ఉపాధి హామీ కేటాయింపులు పెరిగేనా?

ABN , First Publish Date - 2022-01-28T06:33:00+05:30 IST

కొవిడ్ విపత్తులో పేదలను ఆదుకోవడానికి ఎంతగానో ఉపకరించిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికిగత ఆర్థిక సంవత్సరంలో కంటే 2022–-23 సంవత్సర బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరమున్నది....

ఉపాధి హామీ కేటాయింపులు పెరిగేనా?

కొవిడ్ విపత్తులో పేదలను ఆదుకోవడానికి ఎంతగానో ఉపకరించిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికిగత ఆర్థిక సంవత్సరంలో కంటే 2022–-23 సంవత్సర బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరమున్నది. రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయిస్తేనే గ్రామీణ ప్రాంత పేదలను ఆదుకోవడం సాధ్యమవుతుంది. పేదల సంక్షేమానికి మోదీ సర్కార్ ఎంతవరకూకట్టుబడి ఉందనేది ‘ఉపాధి హామీ’కేటాయింపులే నిగ్గు తేలుస్తాయి.


మనదేశంలో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మించిన మీడియా ఈవెంట్‌లు దాదాపుగా ఏవీ లేవు. దేశవ్యాప్తంగా ధనిక, పేద తేడా లేకుండా అన్ని వర్గాల దృష్టి పార్లమెంట్ వైపు లాక్కునే ఏకైక ఈవెంట్ ఇదేనేమో.ప్రభుత్వ విధానాలు ‘బడ్జెట్’ నుంచి మనకు తేటతెల్లమవుతాయి. ప్రభుత్వ ఆదాయ-–వ్యయాల వివరాలు, దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి బడ్జెట్ పత్రాలు ఉపకరిస్తాయి. అలాగే ధరల పెరుగుదల,- తగ్గుదలలు, సంక్షేమానికి కేటాయింపులు సాధారణ ప్రజా జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రజలు బడ్జెట్ రోజున టెలివిజన్‌కి అతుక్కుపోతారు. కార్పొరేట్లు తమకు పన్ను మినహాయింపుల కోసం, ఇతర రాయితీల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు పౌరసమాజ సంస్థలు సామాజిక అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులు పెంచమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతు. దీనినిబట్టి బడ్జెట్ ప్రక్రియ కేవలం ఆర్థిక కసరత్తు మాత్రమే కాక కీలకమైన రాజకీయ కసరత్తు అని అర్థం చేసుకోవచ్చు.


చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే భారత రాజ్యాంగంలో మనకు బడ్జెట్ అనే పదం కనపడదు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) భారత ప్రభుత్వం అంచనా వేసిన రసీదులు, వ్యయాల ప్రకటనను పార్లమెంటు ముందు ఉంచాలి. ‘వార్షిక ఆర్థిక ప్రకటన’ పేరుతో ఉన్న ఈ ప్రకటనే ప్రధాన బడ్జెట్ పత్రం.


లక్షల మందిని పొట్టనపెట్టుకుని, ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసి, కోట్లాది ప్రజల ఉపాధిని పొట్టన పెట్టుకున్న కొవిడ్ రెండవ వేవ్ తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కొవిడ్ కారణంతో కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గత సంవత్సరం దేశంలో కనిష్ఠ ఆదాయం పొందుతున్న 20 శాతం మంది ఆదాయం 53 శాతం తగ్గినట్లు, అంత కంటే పైన ఉన్న 20% మంది ఆదాయం 32% తగ్గినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జీడీపీ, నిరుద్యోగిత రేటు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. అయితే పేదలను ఆదుకోవడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపకరించిందని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–-21లో ఉపాధి హామీ పనులు 46శాతం పెరగడమే దీనికి తార్కాణం.


దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తన 4వ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న తరుణంలో 2022–23 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపు ఎంత అవసరం ఉంటుందో అంచనా వేద్దాం. పథకంలో కార్మికుల వేతనాల మొత్తం ఖర్చు, మెటీరియల్ ఖర్చులో 75 శాతం, పథకం అమలు చేయడానికి అవసరం అయ్యే పరిపాలనా ఖర్చులు (అధికారుల జీతభత్యాలు, పని ప్రదేశంలో నీడ తదితర ఖర్చులు) కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి రావాలి. మెటీరియల్ ఖర్చులో 25 శాతం, 15 రోజులలోపు వేతన ఉపాధిని అందించలేని పక్షంలో చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి, రాష్ట్ర ఉపాధి హామీ మండలి పరిపాలనా ఖర్చులు రాష్ట్రం భరిస్తుంది.


ఇప్పుడిక అసలు ప్రశ్నకు వస్తే ఉపాధి హామీ చట్టం నిధుల అంచనా కోసం స్పష్టమైన పద్ధతిని నిర్దేశించింది. చట్టంలోని పేరా 7, షెడ్యూల్ (1) ప్రకారం గ్రామసభలలో వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన పనుల జాబితా, ఎన్ని కుటుంబాలు ఉపాధి హామీ పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి, ఎన్ని రోజులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి తదితర అంశాల గురించి చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. విస్తృతంగా గ్రామస్థాయిలో కసరత్తు జరిగిన తరువాత మండల, జిల్లా పరిషత్‌ల స్థాయిలో ఆమోదం పొందిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర కార్యాలయాలకు చేరుకుంటాయి. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని క్రోడీకరించి కేంద్రానికి పంపుతారు. అయితే అసలు కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది. గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలు పాక్షికంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందుతున్నాయి. ఉపాధి హామీ బడ్జెట్‌లో కోతలు విధించడం సాధారణమయిపోయింది.


ముందుగా ఆమోదించిన పని దినాలు పూర్తిచేస్తే మరల పెంచుతామని కేంద్రం చెబుతూ వస్తోంది. ఉదాహరణకు 2018-–19 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 24 కోట్ల పనిదినాలకు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ముందుగా కేవలం 8 కోట్ల పనిదినాలకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఇలా డిమాండ్‌ను రేషన్ చేయడం వలన కార్మికులకు పని దొరకడం లేదు.


ఇప్పుడిక అంకెలలో చూస్తే అసలు కథ అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఉపాధి హామీలో 16 కోట్ల గ్రామీణ కుటుంబాలు నమోదు చేసుకుంటే అందులో కేవలం 9.9 కోట్ల కుటుంబాలవారు మాత్రమే పనికి హాజరవుతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో సగటు పనిదినాలు, 100 రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య, తదితర అంశాలను లెక్క వేయడానికి పనికి హాజరైన అంకెల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం వలన అవి మనకు అసలు కథను అందించవు. ఇక పనికి హాజరయ్యేవారు సైతం పూర్తిస్థాయిలో పని పొందుతున్నారా అంటే, అదీ లేదు. 2020-–21లో కేవలం 72 లక్షల కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని పొందారు. అలాగే ప్రతి కుటుంబానికి సగటున 52 రోజుల పని మాత్రమే లభించింది.


ప్రతి సంవత్సరం పథకానికి నిధులు పెంచామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, అందులో ముందు సంవత్సరపు బకాయిలు చెల్లింపుల కోసమే పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు 2021–-22 సంవత్సరానికి ఉపాధి హామీకి కేటాయించిన 73 వేల కోట్ల రూపాయలలో 26శాతం 2020–21 సంవత్సరపు బకాయిలు తీర్చడానికే సరిపోయింది. గత 5 సంవత్సరాలలో దాదాపు 20 శాతం నిధులు ముందు సంవత్సరం బకాయిలు తీర్చడానికి ఖర్చయ్యాయి. 2020–21 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన రూ. 61,500 కోట్లకు అదనంగా మరొక రూ. 40 వేల కోట్లు మంజూరయినా సంవత్సరం పూర్తి అయ్యేసరికి రూ. 17 వేల కోట్ల మేరకు బకాయిలు ఉండిపోయాయి.


ఇక ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ కేటాయించాలో లెక్కకడదాం. 2021–22 నాటికి సగటు వేతనం 210 రూపాయలు. వచ్చే సంవత్సరానికి అంటే 2022–-23కి వేతనాలు అయిదు శాతం పెరుగుతాయని ఊహిస్తే ఈ సంవత్సరం సగటు వేతనం దాదాపు రూ.220 అవుతుంది. మొత్తం ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గత సంవత్సరం పని చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 7.6 కోట్ల కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వీరికి 100 రోజులు పని కల్పించాలంటే మొత్తం 760 కోట్ల పనిదినాలకు వనరులు కేటాయించాలి. దీని కోసం రూ.1,67,200 కోట్లు వెచ్చించాలి. ఇక మెటీరియల్ ఖర్చులు నిమిత్తం 30 శాతం కేటాయిస్తే, రూ.50వేల కోట్లు అవసరమవుతాయి. అయితే అందులో నుంచి రాష్ట్ర వాటా మినహాయిస్తే రూ.37.5వేల కోట్లు కేంద్రం కేటాయించాలి. ఇక 2020–21 ప్రాతిపదికన పరిపాలన ఖర్చులు లెక్కగడితే రూ.6,360 కోట్లు అవుతుంది. ఇక గత సంవత్సరపు పరిస్థితులే నెలకొని ఉంటే ఈ సంవత్సరాఖరుకు రూ.21,361 కోట్ల బకాయిలు ఉంటాయని ‘పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ’ అనే సంస్థ లెక్కగట్టింది. అంటే ఆ మేరకు వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో కలపాలి. ఇవన్నీ లెక్కగట్టిన తర్వాత 2022–23 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో 2.3లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది.


అయితే కేటాయించిన సొమ్ము విడుదల చేయడంలో జరుగుతున్న ఎనలేని జాప్యం కూడా పథకం ముఖ్య ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తోంది. ఉదాహరణకు ఉపాధి హామీ కార్మికులు 15 రోజులలో వేతనం పొందాల్సి ఉండగా, ఝార్ఖండ్ రాష్ట్రంలో -కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 29 రోజుల వరకు వేతనాలు అందడం లేదని ‘లీబ్ టెక్ ఇండియా’ సంస్థ తన పరిశోధనలో తేల్చింది. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఉంది. కొవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థని తిరిగి పునరుజ్జీవం పొందేలా చేయడానికి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడం అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం గుర్తుచేసుకోవడం అవసరం. 


అవసరమైన మేరకు నిధుల కేటాయింపులు జరిపితేనే గ్రామీణ ప్రాంత పేదలను ఆదుకున్నట్లవుతుంది, చట్టం ప్రజలకు చేసిన హామీలను నిలబెట్టుకున్నట్లవుతుంది. ఈ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ఎంతవరకూ కట్టుబడి ఉందో ప్రజలు తెలుసుకోవడానికి ‘గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు’ ఒక లిట్మస్ పరీక్ష.


చక్రధర్ బుద్ధ

Updated Date - 2022-01-28T06:33:00+05:30 IST