లఖ్‌నవూ: దేశంలో సంచలనం సృష్టించిన జ్ఞానవాపి (Gyanvapi) మసీదు అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) అధినేత మాయావతి (Mayawati) స్పందించారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించే పనుల్లో ఇది ఒకటని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత తాజ్‌మహల్, జ్ఞానవాపి , మధుర వంటి సాకులతో ప్రజలను నిజమైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
‘‘నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకా అనేక సమస్యలతో దేశ ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. కానీ ఇలాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మతపరమైన స్థలాలను బీజేపీ టార్గెట్ చేసింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత తాజ్‌మహల్, జ్ఞానవాపి, మధుర వంటి సాకులతో ప్రజలను నిజమైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఒక్కో మతానికి చెందిన మత స్థలాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. మన దేశంలో ఉన్న శాంతిని బీజేపీ ధ్వంసం చేస్తోంది’’ అని మాయావతి అన్నారు.
ఇవి కూడా చదవండి