కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై యడియూరప్ప వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-30T21:51:34+05:30 IST

భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన కృషి కొనసాగుతుందని

కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై యడియూరప్ప వ్యాఖ్యలు

బెంగళూరు : భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన కృషి కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చెప్పారు. మంత్రివర్గ కూర్పు విషయంలో నూతన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌కి సంపూర్ణ స్వేచ్ఛ ఉందని, ఇందులో తాను జోక్యం చేసుకోనని తెలిపారు. ఆయన శుక్రవారం చామరాజ్‌నగర్‌ జిల్లాలో విలేకర్లతో మాట్లాడారు. 


యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను యడియూరప్ప శుక్రవారం పరామర్శించి, ఓదార్చారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. 


అనంతరం యడియూరప్ప విలేకర్లతో మాట్లాడుతూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి బొమ్మయ్ న్యూఢిల్లీలో ఉన్నారన్నారు. పార్టీ అధిష్ఠానంతో కొద్ది రోజుల్లోనే ఆయన మాట్లాడతారని చెప్పారు. తన మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలనే విషయంపై పార్టీ పెద్దలతో చర్చిస్తారన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో తాను చెప్పబోనని తెలిపారు. బసవరాజ్ బొమ్మయ్‌కి సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్నారు. తన కేబినెట్ మంత్రులను ఆయన ఎంపిక చేసుకుంటారన్నారు. ఈ విషయంలో తాను ఎటువంటి సలహాను ఇవ్వబోనని తెలిపారు. 


మంచి పనులు చేయాలని నూతన ముఖ్యమంత్రి బొమ్మయ్‌కి సలహా ఇచ్చారు. పేదలు, అణగారిన వర్గాలకు సహాయం చేస్తామని బొమ్మయ్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. 


కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని వదిలిపెట్టి, బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? అని అడిగినపుడు యడియూరప్ప మాట్లాడుతూ, దీనికి సంబంధించి బసవరాజ్ బొమ్మయ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపి, ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. 


ఇదిలావుండగా, మంత్రి పదవిని ఆశిస్తున్నవారు ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారు. అయితే మంత్రివర్గ విస్తరణకు కాస్త సమయం పడుతుందనే సంకేతాలను బసవరాజ్ బొమ్మయ్ పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశమవుతారు. 


Updated Date - 2021-07-30T21:51:34+05:30 IST