చేపల చెరువు తెచ్చిన కొట్లాట

ABN , First Publish Date - 2020-07-07T01:37:25+05:30 IST

రొద్దం మండల తురకలావట్నం గ్రామంలో 266–27 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలతో అధికారులు నింపారు.

చేపల చెరువు తెచ్చిన కొట్లాట

అనంతపురం: రొద్దం మండల తురకలావట్నం గ్రామంలో 266–27 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలతో అధికారులు నింపారు. చెరువులో పుష్కలంగా నీరు ఉండటంతో చేపలు వృద్ధి చెందాయి. అయితే చేపలను పట్టుకోవడానికి పెద్ద కోడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు ఆదివారం చెరువు వద్దకు వెళ్లారు. దీంతో తురకలాపట్నం గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ‘‘ఈ చెరువు మా గ్రామానికి చెందింది. మీరు ఎవరూ చేపలు పట్టుకోవడానికి అంటూ ప్రశ్నించారు. ఈ చెరువుపై సర్వ హక్కులు మాకే ఉన్నాయి. మీరు ఎవరు అడ్డగించడానికి’’ అంటూ పెద్దకోడిపల్లి చెందిన వారు వాదనకు దిగారు. మాటా మాట పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తురకలావట్నం గ్రామానికి చెందిన 10 మందికి గాయాలయ్యాయి. 


వాపోతున్న తురకలావట్నం గ్రామస్తులు

‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా చెరువుపై మాకు స్వాతంత్ర్యం లేదా? బిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మా గ్రామంలో ఉండే చెరువుపై మాకు స్వాతంత్ర్యం లేదా’’? అంటూ తురుకలావట్నం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 1987 సొసైటీ పేరుతో చెరువులను ఇతర గ్రామాల వారికి అప్పగించడం ఎంతవరకూ సబబు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా చెరువును వదులుకోమని తురుకలావట్నం మహిళలు హెచ్చరిస్తున్నారు. తమ గ్రామంలో 272 వాల్మీకి కుటుంబాలున్నాయని, చెరువులో చేపల పెంచుతూ వాటిని పట్టుకుని బతుకుతున్నామని మహిళలు వాపోతున్నారు. పెద్ద కోడిపల్లి గ్రామస్తులు వచ్చి దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చెరువు విషయంలో రెండు గ్రామాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలను జిల్లా మంత్రి, కలెక్టర్, ఎస్సీలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని తురకలావట్నం వాసులు కోరుతున్నారు. 

Updated Date - 2020-07-07T01:37:25+05:30 IST