BS Yediyurappa: ముడుపుల కేసులో యడియూరప్పకు భారీ ఊరట!

ABN , First Publish Date - 2022-09-23T22:01:01+05:30 IST

ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)కు

BS Yediyurappa: ముడుపుల కేసులో యడియూరప్పకు భారీ ఊరట!

బెంగళూరు: ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూ కేటాయింపుల కేసులో 79 ఏళ్ల యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు(karnatak high court) నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఈ కేసులో ఆయనకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

2006-07లో కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని అక్రమంగా పారిశ్రామికవేత్తలకు కేటాయించారని యడియూరప్పపై అభియోగాలు నమోదయ్యాయి. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ యడియూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కన్హా (John Michael Cunha).. దర్యాప్తులో జాప్యంపై పోలీసులను మందలించారు. ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తును జాప్యం చేస్తున్నట్టు పరిస్థితులనను బట్టి అర్థమవుతోందని అన్నారు.

 

యడియూరప్పపై 2013లో ఓ పోలీసు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం బెలండూర్‌, దేవరబీసనహళ్లి, ఇతర ప్రాంతాల్లో 400కు పైగా ఎకరాల భూమిని సేకరించిందని, కానీ యడియూరప్ప కొంత భూమిని ప్రైవేటు యజమానులకు అప్పగించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, కర్ణాటక లోకాయుక్త మాత్రం యడియూరప్పకు లంచం చెల్లించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎలాంటి మెటీరియల్ లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ నివేదికను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. 


దీంతో యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరారు. అయితే, కేసులో కాంగ్రెస్‌కు చెందిన మరో నిందితుడు ఆర్‌.వి. దేశపాండే ప్రమేయం కూడా ఉండడంతో యడియూరప్ప అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కాగా, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తన స్థానాన్ని డబ్బుల కోసం దుర్వినియోగం చేయలేదని, తన చర్యలు పరిపాలన అధికార పరిధిలోనే ఉన్నాయని యడియూరప్ప వాదించారు.  


Updated Date - 2022-09-23T22:01:01+05:30 IST