BSNL 5G: బీఎస్ఎన్‌ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5జీ లాంచింగ్

ABN , First Publish Date - 2022-10-03T02:40:14+05:30 IST

దేశంలోకి 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లో రంగంలోకి

BSNL 5G: బీఎస్ఎన్‌ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5జీ లాంచింగ్

న్యూఢిల్లీ: దేశంలోకి 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లో రంగంలోకి దిగిపోయాయి. ఈ రేసులో వెనకబడిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (BSNL) తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 5జీ(BSNL 5G) సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది.


4జీని ప్రారంభించేందుకే ఆపసోపాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్ 5జీ(BSNL 5G) లాంచింగ్‌పై దృష్టిపెట్టింది. ఈ విషయంలో దాని ఖాతాదారుల్లో కొంత గందరగోళం నెలకొన్నప్పటకీ 5జీ(BSNL 5G) లాంచింగ్‌కు సిద్ధమవుతున్న మాట మాత్రం వాస్తవమే. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటక్స్ (C-DoT) దాని దేశీయ 5జీ కోర్‌ను ప్రవేశపెట్టింది. ఈ 5జీ ఎన్ఎన్ఏ (non-standalone) నెట్‌వర్క్‌ కోసం ర్యాన్ (Radio Access Network) పరిష్కారాన్ని విసిగ్ నెట్‌వర్క్స్, వీవీడీఎన్ టెక్నాలజీలు అందించాయి. 


బీఎస్ఎన్‌ఎల్ 4జీ, 5జీ(BSNL 5G) నెట్‌‌వర్క్ తీసుకురావడంలో వెనకబడం వెనక ఓ బలమైన కారణం ఉంది. బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ(BSNL 5G) సేవల కోసం విదేశాల నుంచి సాంకేతికతను, పరికరాలను తెప్పించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ సేవలను తీసుకురావాలని యోచిస్తోంది. అందుకనే 5జీ ఎన్ఎస్ఏకు సి-డాట్ కోర్ బీఎస్‌ఎన్ఎల్‌కు కీలకంగా మారింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఐఎంసీ 2022 జరుగుతోంది. ఇందులో సి-డాట్ తన 5జీ ఎన్ఎస్ఏను ప్రదర్శిస్తోంది. ఇక్కడి నుంచి సి-డాట్ నుంచి చండీగఢ్ పైలట్ నెట్‌వర్క్‌కు లాంచింగ్ చేసింది. అనంతరం శాంసంగ్ ఫోన్ ఈ ఎన్ఎస్ఏ నెట్‌‌వర్క్‌కు కనెక్ట్ చేసింది. ఆ వెంటనే శాంసంగ్ ఫోన్‌ బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను చూపించింది. 


టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2023) ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ(BSNL 5G)ని ప్రారంభిస్తుందని చెప్పారు. 2023 తొలి నాళ్లలో 4జీని ప్రారంభిస్తుందని, కాబట్టి ఆగస్టు 15 నాటికి 5జీ(BSNL 5G)ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ (Tata Consultancy Services) రూ. 16 వేల కోట్ల డీల్‌ను కుదుర్చుకునే అవకాశం ఉండగా, తేజాస్ నెట్‌వర్క్స్ బీఎస్ఎన్‌ఎల్ కోసం ఎక్విప్‌మెంట్ తయారుచేసే అవకాశం ఉంది. 


సి-డాట్‌తో బీఎస్ఎన్ఎల్ 5జీ పైలట్ టెస్ట్ 

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. జనవరి 2023 నుంచి సి-డాట్, బీఎస్ఎన్ఎల్ కలిసి 5జీ(BSNL 5G) పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. అయితే, సరిగ్గా ఎప్పుడన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023లోనే బీఎస్ఎన్ఎల్ నుంచి 5జీ(BSNL 5G) నెట్‌వర్క్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అయితే, 5జీని బీఎస్ఎన్ఎల్ వేగంగా విస్తరించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే దానికి 5జీ(BSNL 5G) ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చాల్సిన సంస్థలు వచ్చే రెండుమూడేళ్లు 4జీని విడుదల చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కాబట్టి బీఎస్ఎన్ఎల్ నుంచి 5జీ(BSNL 5G) కొంత సైడ్‌లైన్‌లో ఉండే అవకాశం ఉంది. 5జీ సేవల ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించేందుకు బీఎస్ఎన్ఎల్ పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. 

Updated Date - 2022-10-03T02:40:14+05:30 IST