ఈసారి జనాకర్షక బడ్జెట్‌?

ABN , First Publish Date - 2022-01-31T07:35:45+05:30 IST

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవ్వనున్నాయి. తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోమారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌పై బడుగు, వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ..

ఈసారి జనాకర్షక బడ్జెట్‌?

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కార్యకలాపాలు

2022-23 ఆర్థిక సర్వే నివేదిక సమర్పణ

అభివృద్ధి రేటు 9% ఉంటుందని అంచనాలు

రేపు ఉదయం నిర్మల బడ్జెట్‌ ప్రసంగం

‘పన్ను’పోటును తగ్గించండి

డెలాయిట్‌ సర్వేలో మెజారిటీ అభిప్రాయం


న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవ్వనున్నాయి. తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోమారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌పై బడుగు, వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై సాగుచట్టాల అంశంపై తీవ్ర వ్యతిరేకత ఉండడం.. నిరుద్యోగిత, సంపన్నులకు అనుకూల సర్కారు అనే ముద్ర పడడం వంటి కారణాలతో ఈ సారి జనాకర్షక బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతికి ఆదాయపన్ను విషయంలో ప్రామాణిక తగ్గింపును(స్టాండర్డ్‌ డిడక్షన్‌)ను పెంచడంతోపాటు.. చిన్న, సూక్ష్మ వ్యాపార సంస్థలు, వ్యవసాయ, గ్రామీణ రంగాలు, మహిళలకు చేయూతనిచ్చే అనేక పథకాలు ప్రవేశపెడతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుసరించిన వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్‌ ఉంటుందని, రానున్న సంవత్సరాలకు దిశా నిర్దేశం చేస్తుందని ఈ వర్గాల అంచనా. ఈ సారి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం తన ఎజెండాను ప్రవేశపెట్టేందుకు, అత్యవసర ప్రజా సమస్యలపై చర్చకు కేవలం 79 గంటల సమయం మాత్రమే ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 11 వరకు జరిగే తొలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో 10 రోజుల పాటు, మార్చి 14-ఏప్రిల్‌ 8 మధ్య మలివిడత సమావేశాల్లో 19 రోజుల పాటు మాత్రమే సభా కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలపై అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు పెద్దగా ఆసక్తి కనబరిచే అవకాశాలు లేవు. అయితే ఈ సమావేశాలను రాజకీయాలకు అనుకూలంగా ఉపయోగించుకుని ఒకరిపై మరొకరు పైచేయి నిరూపించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ ఇలా..

సోమవారం తొలి రోజు భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఉభయ సభల్లో వేర్వేరుగా ఆయన ప్రసంగ ప్రతులను సమర్పిస్తారు. 2022-23 ఆర్థిక సర్వేను కూడా సోమవారమే సమర్పిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9ు అభివృద్ది రేటు ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తొలివిడత బడ్జెట్‌ సమావేశాల్లో ఫిబ్రవరి 11 వరకు రాజ్యసభ ఉదయం 10 నుంచి 3 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. మలి విడత బడ్జెట్‌ సమావేశాల సమయాలను కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత లోక్‌సభ ప్రారంభం అవుతుంది. రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది. మంగళవారం ఉదయం లోక్‌సభలో అత్యంత కీలకమైన సార్వత్రిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెడతారు. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన గంట తర్వాత రాజ్యసభలో బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌ ఉండవు. ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో రోజుకు 5 గంటలకంటే ఎక్కువ సమయం అధికారిక ఎజెండాకు ప్రభుత్వానికి లభించే అవకాశం లేదని, అందుకు ప్రతిపక్షాలు ఎంత సమయం ఇస్తాయో చెప్పలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 27 గంటల ప్రశ్నోత్తరాల సమయం, 15 గంటల ప్రైవేట్‌ సభ్యుల సమయం పోగా, స్వల్పకాల వ్యవధి, సావఽధాన తీర్మానాలపై చర్చలతో పాటు  బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి దాదాపు 79 గంటల పాటు మాత్రమే సమయం మిగులుతుంది. అంతేకాక బడ్జెట్‌ సమావేశాల్లో అత్యధిక సమయం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు.. బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చకే సరిపోతుంది.  


వాడివేడి చర్చలకు విపక్షాలు సిద్ధం

వివిధ అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాస్‌సతో రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు.. ఇలా పలు వర్గాలపై నిఘాపై విపక్షాలు సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి. దీంతోపాటు.. సాగు చట్టాలు, ధరల పెరుగుదల, మొదలైన అనేక అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నాయి. కాగా, బడ్జెట్‌ సమావేశాల్లో మోదీ రెండుసార్లు ప్రసంగిస్తారు. మరోవైపు, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం భేటీ అయ్యారు. కరోనా ఉధృతి నేపథ్యంలో సభ నిర్వహణపై చర్చించారు.

Updated Date - 2022-01-31T07:35:45+05:30 IST