బడ్జెట్‌కు కటకట!

ABN , First Publish Date - 2022-01-22T07:26:35+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభించిన రెండో ఏడాదిలోనే రాష్ట్ర

బడ్జెట్‌కు కటకట!

  • జీఎస్టీతో చేతులు కట్టేసిన కేంద్రం
  • పెట్రోల్‌, మద్యంపై పెంచితే ప్రజాగ్రహమే
  • భూములపై పెంచినా రూ.4 వేల కోట్లే
  • నేల విడిచి సాము కుదరకపోవచ్చు


 

హైదరాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభించిన రెండో ఏడాదిలోనే రాష్ట్ర బడ్జెట్‌ 2.3 లక్షల కోట్లు దాటింది. అందులో ఖర్చు పెట్టింది ఎంత అన్నది పక్కనబెడితే వైరస్‌ భయం తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత భారీ అంచనాలతో వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ప్రభుత్వానికి అంత లగ్జరీ లేదని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. ఉన్న పన్నులను పెంచే, కొత్తగా పన్నులు విధించే మార్గాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది. అవన్నీ కేంద్రం వసూలు చేస్తున్న జీఎ్‌సటీలో కలిసి పోయాయి.


పెట్రోలు, డీజిల్‌, మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌ను పెంచే పరిస్థితి లేదు. దేశమంతటా ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం విజ్ఞప్తిపై రాష్ట్రాలు పన్నులను తగ్గించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ రెండింటిపై పన్నులు పెంచడం రాష్ట్రంలోని అధికార పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. మద్యంపై పెంచుదామంటే... ఇప్పటికే 70 శాతం వ్యాట్‌ అమల్లో ఉంది. దీనిని ఇంకా పెంచితే కల్తీ మద్యానికి గేట్లు ఎత్తినట్లు అవుతుంది. ఇప్పటికే రౌండ్‌ ఫిగర్‌ పేరిట మద్యం ధరలను అమాంతం పెంచేశారు.


రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకొనే ప్రయత్నంలో భాగంగా భూముల మార్కెట్‌ విలువలను పెంచాలని ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు నెలల్లో అవి కార్యరూపం దాల్చవచ్చు. అయితే, అవి ఎంత పెంచినా రూ.3000-4000 కోట్లకు మించి అదనపు ఆదాయం రాదు. రవాణా పన్నులు, చార్జీలను పెంచితే మరో రూ.1000 కోట్ల వరకు సమకూరవచ్చు. గత ఏడాదిలాగా బాహుబలి గణాంకాలు చూపించాలంటే ఈ ఐదు వేల కోట్లు ఏ మూలకు రావు. భూములు అమ్ముదామన్నా అంత సానుకూలంగా ఏమీ లేదు. కోకాపేట భూముల అమ్మకంపై కోర్టులో కేసులు పడ్డాయి. అమ్మకం ద్వారా పెద్దగా రాబడులు వస్తున్న దాఖలాలు లేవు. ఇలాంటి తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌కు రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ ప్రతిపాదనలను అడిగింది. కింద నుంచి ప్రతిపాదనలు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు/ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు చేరాయి. నెలాఖరులోగా ఆర్థిక శాఖకు అందుతాయని భావిస్తున్నారు.


కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా గత సంవత్సరం మార్చి 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కరోనా మూడో వేవ్‌ అడ్డం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలో ఉండే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాబడులు ఆశాజనకంగా లేకపోవడం, కేంద్ర సాయం అంతంత మాత్రంగానే ఉండడంతో బడ్జెట్‌ కసరత్తు అధికారులకు కత్తి మీద సాముగా మారింది. రాబడులను పెంచుకునే మార్గాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ వాస్తవ వ్యయాల ఆధారంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.



వాస్తవ వ్యయ బడ్జెట్‌

వాస్తవ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న ఆర్థిక శాఖ... కొత్త బడ్జెట్‌ను వాస్తవ రాబడుల ఆధారంగా రూపొందిస్తోంది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా పన్నులను పక్కాగా అంచనా వేస్తోంది. ఈ సారి రూ.35,520.30 కోట్ల జీఎ్‌సటీని అంచనా వేస్తే నవంబరు నాటికి రూ.20,859.43 కోట్లే వచ్చాయి.


సేల్స్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.26,500 కోట్లను అంచనా వేయగా...17,181.48 కోట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్లను అంచనా వేస్తే రూ.7028 కోట్లు సమకూరాయి. మిగిలిన 4 నెలల్లో లక్ష్యం నెరవేరడం కష్టంగానే ఉంది. కేంద్రం నుంచి గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద కూడా ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదు. మొత్తం రూ.38,669.46 కోట్లు వస్తాయని ఆశిస్తే... నవంబరు నాటికి రూ.5,687.79 కోట్లే(14.71ు) వచ్చాయి. రాబడులు ఆశాజనకంగా లేకపోవడంతో కొత్త బడ్జెట్‌ను వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ లెక్కన 2021-22కు ప్రతిపాదించిన రూ.2.30 లక్షల కోట్లకు కొంచెం అదనంగా కొత్త బడ్జెట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. 


ఆదాయ పెంపు మార్గాలే లేవు

రాష్ట్రానికి ఆదాయ పెంపు మార్గాలుపెద్దగా లేవు. జీఎ్‌సటీ రేట్లను పెంచాలన్నా, తగ్గించాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జీఎ్‌సటీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రం చేతిలో ఉన్న ‘వ్యాట్‌’ను పెంచుకునే మార్గం పెద్దగా లేదు. భూముల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,557.35 కోట్లను అంచనా వేస్తే... రూ.4,395.12 కోట్లే సమకూరాయి. ప్రజాప్రయోజనాలకు సెంటు భూమి లేకుండా ప్రభుత్వం చేస్తోందంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.


కొంత మంది కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల అమ్మకంపై ప్రభుత్వం కొంత వెనుకంజ వేస్తోంది. హరీ్‌షరావు నేతృత్వంలో ఆదాయ వనరుల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ మధ్య సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. ఇప్పటికే వస్తున్న పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, రవాణా ఆదాయాల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించక తప్పదని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. 




ఇదీ ప్రస్తుత బడ్జెట్‌ పరిస్థితి

2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.2.31 లక్షల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఇతర వ్యయాలను పక్కనబెడితే ప్రధానమైన రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ వ్యయం అంతగా ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిసారి వ్యయాలను ఎక్కువగా చూపడం, తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం ప్రభుత్వాలకు పరిపాటైందని ఆరోపిస్తున్నారు.


ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ ‘కాగ్‌’కు సమర్పించిన నవంబరు నివేదికలో రెవెన్యూ, మూలధన వ్యయాల కింద రూ.1,01,442.64 కోట్లు వ్యయమైనట్లు వివరించింది. మిగిలిన నాలుగు నెలల్లో రూ.50-60 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ఇతరత్రా ఖర్చులు కలుపుకొన్నా మొత్తం వ్యయం రెండు లక్షల కోట్లు దాటడం కష్టం అంటున్నారు.


Updated Date - 2022-01-22T07:26:35+05:30 IST