యడియూరప్పపై 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుటా!

ABN , First Publish Date - 2020-05-29T20:34:58+05:30 IST

అయితే ఈ హఠాత్ పరిణామంపై ప్రతిపక్షమైన కాంగ్రెస్, జేడీఎస్‌ నిశితంగా గమనిస్తున్నాయి. తమ

యడియూరప్పపై 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుటా!

బెంగళూరు : కరోనా సంకట వేళ ముఖ్యమంత్రి యడియూరప్పకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో యడియూరప్ప తీవ్ర సతమతమవుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇదే తలనొప్పి వచ్చినా సర్దుకుంది. అయితే ఈసారి మాత్రం మాజీ మంత్రి ఉమేశ్ కట్టి దీనికి మరింత ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. ఉమేశ్ కట్టి బలమైన లింగాయత్‌ వర్గానికి చెందిన నాయకుడు. ఈయన సారథ్యంలో గురువారం రాత్రి ఓ విందు జరిగింది.


ఇందులో ఈయనతో ఏకీభవించే 20 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే వారెవ్వరూ బయటకు చెప్పనప్పటికీ వివిధ కారణాల రీత్యా, వివిధ అంశాలపై ఆ 20 మంది సీఎం యడియూరప్పతో విభేదిస్తున్నవారే అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారందరూ యడియూరప్ప వ్యవహార శైలి, పనితీరుపై గుస్సాగా ఉన్నారు. అలాగే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్ కట్టిని కేబినెట్‌లోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


అంతేకాకుండా ఆయన తమ్ముడు రమేశ్ కట్టిని ఈసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత హఠాత్ పరిణామాలతో అలర్ట్ అయిన యడియూరప్ప.... వెంటనే కట్టిని చర్చలకు పిలిచి, వివరణ అడిగినట్లు సమాచారం. ఇక, మరో సీనియర్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన బీఆర్ పాటిల్ కూడా యడియూరప్పపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్నటు సమాచారం. అయితే ఈ హఠాత్ పరిణామంపై ప్రతిపక్షమైన కాంగ్రెస్, జేడీఎస్‌ నిశితంగా గమనిస్తున్నాయి. తమ సర్కారుకు వచ్చే ముప్పేమీ లేదని యడియూరప్ప వర్గం ధీమాతో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-05-29T20:34:58+05:30 IST