లోపం చేసిన మేలు

ABN , First Publish Date - 2021-06-11T05:35:13+05:30 IST

శ్రావస్తి నగరంలో కళ్యాణధర్ముడు అనే గృహస్తు ఉన్నాడు. అతను ఎంతో మంచివాడు. పంచశీలను పాటించేవాడు. అసత్యం పలికేవాడు కాదు. మృదుస్వభావి, మధుర భాషణుడు...

లోపం చేసిన మేలు

శ్రావస్తి నగరంలో కళ్యాణధర్ముడు అనే గృహస్తు ఉన్నాడు. అతను ఎంతో మంచివాడు. పంచశీలను పాటించేవాడు. అసత్యం పలికేవాడు కాదు. మృదుస్వభావి, మధుర భాషణుడు. అంతకు మంచి ఉత్తమమైన భర్త. అతను ఒక రోజున శ్రావస్తి నగరానికి దూరంలో ఉన్న జేతవనానికి వెళ్ళాడు. అది బుద్ధుడు, బౌద్ధ సంఘం నివసించే ఆరామం. బుద్ధుని ఉపదేశం వినాలనేది కళ్యాణధర్ముడి కోరిక. 

అతను జేతవనానికి వెళ్ళిన కొద్దిసేపటికే, అతని భార్య తల్లి... అంటే అత్తగారు కళ్యాణధర్ముడి ఇంటికి వచ్చింది. రాకరాక వచ్చిన తల్లికి కూతురు సపర్యలు చేసింది. ఇద్దరూ అరుగు మీద కూర్చొని తిరగట్లో నూకలు విసురుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

‘‘నీ భర్త సుఖంగా ఉన్నాడా? నిన్ను బాగా చూసుకుంటున్నాడా?’’ అని అడిగింది తల్లి.

‘‘అమ్మా! నీ అల్లుడు ఎంతో మంచివాడు, శీలవంతుడు. ఆయనలాంటి శీలం కలిగినవాడు, సదాచారి ఆఖరికి పరివ్రాజకులలో (భిక్షువులలో) కూడా ఉండరు’’ అని చెప్పింది కళ్యాణధర్ముడి భార్య.

ఆ తల్లికి చెముడు. పైగా తిరగలి మోత. కూతురు చెప్పినది అస్పష్టంగా వినిపించింది. ‘పరివ్రాజకులు’ అనే మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. ఇంకేముంది... తన అల్లుడు భార్యాబిడ్డలనూ విడిచిపెట్టి, ఇల్లు వదిలి పరివ్రాజకుడు అయ్యాడని ఆమె అనుకుంది. వెంటనే గొల్లుమంటూ... 

‘‘అమ్మో! నిన్నూ, నీ పిల్లల్నీ వదిలి పరివ్రజించాడా! ఎందుకు అలా చేశాడే...’’ అంటూ గగ్గోలు పెట్టింది. 

ఆమె కేకలు, ఏడుపు విన్న ఇరుగు పొరుగు వారు ‘కళ్యాణధర్ముడు పరివ్రాజకుడు అయ్యాడట!’ అనుకున్నారు. ఈ మాట ఈనోటా ఆనోటా పాకి నగరం అంతటికీ తెలిసింది.

జేతవనానికి వెళ్ళిన కళ్యాణధర్ముడు సాయంకాలం ఇంటికి తిరిగి వస్తున్నాడు. వీధిలో అతనికి ఎదురుపడిన వారందరూ వంగి వంగి నమస్కరిస్తున్నారు. కొందరు పాదాలకు దండం పెడుతున్నారు. గతంలో లేని ఈ గౌరవం ఎందుకో అతనికి మొదట అర్థం కాలేదు. 

ఆ తరువాత ఎవరో ‘‘భంతేజీ! తమరు తాపసులు అయ్యారట కదా!’’ అన్నారు.

కళ్యాణధర్ముడు ఇంటికి వెళ్ళాక విషయం తెలిసింది. ‘పరివ్రాజకుడి పట్ల ఎంత గౌరవం, ఎంతటి మర్యాద! ఈ గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ సంతృప్తిని ఎందుకు కాలదన్నుకోవాలి? ఆ జ్ఞానమార్గాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? ఆ గౌరవనీయ మార్గంలోనే నేనూ పరివ్రాజకుణ్ణి అవుతాను’ అనుకున్నాడు.

భార్యాబిడ్డలకు తన అభిప్రాయాన్ని చెప్పాడు. అత్తగారికి నమస్కరించి ‘‘అత్తయ్యా! మీ వినికిడి లోపం నా మనసుకు ఉన్న బధిరత్వాన్ని పోగొట్టింది. నాకెంతో మేలు చేసింది’’ అని చెప్పాడు. పరివ్రాజకుడిగా మారాడు. కళ్యాణదాయకమైన బౌద్ధ ధమ్మమార్గంలో నడిచి చిరకీర్తిని పొందాడు.


- బొర్రా గోవర్ధన్‌ 


Updated Date - 2021-06-11T05:35:13+05:30 IST