పదవులు పంచినా యడియూరప్పకు తప్పని సెగ!

ABN , First Publish Date - 2021-01-21T20:22:48+05:30 IST

ఆచి తూచి మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి

పదవులు పంచినా యడియూరప్పకు తప్పని సెగ!

బెంగళూరు : ఆచి తూచి మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు తలనొప్పులు తప్పడం లేదు. ఓవైపు పార్టీ సీనియర్ నేతలు, మరోవైపు మంత్రులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరి పోర్టుఫోలియోలను మార్చడంతో మంత్రులు కూడా యడియూరప్పపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. 


జేసీ మధు స్వామి, డాక్టర్ కే సుధాకర్ మంత్రి పదవుల స్థాయిని తగ్గించడంతో మధు స్వామి రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తన పదవి స్థాయిని తగ్గించడంతో మధు స్వామి షాక్ తిన్నట్లు తెలుస్తోంది. న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి తనను తప్పించి, ప్రాముఖ్యం లేని మెడికల్ ఎడ్యుకేషన్, కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖను తనకు ఇవ్వడం తనను అవమానించడమేనని భావిస్తున్నట్లు సమాచారం. న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను హోం మంత్రి బజవరాజ్ బొమ్మయ్‌కి అప్పగించిన సంగతి తెలిసిందే. 


మధు స్వామి జేడీఎస్ నుంచి బీజేపీలో చేరారు. గడచిన 18 నెలల్లో ఆయన చాలా మందితో విరోధం తెచ్చుకున్నారని, ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశాలను పాటించకుండా వ్యవహరించారని, అందుకే ఆయన పదవి స్థాయిని తగ్గించారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శక్తిమంతమైన ఓ మఠానికి చెందిన భూ లావాదేవీలను ఆపేందుకు మధు స్వామి ప్రయత్నించారని, అందుకే ఆయనకు శిక్ష పడిందని చెప్తున్నాయి. 


డాక్టర్ కే సుధాకర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఆయనకు ప్రస్తుతం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రమే మిగిలింది. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఏడుగురిలో ఐదుగురు తమకు లభించిన మంత్రి పదవులపై బాహాటంగానే అసంతృప్తిని ప్రకటించారు. లింగాయత్ నేత మురుగేశ్ నిరానీ ఇంధన శాఖను కోరుకోగా, గనులు, ఖనిజాల శాఖ లభించింది. దీంతో ఆయన రగిలిపోతున్నారని సమాచారం. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీకి అటవీ శాఖ దక్కింది. ఆయన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ ఇవ్వాలని అడిగారని తెలుస్తోంది. 


కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంటీబీ నాగరాజుకు ఎక్సయిజ్ శాఖ దక్కడంతో ఆయన ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం నుంచి కోపంతో వెళ్ళిపోయారని సమాచారం. ఇది నమ్మక ద్రోహమని నాగరాజు ఆరోపిస్తున్నట్లు తెలిసింది. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమేశ్ కత్తికి ఆహారం, పౌర సరఫరాల శాఖ లభించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. 


బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి యడియూరప్ప అసంతృప్త నేతలను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ సంక్షోభం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు. 




Updated Date - 2021-01-21T20:22:48+05:30 IST