నాలుగో ఏడాదీ నిరాశే.. బడ్జెట్‌లో అమరావతి మాటే లేదేం..!

ABN , First Publish Date - 2022-02-02T06:29:59+05:30 IST

కేంద్ర బడ్జెట్‌ వరసగా నాలుగో ఏడాదీ నిరాశే మిగిల్చింది.

నాలుగో ఏడాదీ నిరాశే.. బడ్జెట్‌లో అమరావతి మాటే లేదేం..!

  • విభజన హామీల ఊసే లేదు
  • రాజధాని అభివృద్ధికి నిధుల్లేవు
  • నదుల అనుసంధానంపై డీపీఆర్‌


కేంద్ర బడ్జెట్‌ వరసగా నాలుగో ఏడాదీ నిరాశే మిగిల్చింది. విభజన హామీలపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం రాజధాని ప్రాంతవాసులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధాని ప్రాంతంపై పూర్తిస్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని ఏపీ బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నా, వాస్తవం దానికి విరుద్ధంగా ఉందని కేంద్ర బడ్జెట్‌ ద్వారా మరోసారి స్పష్టమైంది. అమరావతికి నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనం.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పదే పదే అదే అన్యాయం. కేంద్ర పాలకులు బడ్జెట్‌లో అమరావతికి మరోసారి రిక్తహస్తం చూపారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఏడేళ్ల కాలంలో ఒక్క ఏడాది మాత్రమే అమరావతికి రూ.1500 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌ సమయంలో మూడు రాజధానుల చట్టం ఉండటంతో దాని సాకుతో నిధులను కేటాయించలేదని అంతా భావించారు. ప్రస్తుతం సీఆర్డీయే చట్టం అమలులో ఉంది. ఇప్పుడు రాజధానికి నిధులు కేటాయించేందుకు అడ్డంకి ఏమిటో కేంద్రమే చెప్పాలి. ఆదాయపు పన్ను శ్లాబులు పెంచుతారని వేతనజీవులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. వారికీ నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో సోలార్‌ ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకం కోసం రూ.19,500 కోట్లు కేటాయించారు. ఇది సౌర విద్యుత్‌ ఖర్చులను తగ్గించవచ్చని భావిస్తున్నారు. 


నదుల అనుసంధానంపై డీపీఆర్‌

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుంధానానికి డీపీఆర్‌ తయారీ ప్రకటన జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లావాసులకు కూడా ఊరట కలిగించే అంశం. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తయింది. నాడు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకొచ్చారు. ఫలితంగా జిల్లాలో రైతులు తుఫానుల బారిన పడకుండా ముందస్తుగా సాగు చేసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలోనే గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టారు. టెండర్లు పిలిచి మెఘా సంస్థకు పనులు కూడా అప్పగించారు. ఐదు దశల్లో ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో ఈ పనులు అటకెక్కాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మళ్లీ నదుల అనుసంధానం అంశం తెరపైకి వచ్చింది.


అమరావతికి తీరని అన్యాయం

కపట నినాదాలు, వట్టి మాటలు తప్ప బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న ధరలు, నిరుద్యోగం, కరోనా, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కారాలు లేవు. కరోనా సమయంలోనూ సంపద పెంచుకున్న కార్పొరేట్‌లపై ఒక్క శాతం కూడా అదనంగా పన్నులు విధించడానికి సిద్ధం కాకుండా, తమది కార్పొరేట్‌ పక్షపాత ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉనికినే కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు లేదు. విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు. రాజధాని అమరావతికి బడ్జెట్‌లో ఒక్కపైసా కేటాయించలేదు. - సీహెచ్‌ బాబూరావు, రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్‌


రాష్ట్రానికి నిండు సున్నా

పార్లమెంటులో మన రాష్ట్రానికి చెందిన 28 మంది ఎంపీలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండి చెయ్యే మిగిలింది. పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడం బాధాకరం. జాతీయ భద్రతా పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకునే యత్నం చేసింది. నదుల అనుసంధానంపై ముందడుగు వేయడం అభినందనీయం.  - కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎంపీ


ప్రజలకు నిరుత్సాహమే

పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలూ కల్పించలేదు. డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేయడం వల్ల ప్రొడక్టివిటీ ఆఫ్‌ ఇండస్ట్రీ వేగం పుంజు కుంటుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. - దాసరి రామకృష్ణ, సీఐఐ, ఏపీ ఇమిడియట్‌ పాస్ట్‌ చైర్మన్‌ 


ఎలాంటి రాయితీలూ లేవు

ఎలాంటి రాయితీలనూ ప్రకటించకపోవడం నిరుత్సాహ పరుస్తోంది. కానీ ఇన్‌ఫ్రాను గ్రోత్‌ ఇంజన్‌గా పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినందున దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుంది. నదుల అనుసంధానంతో జల రవాణాతోపాటు అనేక ప్రయోజనాలు చేకూరతాయి. - వి.వెంకటేశ్వరరావు, కో-కన్వీనర్‌, సీఐఐ ఏపీ సీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్యానెల్‌ 


టూరిజంకు కాస్త ఊరట

కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న టూరిజం హాస్పిటాలిటీకి చేయూతనిచ్చేందుకు రూ.50 వేల కోట్లు కేటాయించడం స్వాగతించాల్సిన అంశం. ఆక్వా ఎగుమతులపై ఎక్సైజ్‌ డ్యూటీని ఐదు శాతం తగ్గించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. కిసాన్‌ డ్రోన్‌ శక్తి స్కీం ద్వారా ఔత్సాహికులకు ప్రయోజనం చేకూరుతుంది. - తరుణ్‌ కుమార్‌ కాకాని, కో-కన్వీనర్‌, సీఐఐ ఏపీ టూరిజం ప్యానెల్‌ 


సామాన్యులకు ప్రయోజనాల్లేవు

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు నేరుగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు. కానీ అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినందున భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సి.నీలిమ, వైస్‌ చైర్‌పర్సన్‌,  సీఐఐ విజయవాడ జోన్‌ 


ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం

మైక్రో, స్మాల్‌ ఇండస్ట్రీస్‌కు ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త ఉత్సాహం వస్తుంది. రవాణా రంగంలో ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావించడం మంచిదే.  - డాక్టర్‌ వెంకటరమణ ఆకుల, సీఈవో, ఫౌండర్‌, అవేరా (ఎలకా్ట్రనిక్‌ వెహికల్స్‌) 

Updated Date - 2022-02-02T06:29:59+05:30 IST