2024లో బీఎస్పీదే అధికారం

ABN , First Publish Date - 2021-09-29T05:08:12+05:30 IST

వచ్చే ఎన్నికల్లో (2024) కేంద్రంలో, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌ అన్నారు.

2024లో బీఎస్పీదే అధికారం
అభివాదం చేస్తున్న నాయకులు

  1. కాన్షీరామ్‌ కలలను సాకారం చేద్దాం
  2.  బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్‌ రాంజీగౌతమ్‌


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 28: వచ్చే ఎన్నికల్లో (2024) కేంద్రంలో, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌ అన్నారు. మంగళవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బహుజన సమాజ్‌వాద్‌ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో బహుజన చైతన్యసభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బి.పరం జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సభకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మందాప్రభాకర్‌, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్‌, మాజీ అడిషనల్‌ డీజీపి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరయ్యారు. ముందుగా పంచలిం గాల టోల్‌గేట్‌ నుంచి భారీ ర్యాలీగా సభకు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌ మాట్లాడుతూ కాన్షీరామ్‌ కలలను సాకారం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీలో మేధావులు చేరుతున్నారని, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ‘దేశ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆపాలంటే బహుజన రాజ్యస్థాపన జరగాలి’ అని ఆకాంక్షించారు. ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే తొలుత ఆంధ్రప్రదేశలో రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. బహుజనులు అప్రమత్తంగా లేకుంటే రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రత్నిస్తున్న దని, దీనికి వైసీపీ మద్దతు తెలుపుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, రిజర్వే షన్లను కాపాడుకోవాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపుని చ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీదే అధికారం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 మంది ముఖ్యమంత్రులు అయితే వారిలో 17 మంది అగ్రవర్గాలకు చెందినవారేనన్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎంపీటీసీలు, 54 వార్డులను గెలుచుకున్న బీఎస్పీ.. రానున్న ఎన్నికల్లో సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉందన్నారు. 1999లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్‌ ఇదే ఎస్టీబీసీ మైదానంలో ప్రసగించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర కో ఆర్డినేటర్‌ బాలన్న, ప్రధాన కార్యదర్శులు గుర్రప్ప, తిరుపతిరావు, పుష్పరాజు, ప్రసాద్‌బాబు, చిత్రసేన, జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, రాష్ట్ర నాయకులు మల్లేకల్‌, సంపతరావు, 12 జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-29T05:08:12+05:30 IST