Abn logo
Mar 4 2021 @ 02:44AM

హెచ్‌సీయూలో బీఎస్‌ఎల్‌ 3 ల్యాబ్‌

  • వైరస్‌లపై పరిశోధనలకు ఏర్పాటు.. 
  • మరో నెలరోజుల్లో అందుబాటులోకి!
  • కేంద్ర వర్సిటీల్లో మొదటిది.. రాష్ట్రంలోనే పెద్దది
  • ప్రైవేటు సంస్థల పరిశోధనలకూ వీలు
  • తగిన రుసుము చెల్లించి రిసర్చ్‌ చేసుకోవచ్చు
  • నాలుగేళ్ల క్రితమే నిర్మాణ పనులు షురూ
  • కరోనా వేళ సెంట్రల్‌ వర్సిటీలో పరిశోధనలు
  • వర్సిటీ వీసీ పొదిలె అప్పారావు వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, మార్చి3 (ఆంధ్రజ్యోతి): వైర్‌సలపై పరిశోధనలకు రాష్ట్రంలోనే అతి పెద్ద ల్యాబ్‌.. అత్యంత అధునాతనమైన బయో సేఫ్టీ లెవల్‌ (బీఎస్‌ఎల్‌) 3 ప్రయోగశాల.. హైదరాబాద్‌లో మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానుంది. అంటు రోగాల ముప్పును ఎదుర్కొనేందుకు.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో దీన్ని నిర్మిస్తున్నారు. కేవలం యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లే కాదు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం బయాలజికల్‌ పరిశోధనలు చేసుకోవడానికి వీలుగా అత్యాధునికమైన వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే ప్రారంభించిన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. కరోనా మహామ్మరి రాష్ట్రంలో అడుగుపెట్టి ఏడాదవుతున్న సమయంలో హెచ్‌సీయూలో చేపట్టిన పలు కార్యక్రమాలపై వైస్‌ చాన్స్‌లర్‌ పొదిలె అప్పారావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు..

సెంట్రల్‌ వర్సిటీలో కరోనాపై ఏమైనా పరిశోధనలు జరిగాయా..?

వర్సిటీలోకి వైర్‌సలను, ఇన్‌ యాక్టివ్‌ వైర్‌సలను తీసుకురావడానికి వీల్లేదు. ఎందుకంటే వర్సిటీలో వైర్‌సతో నేరుగా పరిశోధన చేసేందుకు కొన్ని పరిమితులున్నాయి. బీఎ్‌సఎల్‌-3 వసతి లేకుండా పరిశోధనలు చేయడానికి అవకాశం ఉండదు. వర్సిటీలో బీఎ్‌సఎల్‌-3 ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఇదీ పూర్తిగా నెగెటివ్‌ ప్రెషర్స్‌లోనే ఉంటుంది. ఎవరైనా అందులోకి వెళితే వారి ముక్కు, నోటి నుంచి వచ్చేదేదైనా కింద  పడదు. పూర్తిగా పైకి వెళ్లి కాలిపోతుంది. శ్వాసతో బయటకు వచ్చే గాలి, తుంపర్లు మొత్తం ఆవిరైపోతాయి.


కొవిడ్‌-19 కట్టడికి వర్సిటీ ఎలాంటి సహకారం అందించింది?

కరోనాపై బేసిక్‌ పరిశోధనలు చేశాం. దయానంద్‌ అనే ప్రొఫెసర్‌ నేతృత్వంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందడానికి కావాల్సిన పరిశోధనలు జరిగాయి. వాటిని బయాలజికల్‌-ఈ అనే సంస్థకు అందించడంలో వర్సిటీ భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా బయో ఇన్ఫర్మాటిక్‌ మెథడ్‌ సహకారాన్ని వర్సిటీలోని ప్రొఫెసర్లు సీమ మిశ్రా, లలితా గురుప్రసాద్‌ అందించారు. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్స్‌ ఏమిటి? దాని ఆధారంగా డ్రగ్స్‌, వ్యాక్సిన్స్‌ ఎలా అభివృద్ధి చేయవచ్చు? సీక్వెన్స్‌లో ఏ భాగాలు కరోనా వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి? తదితర పరిశోధనల ద్వారా ప్రాథమిక సహకారాన్ని అందించాం.


బీఎ్‌సఎల్‌-3 ల్యాబ్‌ నిర్మాణం ఏ దశలో ఉంది?

అత్యంత అధునాతనమైన బీఎ్‌సఎల్‌-3 పనుల్ని వర్సిటీలో నాలుగేళ్ల క్రితమే రూ.8 కోట్ల ఖర్చుతో మొదలుపెట్టాం. దేశంలోని ఇతర బీఎ్‌సఎల్‌-3 ల్యాబ్‌ల కంటే ఇది భిన్నంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దీన్ని బీఎ్‌సఎల్‌-3 ప్లస్‌ అనడం ఉత్తమం. ఈ ల్యాబ్‌ తలుపులనుంచి కిటికీల దాకా అన్నీ ఆటోమేటెడే. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రత్యేక గదులు నిర్మిస్తున్నాం.


ఈ ల్యాబ్‌ ఎప్పటికీ అందుబాటులోకి రానుంది.?

ఏప్రిల్‌ మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. దీని నిర్వహణకు ఏడాదికి రూ.40-50 లక్షల దాకా ఖర్చవుతుంది. నిర్వహణ ఖర్చుల కోసం పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడితే కష్టం. ఈ ల్యాబ్‌ ద్వారాఆదాయాన్ని పొందేందుకు చర్యలు చేపట్టాం. ఎవరైనా పరిశోధనలు చేసేందుకు అనువుగా రూపొందించాం. రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా దీంట్లో పరిశోధనలు చేసుకోవచ్చు. ఇప్పటికే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) ఈ ల్యాబ్‌లో పరిశోధనలు జరిపేందుకు సంప్రదించింది. తుది దశ పనుల కోసం రూ.40 లక్షలు ఇచ్చింది. ఏటా రూ.30 లక్షలు ఇస్తామని పదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఎవరైనా చార్జీలు చెల్లించి పరిశోధనలు చేసుకోవచ్చు. హెచ్‌సీయూ పరిశోధనలు చేసినా నామమాత్రపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. హెచ్‌సీయూ, ఎన్‌ఐఏబీ పరిశోధనలకే ప్రథమ ప్రాధాన్యం. ఆ తర్వాతే వర్సిటీలోని ఇంక్యుబేటర్స్‌కు, ఇతర ఇన్‌స్టిట్యూట్లకు ఇస్తాం. 


నాకు తెలిసి దేశంలోని ఏ వర్సిటీలో ఇలాంటి సౌకర్యం అందుబాటులో లేదు. సెంట్రల్‌ వర్సిటీల్లో ఇదే మొదటిది. జేఎన్‌యూలో చాలా చిన్నగా, ఇంకా మొదటి దశలోనే ఉన్నది. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో గల బీఎ్‌సఎల్‌-3 కంటే ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యాసంస్థలు మూతపడ్డా..హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాత్రం పరిశోధనలను ఆపలేదు. ఈ విధంగా కొన్నాళ్లుగా హెచ్‌సీయూ చేస్తున్న కృషికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌.. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐవోయీ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపుతో దేశంలోని టాప్‌ 20 వర్సిటీల్లో ఒకటిగా హెచ్‌సీయూ నిలవడంతో పాటు.. ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎ్‌ససీ బెంగుళూర్‌ తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సరసన చేరింది. క్యూఎస్‌ గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో కూడా హెచ్‌సీయూ నిలిచి ప్రపంచస్థాయి వర్సిటీల సరసన నిలుస్తోంది. ఈ క్రమంలోనే వర్సిటీ ప్రతిష్ఠను మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం.

Advertisement
Advertisement
Advertisement