ఫిర్యాదు చేశాడని ప్రాణం తీశారు!

ABN , First Publish Date - 2022-07-05T08:04:21+05:30 IST

అవినీతిని ప్రశ్నించిన, అన్యాయాన్ని ఎదిరించిన ఓ దళితుడు చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆయన తలపై బండరాయితో మోది చంపేశారు. ప్రకాశం జిల్లా సి.ఎ్‌స.పురం మండలం ఏకునాంపురంలో జరిగిన ఈ సంఘటన..

ఫిర్యాదు చేశాడని ప్రాణం తీశారు!

దారికాచి దళితుడి దారుణ హత్య

బండరాయితో మోది చంపిన వైనం

వైసీపీ నేతలపైనే అనుమానం 

ప్రకాశం జిల్లాలో దారుణం


సీఎ్‌సపురం, జూలై 4:  అవినీతిని ప్రశ్నించిన, అన్యాయాన్ని ఎదిరించిన ఓ దళితుడు చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆయన తలపై బండరాయితో మోది చంపేశారు. ప్రకాశం జిల్లా సి.ఎ్‌స.పురం మండలం ఏకునాంపురంలో జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏకునాంపురానికి చెందిన దాసరి వెంకట రమణయ్య (55)కు గ్రామంలోని వైసీపీ నేతలకు మధ్య భూవివాదం ఉంది. అదేసమయంలో ఉపాధి హామీలో అవకతవకలు, గ్రామంలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ కట్టి కావాలని ఎస్సీ పాలెం వాసులకు దారిలేకుండా చేస్తున్నారని వైసీపీ నేతలపై గతంలో రమణయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటరమణయ్య రేషన్‌ బియ్యం తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై ఆదివారం సాయంత్రం పక్క గ్రామం అరివేములకు వెళ్లాడు. సోమవారం ఉదయానికి కూడా రాకపోవడంతో బంధువులు వెతుకులాట ప్రారంభించారు. అరివేముల-చెర్లోపల్లి గ్రామాల మధ్యలో జామాయిల్‌ తోటలో రమణయ్య మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో టీమ్‌ రంగంలోకి దిగింది.  తన భర్తకు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులతో గొడవలు జరుగుతున్నాయని, వారిపైనే తనకు అనుమానంగా ఉందని భార్య నారాయణమ్మ  ఫిర్యాదు చేశారు.

 

అనేక అనుమానాలు 

రమణయ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమణయ్య భూమిని గతంలో గ్రామంలోని వైసీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ పేరుతో ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. దీనిపై రమణయ్య కలెక్టర్‌, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. ఆ భూమిని తిరిగి తన పేరు మీద ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ రమణయ్యను పొలంలోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. అలాగే గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని రమణయ్య గతంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, అతని తండ్రి కలిసి రమణయ్యపై దాడిచేసి గాయపర్చారు. వారిపై కేసు కూడా నమోదైంది. ఏకునాంపురం ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ కట్టి కావాలని ఎస్సీ పాలెం వారికి దారిలేకుండా చేస్తున్నారని గ్రామంలోని వైసీపీ నేతలపై అప్పటి కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రహరీ కట్టిన వైసీపీకి చెందిన కాంట్రాక్టర్‌ కూడా రమణయ్యపై కక్ష పెంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు.  వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే రమణయ్యను హత్య చేశారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు.

Updated Date - 2022-07-05T08:04:21+05:30 IST