డొల్ల బడ్జెట్‌! ఆశించిన ఆదాయంలో 50 వేల కోట్లు మాయం..

ABN , First Publish Date - 2022-05-13T07:41:16+05:30 IST

భారీ బడ్జెట్‌ డొల్లతనం బయటపడింది. అంచనా వేసిన ఆదాయంలో మూడో వంతు కూడా రాలేదు! అంచనా వేసిన దాంట్లో ఏకంగా రూ.50 వేల కోట్ల వరకూ ఆదాయం పడిపోయింది! దాంతో, బడ్జెట్లో అంచనా వేసినా...

డొల్ల బడ్జెట్‌! ఆశించిన ఆదాయంలో 50 వేల కోట్లు మాయం..

రూ.1,76,126 కోట్లలో వచ్చింది రూ.1,27,468 కోట్లే

రాబడి 72.37 శాతమే.. అంచనాల్లో మూడోవంతే

గ్రాంట్లు, పన్నేతర రాబడుల్లో తప్పిన భారీ అంచనాలు

ఫలితంగా ఖర్చులోనూ రూ.32 వేల కోట్లకు కోత

సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఖర్చు రూ.50 వేల కోట్లే

అంచనాలను మించి మరీ భారీగా అప్పుల సేకరణ

రూ.6,743 కోట్ల మిగులు అంచనా వేస్తే.. 10,163 కోట్ల లోటుకు

కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌కు ఆర్థిక శాఖ మార్చి నెల నివేదిక

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): భారీ బడ్జెట్‌ డొల్లతనం బయటపడింది. అంచనా వేసిన ఆదాయంలో మూడో వంతు కూడా రాలేదు! అంచనా వేసిన దాంట్లో ఏకంగా రూ.50 వేల కోట్ల వరకూ ఆదాయం పడిపోయింది! దాంతో, బడ్జెట్లో అంచనా వేసినా.. దాదాపు రూ.32 వేల కోట్ల వరకూ ఖర్చు చేయలేకపోయింది. వెరసి, బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అంకెల గారడీ కాగ్‌కు సమర్పించిన నివేదిక సాక్షిగా బట్టబయలైంది. ఏటా ఆకర్షణీయమైన అంకెలతో భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టడం.. చివరికి, ఆదాయం రాలేదంటూ లోటును చూపించడం పరిపాటిగా మారింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఇదే పరిస్థితి. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల కింద 72.37 శాతం నిధులే సమకూరాయి. రాష్ట్ర సొంత పన్ను రాబడులు బాగానే ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, రాష్ట్రం ఆశలు పెట్టుకున్న పన్నేతర రాబడులు అంచనాలను అందుకోలేదు. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్‌ ట్యాక్స్‌, స్టేట్‌ ఎక్సైజ్‌ సుంకాలు, ఇతర పన్నులు, పన్నేతరాలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద బడ్జెట్లో రూ.1,76,126.94 కోట్ల రాబడులను అంచనా వేస్తే.. రూ.1,27,468.54 కోట్లు మాత్రమే సమకూరాయి.


ఈ మేరకు మార్చి నెలతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరపు నివేదికను రాష్ట్ర ఆర్థిక శాఖ ‘కాగ్‌’కు సమర్పించింది. బడ్జెట్‌ పరిమాణాన్ని భారీగా పెంచడానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను, భూముల అమ్మకం ఆదాయాన్ని భారీగా పెంచి చూపించడమే ప్రస్తుత పరిస్థితి కారణమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.38,669.46 కోట్ల గ్రాంట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం రూ.8,619.26 కోట్లనే ఇచ్చింది. అంచనా వేసిన మొత్తంలో ఇది 22.29 శాతమే. నిజానికి, అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను ప్రభుత్వం భారీగా పెంచి చూపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.10,525 కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. రూ.15,471 కోట్లు వచ్చాయి. దీనికితోడు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. దాంతో, ఈ మొత్తాన్ని కూడా కలుపుకొని రూ.38,669 కోట్లను బడ్జెట్లో చూపించింది. చివరకు, రూ.8,619.26 కోట్లు మాత్రమే వచ్చాయి. అయినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా రూ.40 వేల కోట్లకుపైగా బడ్జెట్లో కేంద్ర గ్రాంట్లు కింద చూపించడం గమనార్హం.


ఇక, పన్నేతర రాబడులదీ ఇదే కథ. భూముల అమ్మకం తదితర పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసింది. కానీ, రూ.8,857.37 కోట్లు (28.99 శాతం) మాత్రమే సమకూరాయి. పన్నేతర రాబడుల కింద భారీగా చూపించడం.. అందులో నాలుగో వంతు కూడా రాకపోవడం ఏటా జరుగుతున్న తంతే! అయినా, బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచడానికి ఇదొక సాకుగా మారిందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గ్రాంట్లు, పన్నేతర రాబడులు ఆశించిన మేర రాకపోవడంతో రాష్ట్ర రాబడుల మొత్తం 27.63 శాతం మేర తగ్గిపోయింది. ఇది దాదాపు రూ.50 వేల కోట్లకు సమానం. ఫలితంగా, పథకాలు, ఇతర కార్యక్రమాలకు సర్కారు లక్ష్యం మేర ఖర్చు చేయలేకపోయింది. లక్షిత వ్యయంలో 84.03 శాతం మేర నిధులను ఖర్చు పెట్టగలిగింది. రెవెన్యూ, మూలధన వ్యయాల కింద మొత్తం రూ.1,98,430.21 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయిస్తే మార్చి నాటికి రూ.1,66,737.06 కోట్ల (84.03ు)ను ఖర్చు పెట్టగలిగింది. ఆదాయం రాకపోవడంతో ఖర్చునూ దాదాపు రూ.32 వేల కోట్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. చేసిన ఖర్చుల్లోనూ మార్కెట్‌ రుణాల ద్వారా సేకరించిన నిధులే రూ.47,690.59 కోట్లు ఉండడం గమనార్హం.


బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికి మించి అప్పులు చేయడంతో వ్యయానికి సంబంధించి కాస్త ఊరట లభించింది. ఆర్థిక సంవత్సరంలో రూ.45,509.60 కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయిస్తే.. లక్ష్యానికి మించి 104.79 శాతం మేర అప్పులు తీసుకుంది. ఖర్చుల్లోనూ ప్రధానంగా వేతనాలు, పింఛ న్లు, వడ్డీలకే రూ.73 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యోగుల వేతనాలకు రూ.30,375.10 కోట్లు, సర్వీసు పింఛనర్ల పింఛన్ల కోసం రూ.14,027.98 కోట్లు, అప్పుల వడ్డీలకు రూ.18,688.18 కోట్లు, పథకాల సబ్సిడీల కోసం రూ.10,218.03 కోట్లను ఉపయోగించింది. అంటే, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు; ఇతర శాఖలకు ఏడాదంతా ఖర్చు చేసింది కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే. ఇక, ఆశించిన ఆదాయం రాకపోవడం రెవెన్యూ లోటుకు కారణమైంది. రాష్ట్ర బడ్జెట్‌ మళ్లీ లోటులోకి వెళ్లింది! ఆర్థిక సంవత్సరాంతానికి రూ.6,743.50 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేస్తే.. పరిస్థితి తారుమారైంది. మార్చి నెలాఖరుకు రూ.10,163.96 కోట్ల లోటు తేలింది. నిజానికి, అంతకు ముందు ఏడాదీ రూ.4వేల కోట్లకుపైగా రెవె న్యూ మిగులు ఉంటుందని అంచనా వేస్తే.. ఏకంగా రూ.18వేల కోట్లకుపైగా లోటు తేలింది. బడ్జెట్లో రెవెన్యూ మిగులు చూపించడం.. వాస్తవానికి వచ్చేసరికి అది కాస్తా లోటుగా తేలడం పరిపాటిగా మారింది. భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పుకోవడానికి వాస్తవాలకు విరుద్ధంగా అంకెల గారడీ చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read more