కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ పోటీ చేయదు

ABN , First Publish Date - 2022-10-07T09:12:57+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ పోటీ చేయదు

  • తెలుగు ఓటర్లున్న 15-20 చోట్ల జేడీఎస్‌కు మద్దతు
  • సరిహద్దుల్లోని ఎంపీ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పోటీ
  • కాంగ్రెస్‌, బీజేపీ రహిత శక్తి కోసమే మైత్రి: కుమారస్వామి

బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. అయితే కర్ణాటక - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. కోలార్‌, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ఓటర్లున్న 15-20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండొచ్చని, ఆయా స్థానాల్లో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని కుమారస్వామి చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌ అంగీకరించారని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కార్యక్రమానికి తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా కుమారస్వామి హజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులు, దళితులు, ఇతర అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికే బీఆర్‌ఎ్‌సతో చేతులు కలిపాం. కేసీఆర్‌ ఆలోచనలు నాకు నచ్చాయి.


 రాబోయే రోజుల్లో అంశాల ప్రాతిపదికన ఇద్దరం కలిసి పనిచేస్తాం’’ అన్నారు. దేశవ్యాప్తంగా 100-150 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలనే ఆలోచన బీఆర్‌ఎ్‌సకు ఉందన్నారు. తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదని కుమారస్వామి తెలిపారు. కానీ 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో మార్పులు రావొచ్చని చెప్పారు. కేసీఆర్‌తో ముందు నుంచీ తనకు సాన్నిహిత్యం ఉందని, భవిష్యత్తులోనూ బీఆర్‌ఎస్‌, జేడీఎ్‌సలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ రహిత రాజకీయ శక్తి కోసమే ఈ మైత్రి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ రహిత ప్రభుత్వాలు ఉన్నాయని, కర్ణాటకలోనూ ఇలాంటి ప్రభుత్వం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని కుమారస్వామి అన్నారు. డీఎంకే నేత స్టాలిన్‌తోపాటు మరికొంతమంది తమతో చేతులు కలుపుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-07T09:12:57+05:30 IST