మళ్లీ బాహుబలి పద్దు!

ABN , First Publish Date - 2022-03-06T08:11:58+05:30 IST

కేసీఆర్‌ సర్కారు ఈ సారి ‘బాహుబలి’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సీఎం స్పష్టతనిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎలా ఉండనుంది? వివిధ శాఖలు సమర్పించిన భారీ ప్రతిపాదనలకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయా? సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన..

మళ్లీ బాహుబలి పద్దు!

రూ.2.70 లక్షల కోట్లతో బడ్జెట్‌? సాగు, సంక్షేమానికి పెద్దపీట!

వివిధ శాఖల భారీ ప్రతిపాదనలు 

ఆదాయ వనరులపై సర్కారు నజర్‌

భూముల అమ్మకమే శరణ్యం!

20 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా

దళిత బంధు, నిరుద్యోగ భృతి, 

ఆసరా పింఛన్లకూ కేటాయింపులు?

జీఎస్‌డీపీ పెరుగుదలతో అప్పులో మరింత వెసులుబాటు

ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి 4 శాతంతో మరింత రుణం


హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ సర్కారు ఈ సారి ‘బాహుబలి’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సీఎం స్పష్టతనిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎలా ఉండనుంది? వివిధ శాఖలు సమర్పించిన భారీ ప్రతిపాదనలకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయా? సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ.. వంటి పథకాలకూ నిధులు కేటాయిస్తారా? వాస్తవ ఆదాయం ఆధారంగా ఆయా శాఖలకు కేటాయింపులు ఉంటాయా? రూపాయ రాక.. పోక ఎలా ఉంటుంది? అప్పుల బాట పట్టాల్సిందేనా? భూములు అమ్ముకోవాల్సిందేనా? సర్కారుకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడంతో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ శాఖలు భారీగా నిధులు కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ, ఖజానాకు రాబడులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.


పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటాల ద్వారా ఆశించినంతగా రాకపోయినా.. ఊరటనిచ్చే స్థాయిలో మాత్రం నిధులు సమకూరుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని బడ్జెట్‌లో అంచనా వేసిన మేరకు గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూముల అమ్మకమొక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. దీని ద్వారానే పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ సారి కూడా ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ‘‘ఈసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుందాం.


దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిద్దాం. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి’’ అని కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మరోవైపు ముందస్తు ఎన్నికల వార్తలూ వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ అని, తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఇటీవలే భూముల అమ్మకానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలాంటి సానుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ ‘భారీ’ కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ సారి బడ్జెట్‌ సుమారు రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల మధ్యలో ఉంటుందన్న చర్చ సాగుతోంది. సాగు, సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం ఉండనుంది.


భారీగా ప్రతిపాదనలు..

ఈ సారి వివిధ ప్రభుత్వ శాఖలు భారీగానే ప్రతిపాదనలు సమర్పించాయి. దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు, మన ఊరు-మన బడి వంటివాటికి నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం దళిత బంధుకు రూ.1000 కోట్లు కేటాయించారు. కొత్త బడ్జెట్‌లో దీనికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ చెప్పినందున.. దానికి ఢోకా ఉండదన్న చర్చ జరుగుతోంది. ఈ సారి నిరుద్యోగ భృతికి తప్పకుండా నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. కనీసం 10 లక్షల మంది నిరుద్యోగులకు అమలు చేసినా.. ఈ పద్దు కింద రూ.2,500-3000 కోట్ల వరకు కేటాయించక తప్పదు. మన ఊరు-మన బడి పథకానికి రూ.3000 కోట్లు కేటాయిస్తారని అంటున్నారు. దీన్ని బడ్జెట్‌లో చూపకపోయినా వివిధ సంక్షేమ శాఖలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సమీకరించే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాల్సి ఉందంటూ కేసీఆర్‌ ప్రకటించారు. దీనికోసం కొంత మేర నిధులు కేటాయించక తప్పదు. వృద్ధాప్య పింఛను అర్హత వయసును ప్రభుత్వం 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది.


ఈ పింఛను లబ్ధిదారులు మరో 7 లక్షల వరకు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ పద్దు కింద అదనంగా నిధులను కేటాయించాలి. ప్రస్తుత సంవత్సరంలో ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లను కేటాయించారు. రైతు రుణ మాఫీ కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. రూ.లక్ష లోపు రుణాల మాఫీని అమలు చేయాలంటే దీనికీ నిధులు కేటాయించాల్సిందే. 


రైతుబంధుకు రూ.20 వేల కోట్లు?

భూములు చిన్న చిన్న కమతాలుగా మారుతున్నాయి. ఫలితంగా నానాటికీ రైతుల సంఖ్య పెరుగుతోంది. అందుకే రైతు బీమా ప్రీమియం సొమ్ము పెరుగుతుందని అంటున్నారు. రైతు బంధు పథకానికి ప్రస్తుతం కేటాయించిన రూ.14,800 కోట్లను రూ.20 వేల కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. ఇలా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు నిధులు పెంచాల్సి వస్తుండడంతో వ్యవసాయ పద్దు భారీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సాగుకు రూ.25,000 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6295 కోట్లను కేటాయించారు. కానీ, కొత్త బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. నీటి పారుదల శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.16,931 కోట్లు కేటాయించగా.. కొత్త బడ్జెట్‌లో రూ.32 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది.


భూముల అమ్మకంపైనే నమ్మకం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వం రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఈ జనవరి నాటికి రూ.1,37,190.44 కోట్లను వ్యయం చేసింది. కానీ, ఈ నెలాఖరుకు అన్ని రకాల వ్యయాల మొత్తం రూ.1.80 లక్షల కోట్లకు చేరుతుందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇదే ఊపులో భారీ బడ్జెట్‌కు ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి రాబడులను కూడా అదే స్థాయిలో సమకూర్చుకోవాల్సి వస్తోంది. నిజానికి ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా భారీ ఊరటనివ్వనుంది. 2021-22లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.8721.38 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.7589.58 కోట్లు(87.02%) సమకూరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.17,165.98 కోట్లు విడుదల చేస్తామంటూ కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. అంటే గత నిధుల కంటే ఏకంగా 97% అధికంగా రానున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం ఈసారి పన్నేతర రాబడులపై దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు, భూములు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ (దిల్‌) భూములను అమ్మబోతోంది. వీటి కింద రూ.20 వేల కోట్ల రాబడిని సాధించాలన్న ఆలోచనతో ఉంది. ఇక భూముల మార్కెట్‌ విలువలను ఏడాదికోసారి పెంచాలని ఇదివరకే సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిని పెంచితే అదనంగా మరో రూ.3000 కోట్ల వరకు సమకూరతాయి. ఇటీవలే ఓపెన్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. దీని కింద కొన్ని నిధులు సమకూరతాయి. ఇలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాబడులను పెంచుకునే అవకాశం ఉంది. 


ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 4%తో మరింత రుణం..

ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ 4ు పరిమితితో అప్పు తీసుకోవడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం.. తన జీఎ్‌సడీపీలో 3.5ు మేర అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కరోనా కారణంగా జీఎస్టీ నష్ట పరిహారం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం మరో 0.5ు ఎక్కువగా అప్పు తీసుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిబంధన రానున్న ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి స్థిర ధరల వద్ద జీఎ్‌సడీపీ రూ.11,54,860 కోట్లకు పెరిగినట్లు ఇటీవలే కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి ఈ జీఎ్‌సడీపీ మరింత పెరుగుతుందని, దీంతో అప్పును కూడా భారీగా తీసుకోవచ్చని రాష్ట్రం భావిస్తోంది. 


కేంద్ర గ్రాంట్లే సమస్య..

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పెద్దగా రావడం లేదు. కొత్త సంవత్సరంలోనూ తగ్గుతాయని అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల కింద రూ.38,669.46 కోట్లను అంచనా వేస్తే జనవరి నాటికి రూ.7303.61 కోట్లు(18.89ు) వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి, కేంద్ర గ్రాంట్లను భారీగా అంచనా వేస్తూ బడ్జెట్‌లో చూపిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రాన్ని అభాసుపాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.8177.75 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం 11,598.10 కోట్లు (141.83ు) విడుదల చేసిందని వివరిస్తున్నారు. 2020-21లో రూ.10906.51 కోట్లను అంచనా వేసిందని, కేంద్రం 82.30 శాతం మేర విడుదల చేసిందని బీజేపీ నేతలు వివరిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా రూ.38 వేల కోట్లకు పైగా గ్రాంట్లను ఆశించడం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడానికేనని ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-03-06T08:11:58+05:30 IST