సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌

ABN , First Publish Date - 2021-01-22T09:43:18+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వైపు అందరి చూపు మళ్లింది. కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి తోడు...

సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వైపు అందరి చూపు మళ్లింది. కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి తోడు దేశవ్యాప్తంగా ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో వరదలు, అతివృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్‌‌, నేపాల్‌, చైనా వంటి ఇరుగుపొరుగు దేశాల నుంచి కూడా రోజు ఏదో ఒక రూపంలో సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో భారత సామాజిక వ్యవస్థను గాడిన పెట్టడానికి నిర్మలమ్మ ఏ తాయిలాలు తీసుకొస్తున్నారో... సామాన్యులకు ఎటువంటి ఊరట లభిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కొంత మేర ఆదుకోవడానికి ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రభుత్వం లక్షలాది కోట్లు సంక్షేమ పథకాలకు, రాయితీలకు కేటాయించింది. అయితే, అవి అసలైన అర్హులకు, లబ్దిదారులకు కనీసం 30 శాతం చేరలేదు. పాలకులలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించడం వల్ల ప్రజలు కూడా తీసుకుంటున్న ఋణాలను, పొందుతున్న రాయితీలను తాత్కాలిక ప్రయోజనాలకు, విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని సామాన్యులకు తాయిలాలు ఇస్తూ నేతలు వందలాది కోట్లు మేస్తున్నారు. భారత నేతలు, కుబేరులకు సంబంధించిన నల్లధనం స్విస్‌ బ్యాంకుతో పాటు ఇతర దేశాలలో 300 లక్షల కోట్లు దాగి ఉందని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. తాజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా నిర్మలా సీతారామన్‌ తోటి మంత్రివర్గ సభ్యులకు, ప్రధానికి విదేశాల నుంచి రప్పించవలసిన నల్లధనం గురించి సరైన సలహా ఇవ్వాలి. అందుకు పటిష్ఠమైన చట్టాన్ని రూపొందించడానికి సూచనలు చేయాలి. అలాగే పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి తీపిమాటలతో వేలాది ఎకరాలు ప్రభుత్వాల నుంచి నామమాత్రపు ధరకు పొందిన బడా పారిశ్రామికవేత్తలు ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి, ఇతరత్రా వినియోగిస్తున్నందున అటువంటి వారి భరతం పట్టడానికి ఈ బడ్జెట్‌లో కట్టడి చేయాలి. ట్రస్ట్‌లు, ఎన్జీవోలు, ఇతర ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవల పేరుతో ప్రభుత్వానికి ట్యాక్స్‌ చెల్లించకుండా ఎగ్గొడుతున్న వ్యవస్థల మీద కూడా కన్నెర్ర చేయాలి. బహుళజాతి కంపెనీలను, కార్పొరేట్‌ కంపెనీలను పక్కనబెట్టి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద పీట వేసి బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చి వారి ఉత్పత్తులను విక్రయించడానికి వారితో ప్రభుత్వం భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి. అలాగే రైతు ఉత్పత్తులను వారే అమ్ముకునే విధంగా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఓ ప్రణాళిక తీసుకురావాలి. ఈ విధంగా తాజా బడ్జెట్‌ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే శాశ్వత అభివృద్ధికి కూడా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఇందుకు అన్ని రంగాలలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే అవినీతికి, నిర్లక్ష్యానికి చరమగీతం పాడినట్లవుతుంది. ప్రపంచ దేశాలన్నీ సహకార రంగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత్‌లో కూడా సహకార వ్యవస్థకు పెద్ద పీట వేయాలి.

తిప్పినేని రామదాసప్పనాయుడు

ఛైర్మన్‌, ముద్ర వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి బహుళార్థ సహకార సంఘం

Updated Date - 2021-01-22T09:43:18+05:30 IST