బుద్ధుడి ఏకాగ్రత

ABN , First Publish Date - 2020-03-06T05:57:43+05:30 IST

బుద్ధుడు తన సిద్ధాంతాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించాడు. అవి: ప్రజ్ఞ, శీలం, సమాధి. వీటిలో ప్రజ్ఞ జ్ఞానానికి సంబంధించినది. శీలం సంస్కారానికీ..

బుద్ధుడి ఏకాగ్రత

బుద్ధుడు తన సిద్ధాంతాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించాడు. అవి: ప్రజ్ఞ, శీలం, సమాధి. వీటిలో ప్రజ్ఞ జ్ఞానానికి సంబంధించినది. శీలం సంస్కారానికీ, నడతకూ సంబంధించినది. మూడోదైన సమాధి మానసిక చైతన్యానికి సంబంధించినది. చిత్త ప్రక్షాళనకూ, మనో వికాస పరిపూర్ణతకూ చెందినది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏకాగ్రతకు సంబంధించినది. మనస్సును మగత నిద్రలోకి పంపే ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఆ అచేతన స్థితి వల్ల ప్రయోజనం లేదన్నాడు బుద్ధుడు. మనిషి స్పృహలో ఉంటూనే... అంటే ఎరుకతో ఉంటూనే ఇతర విషయాలను గ్రహించని స్థితిని ఆయన ఆవిష్కరించాడు. అదే విపస్సన- ధ్యానం.


ఒక రోజు బుద్ధుడు అనారోగ్యం పాలయ్యాడు. ఆయనకు భరించరాని పొట్ట నొప్పి వచ్చింది. ఒక వైపు ఔషధాలు తీసుకుంటూనే మరోవైపు ధ్యాన స్థితిలో  ఆ నొప్పిని భరించాడు. ‘ఆ భాగంలో నాకు నొప్పి లేదు’ అని మనస్సును మలచడం ద్వారా ఆ నొప్పిని నిగ్రహించాడు.


అలా ఒకనాడు కుశీ నగరం శివారులోని రెండు సాల వృక్షాల కింద ఆయన కూర్చొని, ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఆ పక్కన ఉన్న దారిలోంచీ వందల బండ్లు వెళ్ళాయి. ఆ బండ్ల చక్రాలు కర్రు కర్రున శబ్దాలు చేశాయి. ఎద్దుల గంటలు గణగణ మ్రోగాయి. రైతులు ‘అహై అహై’ అంటూ ఎడ్లను అదిలించే అరుపులు వినిపించాయి. ఆ బండ్లు వెళ్ళిన కొంత సేపటికి బుద్ధుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు.


తన శిష్యుడితో ‘‘ఆనందా! దాహంగా ఉంది. నదీ తీరానికి వెళ్ళి, స్వచ్ఛమైన నీళ్ళు తీసుకురా!’’ అన్నాడు.

ఆనందుడు నదీ తీరానికి వెళ్ళాడు. ఆ తీరంలోనే వందలాది బండ్లు దిగి, అవతలి ఒడ్డుకు వెళ్ళాయి. దాంతో నీరంతా మురికి మురికిగా ఉంది. ఆనందుడు తిరిగి వచ్చాడు.

ఇదంతా ఆ దగ్గరలో ఉన్న ఒక యోగి చూస్తూనే ఉన్నాడు. అతని పేరు మల్ల పుత్రుడు. అతనికి బుద్ధుడు, ఆనందుల ప్రవర్తన వింతగా తోచింది. అతను బుద్ధుడి దగ్గరకు వచ్చి, తనను పరిచయం చేసుకొని‘‘భగవాన్‌! నేను ఎప్పటి నుంచో తమరిని దర్శించాలని చూస్తున్నాను. ఈనాటికి నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. కానీ, మీ ప్రవర్తన వింతగానూ తోచింది’’ అన్నాడు.

‘‘మల్లపుత్రా! ఎందుకు ఎలా అడిగావు?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు.

‘‘భగవాన్‌! ఇంతకుముందే మీ పక్క నుంచీ వందల బండ్లు వెళ్ళాయి. అవి రేవులోకి దిగుతాయనీ, అవి దిగితే నీరు మురికి అవుతుందనీ తెలిసి కూడా స్వచ్ఛమైన నీరు తేవాలని ఆనందుణ్ణి మీరు ఎలా పంపారు?’’ అని అడిగాడు.

‘‘మల్లపుత్రా! నిజమా! ఆ బండ్లు వెళ్ళిన విషయమే నాకు తెలీదు’’ అన్నాడు బుద్ధుడు. 

..అలాగా భగవాన్‌! అద్భుతం భగవాన్‌! అద్భుతం! ఆశ్చర్యం భగవాన్‌! ఆశ్చర్యం! మీ ధ్యానంలోని విశిష్టత అదేనన్నమాట. నేను విన్నది ఈ రోజు కనులారా చూశాను. ఎంతటి ఏకాగ్రత! ఎంతటి ఎరుక! ఎంతటి ధ్యానం!’’ అంటూ మల్లపుత్రుడు మోకరిల్లాడు.

..ఆనందా! నీవు వెళ్ళు! నీరు తేరుకొనే ఉంటుంది. వెళ్ళి తీసుకురా!’’ అన్నాడు బుద్ధుడు. 

ఆనందుడు వెళ్ళి, కొద్ది సేపటికి మంచి నీరు తీసుకువచ్చాడు. బుద్ధుడు దప్పిక తీర్చుకున్నాడు. అదే బుద్ధుని ఆఖరి దప్పిక!

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-03-06T05:57:43+05:30 IST