కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆదివాసీలకు తీరని నష్టం

ABN , First Publish Date - 2022-05-28T06:46:42+05:30 IST

అణగారిన వర్గాలైన ఆదివాసీల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజ్‌ (తొక్కేస్తున్నాయి) చేస్తున్నాయని, వాటి పరిక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ ఎంపీ, ఆదివాస్‌ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆదివాసీలకు తీరని నష్టం
మహా ప్రదర్శనలో బృందాకరత్‌, నరసింగరావు, గిరిజన సంఘం నాయకులు, ఆదివాసీలు

హక్కులు, చట్టాలను మోదీ, జగన్‌ ప్రభుత్వాలు బుల్డోజ్‌ చేస్తున్నాయి

గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టడానికి కుట్రలు

కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారమే జీవో నంబరు-3 రద్దు

ఆదివాస్‌ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ ధ్వజం

సమస్యల పరిష్కారానికి ఆదివాసీలు ఉద్యమించాలని పిలుపు

సాటి గిరిజనులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్రోహం: నరసింగరావు

 

పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాలైన ఆదివాసీల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజ్‌ (తొక్కేస్తున్నాయి) చేస్తున్నాయని, వాటి పరిక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ ఎంపీ, ఆదివాస్‌ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ పిలుపునిచ్చారు. ఆదివాసీ సమస్యలపై అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల అన్ని వర్గాల కంటే ఆదివాసీలే ఎక్కువ నష్టపోతున్నారన్నారు. అటవీ హక్కుల చట్టం 2006లో అమల్లోకిరాగా... ఇప్పటికీ సగం మందికి కూడా సాగు భూమి హక్కులు కల్పించలేదన్నారు. అడవులపై ఆధారపడి  జీవిస్తున్న ఆదివాసులను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి, ఉపాధి పనులకు దూరం చేయడానికి ఉపాధి హామీ పథకానికి సవరణలు చేసిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అన్ని రకాల నిత్యావసరాల ధరలను పెంచేసి సామాన్యులు జీవించలేని దుస్థితికి చేర్చాయని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారాన్ని చేపట్టినప్పుడు రూ.400లున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటిందని అన్నారు. కేరళ ప్రభుత్వం 13 రకాల నిత్యావసర వస్తువులను రాయితీపై అక్కడ ప్రజలకు అందిస్తున్నదని, కేంద్రంలో వున్న మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు చేయడంలేదని బృందాకరత్‌ ప్రశ్నించారు. 

పథకం ప్రకారమే జీవో నంబరు-3 రద్దు

5వ షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనుల ఉద్యోగాలకు సంబంధించి జీవో నంబర్‌-3ని కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించిందని, దీని వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కవని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్‌ కనీసం స్పందించలేదన్నారు. మారుమూల పల్లెల్లో స్థానిక భాషల్లో విద్యా బోధన చేస్తున్న మాతృభాషా వలంటీర్లను ప్రభుత్వం తొలగించడం దుర్మార్గమని ఆమె అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి... గిరిజనుల సమస్యలపై కనీసం దృష్టిసారించడం లేదని, భాగ్య అంటే అదృష్టమని, లక్ష్మి అంటే ధనమని..... కానీ గిరిజనులకు ఈ రెండూ దక్కడంలేదని బృందాకరత్‌ చమత్కరించారు. తమ సమస్యల పరిష్కారానికి అల్లూరి స్ఫూర్తితో పోరాటం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. కొవిడ్‌ ప్రభావంతో ఆదివాసీ ప్రాంతాల్లో 94 శాతం మంది విద్యార్థులు రెండేళ్లపాటు విద్యకు దూరమయ్యారని తమ అఽధ్యయనంలో  గుర్తించినట్టు ఆమె చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా గిరిజన ప్రాంతాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, విద్య, వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం అన్యాయమన్నారు. ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని బృందాకరత్‌ పిలుపునిచ్చారు. 

సాటి గిరిజనులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్రోహం: నరసింగరావు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అక్రమార్కులు, అవినీతిపరులకు కొమ్ము కాస్తూ సాటి గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. చిట్టినాయుడు (భాగ్యలక్ష్మి తండ్రి), మణికుమారి వంటి నేతలు ఏ పార్టీలో ఉన్నా గిరిజనుల సమస్యలపై స్పందిస్తూ తమతో కలిసి వచ్చేవారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తీరు పూర్తి భిన్నంగా వుందని విమర్శించారు. గిరిజనుల సమస్యలు పట్టవని, డబ్బులే ఆమెకు ముఖ్యమని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిల్లో సురేంధ్ర, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు మాట్లాడుతూ.... గిరిజన ప్రాంతంలో విద్య, వైద్య రంగాలను మెరుగుపర్చాలని, గిరిజన చట్టాలను పక్కాగా అమలు చేయాలని, అక్రమ మైనింగ్‌ను ఆపాలని డిమాండ్‌ చేశారు. అందుకు ముందు పట్టణ వీధుల్లో మహాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నేతలు వి.తిరుపతిరావు, పాలికి లక్కు, కె.ఉమామహేశ్వరరావు, ఎస్‌.హైమావతి, డి.గంగరాజు, బి.చిన్నయ్యపడాల్‌, కె.పృధ్వీరాజ్‌, ఎస్‌.కొండలరావు, దీనబందు, దయానిధి, కె.ప్రభుదాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:46:42+05:30 IST