బడ్జెట్ 2022: పెరుగుతున్నధరల గురించి యూపీ మహిళలు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-02-01T13:52:30+05:30 IST

పెరుగుతున్న నిత్యావసర ధరలు మధ్యతరగతి ప్రజలను..

బడ్జెట్ 2022: పెరుగుతున్నధరల గురించి యూపీ మహిళలు ఏమంటున్నారంటే..

పెరుగుతున్న నిత్యావసర ధరలు మధ్యతరగతి ప్రజలను మరింత కుంగదీస్తున్నాయి. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇటువంటి సమయంలో వస్తున్న బడ్జెట్‌పై మధ్యతరగతి వర్గాలు అనేక అంచనాలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న యూపీలోని మహిళలు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని మాయాబజార్‌లో ప్రాంతానికి చెందిన మహిళలు మాట్లాడుతూ బడ్జెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని అన్నారు.




ఈ ప్రాంతానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే అందరూ ప్రయోజనం పొందుతారన్నారు. గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరుకుందని, వంటనూనె ధర రూ.190కి చేరిందని, షుగర్‌ ధర 42 ఉందని వీటి ధరలు తగ్గించాలని కోరారు. ఇదే ప్రాంతానికి చెందిన రీటా మాట్లాడుతూ తాను ఇళ్లలో పాచి పనులు చేస్తుంటానని, తన భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది.  పేదలందరికీ మేలు చేసే బడ్జెట్ రావాలని కోరుకుంటున్నానన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, తద్వారా పేదల కడుపు నింపినవారవుతారన్నారు. తన ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తన పిల్లలు చదువుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  మియాన్ బజార్ నివాసి రేఖ మాట్లాడుతూ  తాను పేదవారమని, తన భర్త రిక్షా నడుపుతాడని తెలిపింది. తమ కుమారులు సరిగా చదువుకోలేదని, వారు దుకాణంలో పనిచేస్తున్నారని తెలిపారు. తమకు రేషన్ అందించాలని, పేదలకు ఊరట లభించేలా బడ్జెట్‌ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. సంపాదన తక్కువ.. ఖర్చులు ఎక్కువ. నూనె, నిత్యావసరాలు, గ్యాస్.. ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. పేదవాడు ఎలా బతకాలని ఆమె ప్రశ్నించారు. గంగోత్రి దేవి మాట్లాడుతూ తన భర్త చేనేత కార్మికుడని, వచ్చిన ఆదాయంతో ఇల్లు నడపడం కష్టంగా ఉందని ఆమె వాపోయింది. గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతున్నానన్నారు. రోజుకు 200 రూపాయలు సంపాదిస్తే.. ఖర్చులు ఎలా నెట్టుకు రాగమని ఆమె ప్రశ్నించారు. వెయ్యి రూపాయల గ్యాస్ 20 రోజులు కూడా రావడం లేదని, గ్యాస్, పప్పులు, వంటనూనె ధరలను తగ్గించాలని ఆమె కోరారు.

Updated Date - 2022-02-01T13:52:30+05:30 IST