బుద్ధవనం.. డొల్లతనం

ABN , First Publish Date - 2022-05-23T08:10:55+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో బుద్ధవనం ఒకటి.

బుద్ధవనం.. డొల్లతనం

  • ఇప్పటిదాకా ప్రాజెక్టుకు రూ.70 కోట్ల ఖర్చు
  • 14న కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం
  • అప్పటికే విరిగిన తలుపులు, పగిలిన మెట్లు
  • మహాస్తూపంపై చెక్కిన శిల్పాలకు బీటలు
  • ఎండిన మొక్కలు.. పచ్చదనం లేని పార్కులు
  • అపరిశుభ్రంగా పరిసరాలు.. అలాగే ఆవిష్కరణ


నాగార్జునసాగర్‌, మే 22: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో బుద్ధవనం ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచే దీని నిర్మాణం సాగుతున్నా.. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లాలని ఆశించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో సర్కారు అంచనాలు తారుమారయ్యాయి. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత నిర్మాణ లోపాలు బయటపడతాయి. బుద్ధవనంలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. నలువైపులా బీట లు వారిన తలుపులు, పగిలిపోయిన మెట్లు, ఎండిపోయిన పార్కులు, చెత్తా చెదారంతో నిండిన ప్రాంగణాలతో.. అంతర్జాతీయ పర్యాటక క్షేత్రం ఈ నెల 14న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం పనుల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. 17 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.70 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు.


నిర్మాణానికి సుదీర్ఘ సమయం దొరికినా, కట్టుదిట్టంగా చేయాల్సిన పనులను తూతూ మంత్రం గా కానిచ్చేశారు. ప్రారంభానికి ముందే రూ.4 కోట్ల వ్య యంతో మహాస్తూపం ఇంటీరియర్‌ డెకరేషన్‌, నాలుగు వైపులా నాలుగు ద్వారాలకు టేకుతో తలుపులు ఏర్పా టు చేశారు. అంత ఖర్చు చేసినా నాలుగువైపులా మహాస్తూపం తలుపులు పగిలిపోయాయి. స్తూపంపై విరిగిన శిల్పాలు పడిపోకుండా చెక్కలను ఆధారంగా పెట్టి, టేపుతో అతికించారు. లోపలికి వెళ్లడానికి ఎక్కే మెట్లు ధ్వంసమయ్యాయి. పార్కుల్లో కనీసం పచ్చ గడ్డి కూడా లేదు. మొక్కలు ఎండిపోయాయి. 2006లో దలైలామా నాటిన బోధి వృక్షం పరిసరాలు చెత్త, ఎండిన ఆకులతో నిండిపోయాయి. స్తూపవనం, అవకాన బుద్ధ ప్రాంతాల్లో ఎండిన చెట్లతో పరిసరాలు కళావిహీనంగా మారాయి. బుద్ధవనాన్ని ఆవిష్కరించిన మంత్రికేటీఆర్‌ ఇవన్నీ చూసి కూడా, అధికారులను మందలించకపోవడంలో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


తూతూ మంత్రంగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన బుద్ధవనాన్ని రాష్ట్రపతి, లేదా ప్రధాని వంటి వ్యక్తులతో ప్రారంభిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేది. కనీసం సీఎం స్థాయి వ్యక్తి ఆవిష్కరించినా ప్రాధాన్యం ఉండేది. బుద్ధవనంలోని 27 అడుగుల అవకాన బుద్ధ విగ్రహాన్ని శ్రీలంక దేశస్థులు బహూకరించారు. నేపాల్‌, బర్మా, థాయ్‌లాండ్‌, తైవాన్‌ దేశాలకు చెందిన బౌద్ధ మత సంస్థ లు బుద్ధవనంలో బౌద్ధ పాఠశాల, విశ్వవిద్యాలయం, ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడంతో.. పలుమార్లు ఆయా దేశాలకు చెందిన బౌద్ధ మత గురువులను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే, ప్రారంభోత్సవానికి ఇతర దేశాలకు చెందిన బౌద్ధ సంస్థలకు కనీసం ఆహ్వానించలేదు. రాష్ట్రానికి చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా ప్రారంభోత్సవానికి పిలవకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


హడావుడిగా ప్రారంభం..

ఈ నెల 14న సాగర్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన ఉండటంతో ఆయన చేతుల మీదుగా బుద్ధవనాన్ని ప్రారంభించాలని ప్రాజెక్టు, పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ప్రారంభోత్సవానికి బౌద్ధమత గురువులు(మాంక్‌) ఉండాలని ఈ నెల 13న రాత్రి కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఆరుగురు బౌద్ధులను తీసుకచ్చేందుకు విమాన చార్జీల కోసం రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు. నాణ్యతా లోపంపై బుద్ధవనం ప్రాజెక్టు అధికారిని వివరణ కోరగా, లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-05-23T08:10:55+05:30 IST