వందామి! బుద్ధో...వినాయకో!

ABN , First Publish Date - 2020-08-21T05:57:40+05:30 IST

బుద్ధునికి ఉన్న అనేక పేర్లలో వినాయక అనేది ఒకటి. బౌద్ధ సాహిత్యంలో, సంప్రదాయంలో బుద్ధుణ్ణి ఏనుగుతో పోలుస్తారు.

వందామి! బుద్ధో...వినాయకో!

బుద్ధునికి ఉన్న అనేక పేర్లలో వినాయక అనేది ఒకటి. బౌద్ధ సాహిత్యంలో, సంప్రదాయంలో బుద్ధుణ్ణి ఏనుగుతో పోలుస్తారు. బుద్ధుణ్ణి ఏనుగు రూపంలో కూడా చిత్రిస్తారు. ఏనుగుకు ‘కరి’, ‘నాగ’, ‘గజ’ అనే పేర్లు ఉన్నాయి. ఇందులో ‘నాగ’ అనే పదం బౌద్ధంలో ప్రధానంగా ఉంది. బుద్ధుణ్ణి ‘మహానాగ’ అంటారు. 


క్రీస్తుపూర్వం 600 సంవత్సరం నాటికి మన దేశంలో ఉన్న గ్రంథాలలో బుద్ధుణ్ణి తప్ప మరొకరిని ఏనుగుతో పోల్చిన దాఖలాలు కానీ, ఏనుగును పూజించిన ఆనవాళ్ళు కానీ ఇంతవరకూ దొరకలేదు. ఏనుగుతో పోల్చిన తొలి వ్యక్తి బుద్ధుడే! ఏనుగు రూపాన్ని పూజించిన తొలి ధార్మికులు బౌద్ధులే!


పురాతన బౌద్ధారామాల్లో, శ్రీలంక, బర్మా, థాయిలాండ్‌, చైనా, జపాన్‌ లాంటి ప్రపంచంలోని  బౌద్ధ దేశాల్లో ఈనాటికీ బుద్ధుణ్ణి ఏనుగు రూపంలో గౌరవించే సంప్రదాయం ఉంది. అశోకుడు వేయించిన జౌగడ్‌, కాల్సి శాసనాలతో దొరికిన బుద్ధ ప్రతిమల కింద ‘గజోత్తమా!’ అని ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక గాథలను బౌద్ధ వాఙ్మయంలో చూడవచ్చు.


ఒక రోజు బుద్ధుడు రాజగృహ నగరం రాజవీధిలో నడచి పోతున్నాడు. ఎలాగైనా బుద్ధుణ్ణి హతమార్చి, బౌద్ధ సంఘాన్ని తన హస్తగతం చేసుకోవాలని చూస్తున్నాడు దేవదత్తుడు. మొదట మగధ రాజు అజాతశత్రుకు చాడీలు చెప్పి, బుద్ధుణ్ణి శిక్షించాలని చూశాడు. కానీ, అజాతశత్రు నిజం తెలుసుకొని, దేవదత్తుణ్ణే దూరం పెట్టాడు. ఆ తరువాత దేవదత్తుడు అనేక పన్నాగాలు పన్నాడు. నాళాగిరి అనే మదపుటేనుగును బుద్ధుడి మీదకు ఉసిగొల్పడం వాటిలో ఒకటి.


మావటి ఇచ్చిన శిక్షణ ప్రకారం నాళాగిరి ఘీంకరిస్తూ, వీధిలో పరుగులు తీస్తూ, కాలికి దొరికినదాన్నల్లా తొక్కేస్తూ, తొండానికి అందినదాన్నల్లా పట్టి విసిరేస్తూ వేగంగా బుద్ధుడి దగ్గరకు వచ్చింది. బుద్ధుణ్ణి ఒడిసి పట్టుకోవాలనీ, విసిరి కొట్టాలనీ తొండాన్ని మెలితిప్పి కొట్టాలనీ దాని ఉద్దేశం. తొండాన్ని మెలితిప్పి, వెనుక నుంచీ బుద్ధుడి నడుమును చుట్టడానికి ప్రయత్నించింది. కానీ వేగంగా వెనక్కు ముడుచుకుంది.


అప్పుడు గమనించాడు బుద్ధుడు. హిమగిరి శిఖరానికి మించిన నిబ్బరం ఆయనది. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. నాళాగిరి కళ్ళలోకి చూశాడు. దయాపూరితమైన ఆయన దృక్కులు దాని కంటపడ్డాయి. అంతే! ముందరి కాళ్ళ మీద వంగి, తొండం మోడ్చి నమస్కరించింది. ‘ఇది బుద్ధుడి మహిమ’ అని అందరూ అనుకున్నారు. ‘బుద్ధుడి కరుణ’ అని ఆ ఏనుగుకు మాత్రమే తెలుసు.


అప్పటికి కొన్నేళ్ళ క్రితం... నాళాగిరి చిన్న గున్నగా ఉన్న సమయంలో అది తల్లి నుంచి తప్పిపోయింది. అడవిలో వేటగాళ్ళు పన్నిన ఇనుప ఉచ్చుల్లో చిక్కుకుపోయింది. రోదించింది. తల్లడిల్లింది. ఆ సమయంలో బుద్ధుడు అక్కడే వర్షావాసం గడుపుతున్నాడు. ఆ ఏనుగు గున్నను ఉచ్చుల నుంచి విడిపించి కాపాడాడు. దాని కాలి గాయాలకు ఆకుపసర్లు వేసి కట్టు కట్టాడు. ఆ తరువాత అది మగధ రాజు ఆస్థానానికి చేరింది. చివరికి బుద్ధుడి మీదే దాన్ని ప్రయోగించారు.


ఇది కథ కాదు... నిజం. దీనిలో విశేషం ఏమిటంటే జంతు ప్రపంచంలో జ్ఞానం ఉన్న జంతువుగా ఏనుగును గుర్తిస్తారు. అన్ని సంవత్సరాల తరువాత కూడా అది బుద్ధుని రూపాన్నీ, స్పర్శనూ, వాసననూ గుర్తించింది. అందుకే ‘ఇంటెలిజెంట్‌ ఏనిమల్‌’గా ఏనుగుకు గుర్తింపు. ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడాన్ని ‘ఎలిఫెంట్‌ మొమొరీ’ అంటారు.


బుద్ధుడు ఎప్పుడైనా వెనక్కు తిరిగి చూడవలసి వస్తే తలతిప్పి చూసేవాడు కాదు. మనిషి మొత్తం వెనక్కు తిరిగి చూసేవాడు. ఇలా చూడడాన్ని ‘నాగావలోకనం’ అంటారు. అంటే ఏనుగులా చూడడం. 


ఉదాయి అనే భిక్షువు బుద్ధుడిని భద్రగజంతో పోలుస్తూ ‘‘పర్వతాల్లో హిమగిరి ఉన్నతమైనది. జంతువుల్లో భద్రగజం శ్రేష్టమైనది. గురువుల్లో తథాగతుడు అలాంటి వాడు’’ అంటూ - ‘‘బుద్ధుడు అనే భధ్రగజానికి శీలం, ధ్యానం అనేవి ముందరి పాదాలు. కరుణ, మైత్రి వెనుక పాదాలు. ఓర్పు (ఉపేక్ష) తెల్లని ఏకదంతం. శ్రద్ధ - తొండం. జ్ఞాపకశక్తి - ఘీంకారం. శిరస్సు -ప్రజ్ఞ. వివేకం - తోక.  మేధస్సు - కార్యాచరణ. ధర్మోపదేశాలే పెద్ద బొజ్జ’’ అంటూ వర్ణించాడు.


ఋగ్వేద ఆర్యులకు గుర్రం, సింధూ ప్రజలకు దున్నపోతు (పశుపతి) చిహ్నాలైతే బౌద్ధులకు చిహ్నం ఏనుగు (నాగం). అందుకే ప్రతి బౌద్ధరామంలో ఏనుగు ప్రతిమలు ఉంటాయి. బుద్ధుణ్ణి జ్ఞానానికి ప్రతీక అయిన ఏనుగుతో పోలుస్తూ వినాయకునిగా ప్రపంచం కీర్తించింది, గౌరవించింది. ఈ గౌరవం బుద్ధుణ్ణి ప్రకృతికీ, ప్రజ్ఞకూ, జీవకారుణ్యానికీ ప్రతీకగా నిలబెట్టింది. అందుకే...

వందామి! బుద్ధో వినాయకో...!

విమల విజ్ఞాన తేజో ప్రకాశికో...!

దయా సింధో! ధమ్మ నాయకో!

 బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-08-21T05:57:40+05:30 IST