ప్రగతి భవన్‌కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్‌తో ఇంత సడన్‌గా భేటీ ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-06-13T00:21:34+05:30 IST

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన

ప్రగతి భవన్‌కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్‌తో ఇంత సడన్‌గా భేటీ ఎందుకంటే..

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై పీకే సర్వే చేశారు. టీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై చర్చించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు ప్రగతిభవన్ జరుగుతున్న సమావేశంలో కేసీఆర్, పీకేతో పాటు మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారబోతోందా? ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం ప్రకటించనున్నారా? అనంతరం జాతీయ రాజకీయాలపైన కేసీఆర్‌ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రగతి భవన్‌లో 10వ తేదీన (శుక్రవారం) అందుబాటులోని మంత్రులు, ఎంపీలు, నేతలతో కేసీఆర్ ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేసీఆర్‌.. దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్‌ఎస్‌ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘ప్రస్తుతం దేశంలో పాలన ఒక లక్ష్యం లేకుండా ఉంది. దీంతో అశాంతి పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం’’ అంటూ ప్రతిపాదనను కేసీఆర్‌ సమావేశంలో పాల్గొన్నవారి ముందుకుతెచ్చారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే అంశంపైవారి అభిప్రాయాలు సేకరించారు.


పీకే డైరెక్షన్‌.. కేసీఆర్‌ యాక్షన్‌?

ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా మార్చే నైపుణ్యాలున్న ప్రశాంత్‌ కిషోర్‌ మార్గదర్శనంలోనే  కేసీఆర్‌, జాతీయ పార్టీ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపైసర్వేలు నిర్వహించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపైనా వారు సమీక్షించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవలి వరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ప్రశాంత్‌ కిశోర్‌.. ఆ పార్టీ విజయానికి రూట్‌ మ్యాప్‌నూ వివరించారు. అయితే చర్చలు విఫలం కావడంతో ఆ పార్టీలో చేరట్లేదని ప్రకటించారు. బిహార్‌లో కొత్త పార్టీ పెడుతున్నట్లూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహంతో ముందుకుసాగుతున్న కేసీఆర్‌.. మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని ఇటీవల ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్నట్లుగా మంత్రులు, పలురువు ప్రజాప్రతినిధుల సమావేశంలో సంకేతం ఇవ్వడంతో.. కేసీఆర్‌ చెప్పిన సంచలన ప్రకటన ఇదేనా? అన్న చర్చ నడుస్తోంది.


బీఆర్‌ఎస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్రలో పుట్టింది. జాతీయ స్థాయికి విస్తరించాలని భావించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో ఆవిర్భవించింది. జాతీయ స్థాయి విస్తరణ ప్రణాళికల్లో ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. దాని పేరు ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) అనే సంకేతాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అందరి మనసుల్లోనూ వెల్లువెత్తుతున్న సందేహం ఒక్కటే. అదే.. టీఆర్‌ఎస్‌ ఉంటుందా!? ఉండదా!? అన్నదే! ఎన్సీపీ, తృణమూల్‌, ఆప్‌ తదితర పార్టీలు ఆయా పేర్లతోనే జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాయి. ఇందుకు కారణం.. ఆయా పార్టీల పేర్లలో స్థానికత, ప్రాంతీయతను సూచించే పదాలు లేకపోవడమే. కానీ, టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఏర్పడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. దాంతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎప్పట్లాగే కొనసాగుతుందా? జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఏర్పడుతుందా!? లేక, బీఆర్‌ఎస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-06-13T00:21:34+05:30 IST