Abn logo
Jun 19 2021 @ 00:19AM

అవకతవకలు.. అక్రమ తవ్వకాలు

గుడివాడలో బుడమేరుపై ఆగని అక్రమాలు

ఈసారి ప్రభుత్వ భూమి కబ్జా

పుట్టగుంటలో అధికారపక్ష నాయకుల అరాచకం

అరిపిరాల ఎత్తిపోతల పథకానికి సరిహద్దులోనే..

మండల స్థాయి నాయకుల కనుసన్నల్లోనే అవినీతి

పట్టించుకోని అధికారులు

అధికార పార్టీకి చెందిన ఆక్రమణదారుల అక్రమాలతో గుడివాడ నియోజకవర్గంలోని బుడమేరు క్రమంగా కుంచించుకుపోతోంది. తాజాగా నందివాడ మండలం పుట్టగుంటలో బుడమేరు వద్ద ప్రభుత్వ భూమిని దోచేసి చేపల చెరువులు తవ్వేస్తుండటం వివాదాస్పదమైంది. 

నందివాడ రూరల్‌ (గుడివాడ) : బుడమేరులో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు ఆగట్లేదు. నందివాడ మండలం కుదరవల్లి వద్ద చేపల చెరువుల తవ్వకాలు వివాదాస్పదమై పది రోజులు గడవక ముందే మళ్లీ పుట్టగుంటలో అధికారపక్షానికి చెందిన నాయకులమని చెప్పుకొంటున్న కొంతమంది ఏకంగా ప్రభుత్వ భూమిలోనే చెరువులు తవ్వేస్తున్నారు. ఆక్రమణదారులకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందివాడ మండల పరిధిలోని అరిపిరాల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ఆనుకుని, బుడమేరు కరకట్ట లోపల ఉన్న ప్రభుత్వ భూమికి సదరు ఆక్రమణదారుడు ఆరేళ్ల క్రితమే పట్టా పుట్టించి తాజా అంకానికి తెరతీశాడు. 

సూత్రధారుడు ఆ జంప్‌ జిలానీనే..

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే ఓ నాయకుడే ఆక్రమణదారుడిగా మారి రెవెన్యూ శాఖలో చక్రం తిప్పుతున్నాడు. ఆక్రమిత భూముల జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటున్నాడు. గతంలో టీడీపీలో ఉన్న సదరు నాయకుడు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జంప్‌ అయ్యాడు. మండలస్థాయి ప్రజాప్రతినిధిగా ఎదిగి బుడమేరులోని ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. తనకు బుడమేరులో ఉన్న కొద్దిపాటి భూమికి సరిహద్దుగా ఉన్న బంజరు, కాల్వ పోరంబోకు భూములను ఆక్రమంచి చేపల చెరువు తవ్వకానికి తెరతీశాడు. చెరువుకు కట్టలు వేయడానికి ఏకంగా బుడమేరు కట్టలనే తవ్వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పట్టించుకోని అధికారులు

రూ.కోట్ల విలువ చేసే భూమి అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌, డ్రెయినేజీ శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆరోపణలకు తావిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఏడు పొక్లెయిన్లు, పది జేసీబీలు, 25 వరకు ట్రాక్టర్లు పుట్టగుంట, అరిపిరాల ఆయకట్టులో బుడమేరు మట్టిని తోడేస్తున్నా కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సొంత భూమి లేకుండా అసైన్డ్‌, ప్రభుత్వ భూమిలో చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతూ బరితెగించి వ్యవహరిస్తున్నా అధికారులు స్పందించకపోవడానికి అధికారపక్ష నాయకుల సిఫారసులే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణదారు సమీప బంధువు సచివాలయంలో రవాణా వాహనాలు సమకూర్చే కాంట్రాక్టర్‌ కావడం, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండటం కారణంగా అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. వివాదాస్పద భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు దరఖాస్తుదారుడు చూపకుండానే పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయడం.

ప్రభుత్వ భూమేం కాదు..

ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వడం లేదు. వారి సొంత భూమిలో సైతం  తవ్వడానికి అనుమతి లేదు. పనులు వెంటనే నిలిపి వేయిస్తాం. ఆర్‌వోఆర్‌ రిజిస్టర్‌లో గతంలో ట్యాంపరింగ్‌ జరిగిందని తేలితే విచారణ చేసి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం.  

- అబ్దుల్‌ రెహ్మాన్‌, తహసీల్దార్‌ 

-------------------------------------------------------------------------------

అక్రమ చేపల చెరువులను తొలగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా 

గుడివాడ, జూన్‌ 18 :  నందివాడ మండల పరిధిలోని బుడమేరులో 25 కిలోమీటర్ల మేర విస్తరించిన చేపలు, రొయ్యల చెరువులను ధ్వంసం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురాల రాజేష్‌ డిమాండ్‌ చేశారు. ఇలపరు, కుదరవల్లి గ్రామాల సరిహద్దులో బుడమేరులో అక్రమంగా తవ్విన చేపల చెరువులను ధ్వంసం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రి కొడాలి నాని సొంత ప్రాంతంలోని బుడమేరులో చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే పట్టించుకోరా.. అని ప్రశ్నించారు. చేపల చెరువుల కట్టలను ఎత్తుగా పోస్తే ఖరీఫ్‌ సీజన్‌లో దళితులు పంటలను ఎలా సాగు చేసుకోవాలని ప్రశ్నించారు. తాజాగా పుట్టగుంట, అరిపిరాల సరిహద్దులో చేపల చెరువులు తవ్వుతున్నారన్నారు. అనంతరం ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బీవీ శ్రీనివాసరావు, గుజ్జుల నాగభూషణం, కాకి యెహుషువ, కాకి దేవదాసు, కోరం అన్నమ్మ, సకలాబత్తిన సుబ్బమ్మ, చేబత్తిన శుభాకరరావు, గుజ్జుల చంద్రహాస్‌, కోరం ఆనందరావు, సకలాబత్తిన జయరాజు, కాకి వీరమ్మ, కోరం తంబి, చేబత్తిన రాజు తదితరులు పాల్గొన్నారు. 


బుడమేరులో అక్రమ చేపల చెరువులు తొలగించాలని ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు