వన్‌సైడ్‌ పోలీసింగ్‌!

ABN , First Publish Date - 2022-01-25T06:50:13+05:30 IST

‘పోలీసులు లేకుంటే శవాలై తిరిగి వచ్చేవారు..’ గుడివాడలో కేసినో నిర్వహణపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను ఉద్దేశించి సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలివి.

వన్‌సైడ్‌ పోలీసింగ్‌!
బుద్దా వెంకన్నను అరెస్టు చేస్తున్న పోలీసులు

మంత్రికో న్యాయం.. టీడీపీ నాయకులకో న్యాయం

కేసినో నిర్వహించిన మంత్రి అనుచరులపై కేసుల్లేవ్‌

టీడీపీ శ్రేణులను బెదిరించినా కదలిక లేదు

గుడివాడలో టీడీపీ నేతలపై రివర్స్‌ కేసులు

నానీని నిలదీసినందుకు వెంకన్న అరెస్టు


‘పోలీసులు లేకుంటే శవాలై తిరిగి వచ్చేవారు..’ గుడివాడలో కేసినో నిర్వహణపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను ఉద్దేశించి సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలివి. ఆయనపై ఎలాంటి కేసూ లేదు. గుడివాడలో కేసినో పేరుతో భారీ ఎత్తున జూద క్రీడలు నిర్వహించి వారం దాటింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నా ఇంత వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ గుడివాడలో టీడీపీ నాయకులపై కేసులు పెట్టడంలో.. వెంకన్నను అరెస్టు చేయడంలో మాత్రం పోలీసులు దూకుడుగా వ్యవహరించారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గుడివాడలో కేసినో నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. దీంతో మంత్రి కొడాలి నాని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గుడివాడకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ దాడుల్లో మంత్రి ఓఎస్డీ దుక్కిపాటి శశిభూషణ్‌ స్వయంగా పాల్గొన్నారు. పోలీసులు వైసీపీ నాయకులపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేశారే తప్ప ఒక్కరినీ అరెస్టు చేయలేదు. అదే సమయంలో వైసీపీ కార్యకర్త పెద్ది కిషోర్‌ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు ముళ్లపూడి రమేశ్‌పై రివర్స్‌ కేసులు నమోదు చేశారు. తాజాగా వెంకన్న విషయంలోనూ పోలీసులు స్వామి భక్తిని చాటుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులు కక్ష సాధింపు ధోరణితోనే వెంకన్నను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వెంకన్నపై ఐపీసీ 153ఎ, 505(2), 506, రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు ముందుగా 41ఏ నోటీసు ఇవ్వాలి. కానీ పోలీసులు ఆ నియమాన్ని పాటించలేదు. బుద్దా వెంకన్నపై వైసీపీ నాయకుడు మైలవరపు దుర్గారావు ఫిర్యాదు చేయడం.. పోలీసులు కేసు నమోదు చేయడం.. వెంకన్నను ఆగమేఘాలపై అరెస్టు చేయడం అన్నీ గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సుమారు 100 మందికిపైగా పోలీసులు వన్‌టౌన్‌లోని బుద్దా వెంకన్న ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు 


ఇది చీకటి రోజు

ఇది చీకటిరోజు. వైసీపీ నాయకులు, మంత్రులు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతూ ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించరు. మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బూతుల మంత్రి కొడాలి నాని దుర్భాషలను ఖండించిన బుద్దా వెంకన్నను అర్ధగంటలోనే అరెస్టు చేశారు.  - కొల్లు రవీంద్ర, మాజీమంత్రి 


నానీపై కేసులు ఎందుకు పెట్టలేదు?

‘చంద్రబాబునాయుడు చావాలి..’ అని మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడినా పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? మా పార్టీ అధినేతనుద్దేశించి ఇష్టానుసారం మాట్లాడుతున్న మంత్రిపై గట్టిగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? పోలీసుల తీరు మారాలి.  - బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు 


పోలీసులపై నమ్మకం పోతోంది

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. తప్పు చేసిన మంత్రి కొడాలి నానీని వదిలిపెట్టి తప్పును వేలెత్తి చూపి.. అడ్డుకుంటామన్నందుకు బుద్దా వెంకన్నను అరెస్టు చేయడం దారుణం. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  - వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు

Updated Date - 2022-01-25T06:50:13+05:30 IST