పద్దులో పైసల్లేవ్‌.. : Budget లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. శివార్లకు కాస్త ఊరట

ABN , First Publish Date - 2022-03-08T12:58:57+05:30 IST

పద్దులో పైసల్లేవ్‌.. : Budget లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. శివార్లకు కాస్త ఊరట

పద్దులో పైసల్లేవ్‌.. : Budget లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. శివార్లకు కాస్త ఊరట

హైదరాబాద్ సిటీ : అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి, పెట్టుబడుల స్వర్గధామం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా విరాజిల్లుతున్న మహానగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో నయాపైసా ఇవ్వలేదు. పూర్తయిన, పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల కోసం చేసిన రుణాల చెల్లింపు తప్ప అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు లేవు. మెట్రోకు రూ.877 కోట్లు కేటాయించినా.. ఆ స్థాయిలో నిధుల విడుదల ఉంటుందా అనేది అనుమానమే. అయితే.. విస్తరిత అభివృద్ధిపై మాత్రం సర్కారు దృష్టి పెట్టింది. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లోమరేషన్‌ కింద రూ.150.94 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. శివారు ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు గ్రేటర్‌ చుట్టూ విద్యుత్‌ వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.


జీహెచ్‌ఎంసీకి రిక్తహస్తం..

అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైన బల్దియాకు బడ్జెట్‌లో రిక్తహస్తం చూపారు. కీలకమైన ప్రాజెక్టులు చేపట్టే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించిన సర్కారు ఆర్థిక చేయూతనివ్వలేదు. అప్పులకు రుణాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌పై అధికారులు పెట్టుకున్న భారీ ఆశలు నీరుగారిపోయాయి. నిర్వహణ వ్యయం, ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను, వృత్తి పన్ను పరిహారం, మోటార్‌ వాహనాల నష్ట పరిహారం కింద రూ.27.93 కోట్ల కేటాయింపు మినహా మిగతావి నిల్‌.


ఎస్‌ఆర్‌డీపీ పరిస్థితేంటి..?

ఎస్‌ఆర్‌డీపీలో రూ.2500 కోట్లకుపైగా విలువైన వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రూపీ టర్మ్‌ లోన్‌ రూ.2500 కోట్లలో రూ.1900 కోట్లు ఖర్చయ్యింది. మరో రూ.600 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ వాటా మొత్తం ఖర్చు చేస్తేనే.. మిగతా మొత్తం విడుదల చేస్తామని బ్యాంకు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఎస్‌ఆర్‌డీపీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో వరద ప్రవాహ వ్యవస్థకు సమగ్ర పరిష్కారం చూపుతామని తొలుత అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎనిమిదేళ్లయినా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ముంపునకు పరిష్కరంగా రూ.858 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ ప్రారంభించారు. ఈ పనులకు నిధులెలా..? అన్న దానిపై స్పష్టత లేదు. 


హెచ్‌ఎండీఏకు నిధులు నిల్‌.. ఔటర్‌ రుణాలకు రూ.200 కోట్లే

బడ్జెట్‌లో హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలకు, కేటాయింపులకు పొంతన లేదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు రుణాల చెల్లింపుల కోసం రూ.200 కోట్లను కేటాయించగా, సంస్థ చెల్లించిన రుణాలకు మాత్రం రూ.10 లక్షలే కేటాయించారు. ఔటర్‌ కాంట్రాక్టర్లకు ఏటా రూ.338.52 కోట్లు యాన్యూటీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్నాళ్లుగా హెచ్‌ఎండీఏనే చెల్లిస్తోంది. ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ సుమారు రూ.1300 కోట్ల వరకు ఔటర్‌ యాన్యూటీ చెల్లింపులు చేసింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10లక్షలు మాత్రమే కేటాయించారు. అలాగే, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసం కొన్నాళ్లుగా నిధులు కేటాయించడం లేదు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు సంస్థనే నిధులు సమకూర్చుకుంటోంది.  


కుడాకు రూ.11.45 కోట్లు

కులీ కుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా)కి గ్రాంట్ల కింద రూ.11.45 కోట్లు కేటాయించారు. వేతనాలు, నిర్వహణ వ్యయానికి ఈ నిధులు వెచ్చించనున్నారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుల (సీపీపీ)లో భాగంగా ప్రస్తుతం చారిత్రక కట్టడం చుట్టూ పనులను కుడా చేపడుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా పద్దులో నిధుల ఊసు లేదు.


వాటర్‌బోర్డుకు గతం కంటే తక్కువే..

వాటర్‌ బోర్డుకు తగిన నిధులు కేటాయించలేదు. కేవలం రుణాల చెల్లింపుల కోసమే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. బోర్డు రూ.2700 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, రూ.1925 కోట్లను మాత్రమే కేటాయించారు. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2381.52 కోట్లను కేటాయించారు. దాంతో పోల్చితే తాజా బడ్జెట్‌లో రూ.456.52 కోట్లు తక్కువ. జీహెచ్‌ఎంసీతో పాటు కంటోన్మెంట్‌ పరిధిలో అమలవుతున్న నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి రూ.300 కోట్లను ప్రగతి పద్దు కింద కేటాయించారు. సుంకేశుల ప్రాజెక్టుకు రూ.725 కోట్లను కేటాయించారు. కేశవపూర్‌ రిజర్వాయర్‌కు నయా పైసా కేటాయించలేదు. 


మూసీకి కేటాయింపులు సరే.. నిధులెక్కడ? 

మూసీనది సుందరీకరణకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించారు. అయితే ఈ నిధులను విడుదల చేస్తారా, లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతేడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.6 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అంతకముందు రెండు బడ్జెట్‌లలో మొత్తం రూ.754 కోట్లు కేటాయించినా, నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో మూసీనదికి కేటాయించిన నిధులు ఇప్పుడైనా విడుదల చేస్తారా లేదా, మరో శాఖకు దారి మళ్లిస్తారా అనేది చూడాలి.


త్వరలో కమాండ్‌ కంట్రోల్‌..

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్‌ నిర్మూలన, సైబర్‌క్రైమ్‌ అరికట్టడం, ట్రాఫిక్‌ సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకున్నారు. నిధులు కేటాయించారు. ఈ మేరకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని సభలో మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రకటన పోలీసు అధికారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1654.65 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే రూ.363.07 కోట్లు పెంచారు. నిర్వహణ వ్యయం పెంచినప్పటికీ ప్రగతి పద్దు బడ్జెట్‌లో కోత విధించడం నిరుత్సాహ పరిచింది. ప్రగతి పద్దులో గతేడాది రూ. 230.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 206.7 కోట్లు కేటాయించారు. డ్రగ్స్‌ నిర్మూలన నిమిత్తం ఏర్పాటు చేసిన కొత్త విభాగం హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) కార్యకలాపాలకు ప్రత్యేకంగా రూ. కోటి కేటాయించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి బడ్జెట్‌లో అంచనాగా రూ. 95.82 కోట్లు కేటాయించారు. పనులు చివరి దశలో ఉన్నందున త్వరలోనే కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభోత్సవం ఉంటుందని హరీశ్‌రావు ప్రకటించారు.


శివారు అభివృద్ధికి ప్రత్యేక నిధి

గ్రేటర్‌పై ఒత్తిడి తగ్గించేలా అవతల ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి ఆస్కారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి.. అవసరాన్ని బట్టి వివిధ విభాగాలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా బడ్జెట్‌లో అర్బన్‌ అగ్లమరేషన్‌ కింద ప్రత్యేక నిధి కేటాయించారు. ఆ నిధులను ఆయా శాఖలు పనులకు వెచ్చించే వెసులుబాటు కలుగుతుంది. అయితే.. ఔటర్‌ వరకు అభివృద్ధి, ఇతరత్రా పనుల కోసం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1962.22 కోట్లు ప్రతిపాదించిన ఆర్థిక శాఖ సవరణ పద్దులో రూ.1132.05 కోట్లకు తగ్గించింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని గణనీయంగా తగ్గించి రూ.150 కోట్లుగా పేర్కొనడం గమనార్హం.


గ్రేటర్‌ చుట్టూ విద్యుత్‌ వలయం

గ్రేటర్‌లో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు గ్రేటర్‌ చుట్టూ విద్యుత్‌ వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గ్రేటర్‌ చుట్టూ 400 కేవీ, 200 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో హరీశ్‌ రావు తెలిపారు. గతంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌ ఉండేవని, ప్రస్తుతం 24 గంటల విద్యుత్తుతో మూడు షిఫ్టుల్లో కార్మికులకు ఉపాధి లభిస్తోందన్నారు.


ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోళ్లపై స్పష్టత కరువు

గ్రేటర్‌ ఆర్టీసీకి బడ్జెట్‌లో కేటాయింపులు అంతంత మాత్రమే. బడ్జెట్‌లో టీఎస్‌ఆర్టీసీకి రూ. 1500 కోట్లు కేటాయించగా గ్రేటర్‌కు రూ.400-500 కోట్ల వరకు నిధులు దక్కే అవకాశముంది. రెండేళ్లుగా కొవిడ్‌తో భారీ నష్టాలు మూటగట్టుకున్న గ్రేటర్‌ ఆర్టీసీకి ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. ఎలక్ర్టిక్‌ బస్సుల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదు.


నిర్వహణకు ప్రాధాన్యం

ట్రై కమిషనరేట్స్‌ నిర్వహణకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగుల జీతభత్యాలు, అంతర్గత ప్రయాణాలు, కార్యాలయాల ఖర్చులు, బందోబస్తు ఖర్చులు, వాహనాల మెయింటెనెన్స్‌ తదితర వాటికి నిధులు పెంచారు. ప్రగతి పద్దు అంటే.. రివార్డులు, విదేశీ ప్రయాణాలు, వస్తు సరఫరా, ప్రింటింగ్‌, ప్రకటనలు, సీక్రెట్‌ సర్వీస్‌ వ్యయాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, సీసీఎస్‌ నిర్వహణ, హెచ్‌-న్యూ, స్పోర్ట్స్‌, డ్యూటీ మీట్స్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌, విమెన్‌ అండ్‌ చైల్డ్‌ సంరక్షణ, సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్లుగా తీర్చి దిద్దడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి వాటికి నిధులు తగ్గాయి.


రాచకొండకు కార్యాలయం నిర్మించేనా? 

ఈ ఏడాది కూడా రాచకొండ కమిషనరేట్‌ నిర్మాణానికి పెద్దగా కేటాయింపులు లేవు. మూడేళ్లుగా రూ. కోటికి మించి ఇవ్వకపోవడంతో పనులు సాగడం లేదు. కమిషనరేట్‌ నిర్మాణానికి మేడిపల్లిలో 56 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో అనేక వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వం ఆ వివాదాలను పరిష్కరించింది. అనంతరం మూడేళ్ల క్రితం రూ. 2.5 కోట్ల వ్యయంతో 56 ఎకరాల చుట్టూ ప్రహారీ నిర్మించారు. దేశంలోనే అతిపెద్దదైన రాచకొండ కమిషనరేట్‌ను ఇతర కమిషనరేట్లకు భిన్నంగా అన్ని విభాగాల కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా నిర్మిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. రాచకొండ కమిషనరేట్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


సైబరాబాద్‌ - రాచకొండ 

సైబరాబాద్‌లో గతేడాది నిర్వహణ వ్యయం కింద బడ్జెట్‌లో రూ. 283.60 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది 471.59 కోట్లు కేటాయించింది. రాచకొండకు గతేడాది రూ.335.59 కోట్లు కేటాయిస్తే, ఈ సారి 538.11 కోట్లు కేటాయించింది. అయితే ప్రగతి పద్దును ఏ మాత్రం పెంచలేదు. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా సైబరాబాద్‌కు రూ. 20 కోట్లు కేటాయిస్తే, రాచకొండకు రూ. 15.86 కోట్లు కేటాయించారు.


మెట్రోకు భారీ ఊరట

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న హైదరాబాద్‌ మెట్రోను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో గతం కంటే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. మెట్రో కారిడార్‌-2లో మిగిలిన పాతబస్తీ మార్గాన్ని పూర్తి చేసేందుకు తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. తాజాగా ఫలక్‌నుమా వరకు మెట్రో పొడిగించేందుకు నిధులు కేటాయించడంతో ఎల్‌అండ్‌టీ పనులు ప్రారంభించనుంది. మరో రూ. 1200 కోట్లు ఇస్తేనే పనులు సకాలంలో పూర్తవుతాయని పేర్కొంటోంది. శంషాబాద్‌ వరకు మెట్రో సేవలను పొడిగిస్తామని 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పనుల్లో జీఎంఆర్‌ సంస్థను కూడా జత చేసింది. 31 కిలో మీటర్ల మార్గానికి సుమారు రూ.4వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ఎల్‌అండ్‌టీ ఆంచనా వేసి మూడేళ్ల క్రితమే డీపీఆర్‌ను సిద్ధం చేసింది. తాజా బడ్జెట్‌లో రూ.377.35 కోట్లు కేటాయించడంతో ఈ పనులకు అంకురార్పణ జరిగే అవకాశం ఉంది. 


రూ. 1500 కోట్లు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎల్‌అండ్‌టీని ఆదుకోవడంలో భాగంగా 2020-21 వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.20 కోట్లను మాత్రమే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. 2021-22లో రూ.1000 కోట్లు, తాజా బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.1000 కోట్లలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుత కేటాయింపుల్లో ఎంత వరకు చెల్లిస్తారనేది వేచి చూడాలి.


‘ఎంఎంటీఎస్‌’కు మళ్లీ మొండిచేయి

బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించింది. మెట్రోకు రూ.2,377.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు రూపాయి కూడా మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వాటా కింద రూ.631 కోట్లను చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లుగా బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ ప్రస్తావనే  ఉండడం లేదు. 


యాదాద్రికి మూడో దశ ఇప్పట్లో లేనట్టే..

తిరుమల పుణ్యక్షేత్రం తరహాలో అభివృద్ధి చేయనున్న యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేయడంతో మూడేళ్ల క్రితం రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టును పొడిగించాలని (ఎంఎంటీఎస్‌ మూడో దశ పేరిట) నిర్ణయించింది. ఇందుకు రూ. 330 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాకపోవడంతో వ్యయం పెరుగుతూ వస్తోంది. తాజా బడ్జెట్‌లో కొంత మేరకు నిధులు కేటాయిస్తే యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పొడిగింపు కోసం టెండర్లు ఆహ్వానించవచ్చని అధికారులు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావనే లేకపోవడంతో ఇప్పట్లో టెండర్లు ఆహ్వానించడం సాధ్యం కాదని చెబుతున్నారు. 

Updated Date - 2022-03-08T12:58:57+05:30 IST