బుచ్చిలో జోరుగా బెల్టు దుకాణాలు

ABN , First Publish Date - 2021-06-14T04:48:30+05:30 IST

బుచ్చి పట్టణంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు దుకాణాలు జోరుగా సాగుతున్నాయి.

బుచ్చిలో జోరుగా బెల్టు దుకాణాలు
రేబాలకు చెందిన బెల్టు దుకాణం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న సెబ్‌ అధికారులు. సిబ్బంది (ఫైల్‌)



బిల్లులు లేవని కేసులు నమోదు చేస్తున్న అధికారులు

అధికారుల కనుసన్నల్లోనే ‘బెల్టు’ నిర్వహణ


బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌13: బుచ్చి పట్టణంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు దుకాణాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బాహాటంగా మద్యం అమ్మకాలు సంబంధిత అధికారుల అనుమతితోనే జరుగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు మద్యం అమ్మకాలపై స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో అధికారులు దాడులు చేసి మద్యం, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా రాజకీయ సిఫార్సులు, ఒత్తిళ్లతో తక్కువ మద్యం సీసాలు దొరికినట్లు చూపించడం, అనుమానంతో తీసుకువచ్చామని చెప్పి కేసులు మాఫీ చేస్తున్నారని పలువురు అంటున్నారు. 


తానొకటి తలిస్తే...

తానొకటి తలచితే దైవం ఒకటి తలచినట్లు మద్యం నిషేధించేందుకు అంచలంచెల చర్యల్లో భాగంగా తొలుతగా బెల్టు దుకాణాలు నియంత్రణకు సీఎం జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే అధికారులు మాత్రం బెల్టు దుకాణాలు నిర్వహణకు యఽథేచ్ఛగా అనుమతులిచ్చి అబ్కారీ శాఖ ఇచ్చే కేసుల టార్గెట్‌కోసం యత్నిస్తున్నారు. ఈమేరకు అటు మామూళ్లు ఇటు కేసులను భరియించలేక ఇటు వ్యాపారాలు  వదులుకోలేక తప్పడంలేదని బెల్టు నిర్వాహకుల్లో విమర్శలున్నాయి. అధికారులు దాడి చేసి నమోదు చేసే ఏ కేసులోనైనా బిల్లులు లేవని, అనుమతి పత్రాలు లేవన్న కారణంతోనే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఏ మద్యం షాపులోకూడా మద్యం కొనుగోలు చేసిన వ్యక్తికి బిల్లులు ఇవ్వరు. మద్యం ప్రియులుకూడా అడగరు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ ఎవరైనా పలు ప్రైవేటు సంస్థల వ్యక్తులు వారి ఫంక్షన్లకో లేక పార్టీలకోసం తీసుకునే వారు మాత్రం కంపెనీ నుంచి ఆ ఖర్చులు రాబట్టుకునేందకు మాత్రమే బిల్లులు పొందుతుంటారుతప్ప ఇతర ఏ మద్యం ప్రియుడూ బిల్లు తీసుకోరు. కానీ ఏ వ్యక్తైనా ఎన్ని సార్లు ఽమద్యం కొనుగోలు చేసినా ప్రతిసారి 3 మద్యం సీసాలు ఇవ్వాలనేది  నిబంధన. మద్యం కొనుగోలుకు ఎంతమంది ఎన్నిసార్లు కొన్నారన్న నిఘా సిబ్బందికి అవసరం ఉండదు. అధికారుల కనుసన్నల్లో బెల్టు దుకాణాలు నిర్వహించే వారు ఆయా పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బందికి గుర్తింపే. అఽధికారులు కేసులు ఏప్రాంతంలో దాడి చేసి కేసులు నమోదు చేయాలనుకుంటే ముందుగా ఆ ప్రాంతంలోని మద్యం దుకాణంలో సిబ్బందికి చెప్తారు. సిబ్బంది ఆ దుకాణం పరిధిలోని గ్రామాలకు చెందిన బెల్టు నిర్వాహకులు మద్యం కొనుగోలు చేసి వెళ్లే సమయంలో అధికారులు సిబ్బందితో వెళ్లి అనుమానంగా తిరుగుతుంటే ఆ డొంకలో దొరికారు.. ఈ రోడ్డులో దొరికారు... అని కేసులు నమోదు చేస్తారు.  ఐతే కరోనాతో రెండు నెలలుగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో మద్యం బెల్టు షాపులు అత్యధిక ధరలతో బుకింగ్‌ వ్యాపారాలతో సైతం ఊపందుకుంటున్నాయి.  ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి మద్యం బెల్టు షాపుల జోరుకు కళ్లెం వేయాల్సి వుంది.  

Updated Date - 2021-06-14T04:48:30+05:30 IST