - 2021-11-11T17:20:24+05:30 IST

‘‘గత ఎన్నికల్లో..

మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు.. మమ్మల్ని అవమానించడమే!

కోరి గెలిపిస్తే.. కష్టాలా?

మా సమస్యలు పట్టించుకోరా?

రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు 

జగన్‌ ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదు

జీపీఎఫ్‌ సొమ్మునూ వాడేసుకున్నారు

ఎప్పుడో అప్పుడు జీతాలిస్తున్నామని బుగ్గన అనడం అవమానించడమే

సలహాదారుగా చంద్రశేఖరరెడ్డి నియామకం ఆక్షేపణీయం 

ఆయనపై భూముల కేసుంది 

బెయిల్‌పై బయట తిరుగుతున్నారు 

ఆర్థిక శాఖ, సీఎఫ్ఎంఎస్‌ అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి

ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిప్పులు చెరిగిన సూర్యనారాయణ


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘‘గత ఎన్నికల్లో ఉద్యోగులంతా కోరి మరీ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించారు. అయినప్పటికీ మా సమస్యలను ఆయన ఏమాత్రం పట్టించుకోవటం లేదు’’ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పరిపాలనలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ‘ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తున్నాం కదా’ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులను కించపరచడమేనని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు విజయవాడ కేఎల్‌రావు ఇంజనీరింగ్‌ భవన్‌లో బుధవారం ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు. ఉద్యోగుల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని కోరామని, దాదాపు వంద  సమస్యలను వివరించగా.. 80 అంశాల్లో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. తీరా చూస్తే ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేని వాటి పట్ల కూడా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు.


ఉద్యోగుల సీపీఎస్‌ రద్దుతో పాటు, డీఏల చెల్లింపు, పీఆర్‌సీ అమలు, సాయంత్రం ఐదు తర్వాత పని చేయనక్కర లేదన్న ఎన్నో హామీలను జగన్‌ ఇచ్చారని, రెండున్నరేళ్ల పరిపాలనను పరిశీలిస్తే ఒక్కహామీ కూడా నెరవేరలేదని అన్నారు. పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను కొన్ని  సంఘాలు మభ్య పెడుతున్నాయని ఆరోపించారు. వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా తాము కొనసాగలేమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల జీతాల విషయంలో మంత్రి బుగ్గన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటున్నాయని సూర్యనారాయణ అన్నారు. హైకోర్టులో కూడా ఇదే విధంగా ప్రభుత్వం కౌంటర్‌ వేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే చెల్లించేలా ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే దీనికి సంబంధించి చట్టం తీసుకురావాలన్నారు. 



‘కడప రెడ్డి..’ ఏం సలహాలిస్తారు?

ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారునిగా ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు, ‘కడప రెడ్డి’ ఎన్‌. చంద్రశేఖరరెడ్డిని నియమించిన తీరు ఆక్షేపణీయమని సూర్యనారాయణ అన్నారు. ఉమ్మడి ఏపీ లో హైదరాబాద్‌లోని 182 ఎకరాల ఉద్యోగుల భూములను చంద్రశేఖరరెడ్డి అమ్ముకున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి ఆయన పై క్రిమినల్‌ కేసు పెట్టిందని, హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌పై బయట తిరుగుతున్నారని చెప్పారు. చంద్రశేఖరరెడ్డిపై ప్రభుత్వమే కేసు పెట్టిందని, అదే ప్రభుత్వం ఉద్యోగుల సలహాదారునిగా ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి సలహాలలిస్తారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలన్నారు.


రాజ్యాంగ హక్కునూ హరించారు

ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల జీతం నుంచి దాచుకున్న సొమ్ము జీపీఎఫ్‌ ఖాతాల్లో ఉంటుందని, ఈ సొమ్మును అవసరానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉద్యోగులకు ఉందని తెలిపారు. ఇది సాలీనా రూ.8-10 కోట్ల సొమ్ము ఉంటుందని, దీనిని ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆఖరికి ఈ హక్కును కూడా ప్రభుత్వం హరించి, జీపీఎ్‌ఫను ఆదాయంగా మలుచుకుంటోందని ఆరోపించారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం జీపీఎఫ్‌ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రత్యేక ఖాతాలను పెట్టి ఉద్యోగులకు జీపీఎఫ్‌ నగదు జమ చేయాల్సి ఉండగా.. అక్టోబరు 28వ తేదీన ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేసినట్టు అకౌంటెంట్‌ జనరల్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయన్నారు. ఈ పరిణామాలు చూస్తే ఉద్యోగుల సొమ్ముకు భద్రత ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఉద్యోగుల డీఏ సొమ్ముకు సంబంధించి పోస్ట్‌ డేట్‌ చెక్కులు ఇచ్చి అకౌంట్‌లో వేశారని సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు తెలియకుండా ఆ నగదును విత్‌డ్రా చేశారని ఆరోపించారు. ఉద్యోగుల నుంచి ఏపీజీఎల్‌ సంస్థ ఇన్సూరెన్స్‌లు కట్టించుకుందని, తీరా డబ్బులు చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం దృష్టికి ఆయా సమస్యలను ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పరిష్కారం కావడం లేదన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి సంస్థపై ఫిర్యాదు చేస్తామన్నారు. 


Updated Date - 2021-11-11T17:20:24+05:30 IST