బాబోయ్‌ బీటీ!

ABN , First Publish Date - 2021-07-31T05:55:05+05:30 IST

కలుపు ఖర్చులు కలిసొస్తాయనో లేక దిగుబడులు అధికంగా ఉంటాయనో ఆశచూపి నిషేధిత బీటీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే ముఠాలు బయలుదేరాయి.

బాబోయ్‌ బీటీ!
అద్దంకిలోని విత్తన దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున ఏడీ సుభాషిని, వ్యవసాయ అధికారులు

అనుమతి లేని పత్తి విత్తనాలతో రైతాంగానికి చిక్కులే

భూసారం కోల్పోవడం సహా ఇతర సమస్యలు

తెలంగాణలో అరెస్టయిన ‘నకిలీ’ సూత్రధారి జిల్లావాసే

డివిజన్ల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ

ఒంగోలు (జడ్పీ) : కలుపు ఖర్చులు కలిసొస్తాయనో లేక దిగుబడులు అధికంగా ఉంటాయనో ఆశచూపి నిషేధిత బీటీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే ముఠాలు బయలుదేరాయి. వీరిపట్ల రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సాగయ్యే పత్తి విస్తీర్ణంలో 90శాతం రైతాంగం బీటీ విత్తనాలనే వాడతారు. అయితే ఇదే రకానికి చెందిన అనుమతి లేని హెచ్‌టీ (హెర్బిసైడ్‌ టోలరెంట్‌) బీటీ పత్తి విత్తనాలను కొంతమంది వ్యాపారులు రహస్యంగా రైతులకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి ఎలాంటి ధ్రువీకరణ లేకపోవడంతో కొన్న రైతులు నిలువునా మునిగిపోతున్నారు. భూములు సారం కోల్పోవడంతో సహా ఇతర, సమస్యలు కూడా తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టుబడ్డ నకిలీ విత్తనాల సూత్రధారి మన జిల్లావాసే కావడం మరింత అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం ఉండవలసిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. 


నకిలీ విత్తనాల వ్యవహారంలో పట్టుబబడిన జిల్లా వాసి

ఇటీవల తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ పత్తి విత్తనాల భాగోతంలో జిల్లాకు చెందిన పంగులూరు మండలానికి చెందిన వ్యక్తిని కీలక సూత్రధారిగా అక్కడి యంత్రాంగం ప్రకటించింది. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ జిల్లాలో కూడా అతని నకిలీ లీలలు ఏమన్నా ఉన్నాయేమో అన్న దిశగా యంత్రాంగం దృష్టి సారించడంతో పాటు రైతులను కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే డివిజన్‌కు ఒక్కో అధికారిని నియమించి పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జేడీఏ శ్రీనివాసరావు చెబుతున్నారు.


Updated Date - 2021-07-31T05:55:05+05:30 IST