జనరంజకంగా బడ్జెట్‌!

ABN , First Publish Date - 2022-01-23T07:58:01+05:30 IST

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు జోరందుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ బడ్జెట్‌ను జనరంజకంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నారు...

జనరంజకంగా బడ్జెట్‌!

మరింతపెరగనున్న 

ఐటీ పరిమితి

కేపీఎంజీ సర్వే


న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు జోరందుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ  బడ్జెట్‌ను జనరంజకంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నారు. కేపీఎంజీ సంస్థ 200 మంది పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులతో మాట్లాడి ఈ మేరకు ఒక సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో 64 శాతం మంది.. ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 36 శాతం మంది సెక్షన్‌ 80సీ కింద పెట్టుబడులు, వివిధ ఖర్చులకు ప్రస్తుతం ఉన్న రూ.1.5 లక్షల వార్షిక మినహాయింపు పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు.  


సర్వే ఇతర ముఖ్యాంశాలు

 ప్రామాణిక మినహాయింపు ప్రస్తుత రూ.50,000 నుంచి మరింత పెరిగే అవకాశం

 ఇంటి నుంచి పని నేపథ్యంలో ఉద్యోగులకు పన్ను పోటు లేకుండా మరిన్ని అలవెన్సులు, ప్రత్యేక భత్యాలు

 దేశంలోని విదేశీ కంపెనీల శాఖల ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 40 శాతం పన్ను రేటు తగ్గించే అవకాశం


రూ.5 లక్షలకు పన్ను రహిత పీఎఫ్‌ పరిమితి !

రానున్న బడ్జెట్‌లో ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎ్‌ఫ)కు సంబంధించి వేతన జీవులకు ప్రభుత్వం ఊరట కల్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ విషయంలో పన్ను రహిత (టాక్స్‌ ఫ్రీ) కంట్రీబ్యూషన్స్‌ పరిమితిని రెండింతలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2021-22 బడ్జెట్‌లో ఏటా రూ.2.5 లక్షల పీఎఫ్‌ కంట్రీబ్యూషన్స్‌పై ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని ఎంప్లాయర్స్‌తో సంబంధం లేకుండా ఉద్యోగి సొంతంగా నిధులను జమ చేసుకునే అవకాశాన్ని కల్పించటంతో పాటు టాక్స్‌ ఫ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అయితే ఈ చర్యతో ప్రభుత్వంలోని  కొద్దిమంది ఉన్నతాధికారులకు మాత్రమే లబ్ధి చేకూరింది. తాజాగా ఈ బడ్జెట్‌లో వేతన జీవులందరి కోసం పీఎఫ్‌ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పీఎఫ్‌ కంట్రీబ్యూషన్స్‌కు సంబంధించి వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందటంతో బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

Updated Date - 2022-01-23T07:58:01+05:30 IST