అసమానతలు లేనిదే బౌద్ధం

ABN , First Publish Date - 2022-05-17T06:24:59+05:30 IST

సమాజంలో రుగ్మతలు తొలగాలంటే బౌద్ధ మతమే శరణ్యమని హరియాణ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు అన్నారు.

అసమానతలు లేనిదే బౌద్ధం
బుద్ధుడి పాదాల వద్ద పూజలు చేస్తున్న బౌద్ధ గురువులు

హరియాణ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు

ప్రపంచ పటంలో బుద్ధవనానికి ప్రత్యేక స్థానం

వైభవంగా 2566వ బుద్ధజయంతి వేడుకలు


నాగార్జునసాగర్‌, మే 16: సమాజంలో రుగ్మతలు తొలగాలంటే బౌద్ధ మతమే శరణ్యమని హరియాణ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో బుద్ధవనంలో నిర్వహించిన 2,566 వ బుద్దజయంతి (బుద్దపూర్ణిమ) వేడుకలకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అసమానతలు లేనిది బౌద్ధం అన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, శాంతి బౌద్ధమతంతో చేకూరుతుందన్నారు. బుద్ధుడు చూపిన మార్గంలో నడిస్తే సమాజంలో అసమానతలు పారదోలవచ్చన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్ల నే రాజ్యాంగాన్ని రాయగలిగారన్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధవనంలో ఒక ఆస్పత్రి, బౌద్ధ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించమని తెలిపా రు. అదేవిధంగా ఈ ఏడాది జూలై 13వ తేదీన ఆషా డ పౌర్ణమి రోజు బుద్దవనం నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు, శిల్పులు, అధికారులు, ఇంజనీర్లను సన్మానిస్తామని తెలిపారు. అంబేడ్కర్‌ బౌద్ధ మతం స్వీకరించిన అక్టోబరు 14వ తేదీన బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

బుద్ధవనానికి ప్రత్యేక స్థానం

ప్రపంచ పటంలో బుద్ధవనానికి ప్రత్యేక స్థానం ఉండేలా అన్ని హంగులతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారని మహాబోఽధి బౌద్ధ సొసైటీ గురువు సంఘ పాలబంతే అన్నారు. బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధ జయంతిలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలకు మైసూర్‌ నుంచి బౌద్ధ మత గురువులు(మాంక్‌) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మహాస్తూపం దిగువ భాగంలో ఉన్న ఆడిటోరియం లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘపాలబంతే మాట్లాడుతూ బుద్ధుడు పుట్టిన నేపాల్‌లోని లుంబిని, బుద్ధునికి జ్ఞానోదయమైన బీహార్‌ రాష్ట్రంలోని బుద్ధగయ, బుద్ధుని ధర్మ చక్ర పరివర్తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ఉత్తరప్రదేవ్‌లోని సారనా థ్‌, మహాపరి నిర్యాణం పొందిన కృషినగర్‌ తరహాలో ప్రపంచస్థాయిలో బుద్ధుని జీవిత ఘట్టాల్లో ఐదో స్థానాన్ని బుద్ధవనం భర్తీ చేసిందన్నారు. మైసూర్‌కు చెందిన బౌద్ధ మత గురువు నవాంగ్‌ జమ్నేగిషే మాట్లాడుతూ అంతర్జాతీయంగా బుద్ధవనం ప్రాజెక్టుకు ఎంతో ప్రఖ్యాతితో రూపుదిద్దుకుందని, బౌద్ధ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ధ విశ్లేషకులు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు రాంచంద్రమూర్తి, ఓఎ్‌సడీ సుధన్‌రెడ్డి, ఎస్‌ఈ క్రాంతిబాబు, శిల్పి శ్యాంసుందర్‌, రఘువీర్‌, కర్ణ బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:24:59+05:30 IST