అన్న మాటే బంగారు బాట

ABN , First Publish Date - 2021-07-28T05:46:41+05:30 IST

బయట సాదాసీదాగా కనిపించే ఉటా అబె బరిలోకి దిగితే చిచ్చరపిడుగే. అన్న అడుగుజాడల్లో జూడో క్రీడలోకి అడుగుపెట్టిన ఈ జపాన్‌ అమ్మాయి...

అన్న మాటే బంగారు బాట

బయట సాదాసీదాగా కనిపించే ఉటా అబె బరిలోకి దిగితే చిచ్చరపిడుగే. అన్న అడుగుజాడల్లో జూడో క్రీడలోకి అడుగుపెట్టిన ఈ జపాన్‌ అమ్మాయి... ఆ అన్నకే ప్రేరణగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఆ అన్నా చెల్లెళ్ళు టోక్యో ఒలింపిక్స్‌లో ఒకే రోజు స్వర్ణాలు గెలిచి...ఈ ఘనత సాధించిన తొలి తోబుట్టువులుగా చరిత్ర సృష్టించారు. వీరిద్దరి పేర్లు ఇప్పుడు జపాన్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి. వచ్చే ఒలింపిక్స్‌లో ఈ ఫీట్‌ రిపీట్‌ చేస్తామంటున్న ఉటా అబె విజయ ప్రస్థానం ఇది...


‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా అన్నయ్య హిఫుమీ నా రోల్‌ మోడల్‌. అతను ఎప్పుడూ నాకు అత్యున్నతంగా కనిపిస్తాడు’’ అంటుంది ఉటా అబే.  హిఫుమి ఆరేళ్ళ వయసులోనే జూడో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్నప్పుడే పోటీలకు వెళ్ళి పతకాలు పట్టుకొచ్చేవాడు. ఉటా అతనికన్నా మూడేళ్ళు చిన్నది. హిఫుమీని వారి తండ్రి శిక్షణకు తీసుకువెళ్తున్నప్పుడు... ‘‘నేను కూడా వస్తా!’’ అని మారాం చేసేది. అన్న ప్రాక్టీ్‌సను చూసి, ఇంటికి వచ్చాక అనుకరించేది. చాలారోజులు చెల్లెల్ని గమనించిన హిఫుమీ ‘‘నువ్వు కూడా జూడో ప్రాక్టీస్‌ చెయ్యి. బాగా రాణిస్తావ్‌!’’ అని ప్రోత్సహించాడు. అన్న మాట ఆమెకు బంగారు బాట అయ్యింది. అలా అయిదేళ్ళ వయసులో జూడో ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. మొదటి రోజే ఈ క్రీడతో ప్రేమలో పడిపోయింది. 


ఐస్‌క్రీమ్‌ దొంగతనం చేసేవాళ్ళం...

‘‘ఆ తరువాత ప్రతి దశలోనూ అన్నయ్య నన్ను నడిపిస్తూ వచ్చాడు. చిన్నప్పుడు ఇద్దరం కలిసి వీడియో గేమ్స్‌ ఆడుకొనేవాళ్ళం. ఫ్రిజ్‌లో ఐస్‌క్రీమ్‌ దొంగతనంగా తీసి తినేసేవాళ్ళం. అన్నయ్యకే తిట్లు పడేవి. దాంతో నా మీద అన్నయ్య కోప్పడే వాడు. ఇద్దరం కొట్టుకొనేవాళ్ళం. ఇల్లంతా చిందరవందర చేసేవాళ్ళం. ఇప్పుడు పెద్దయ్యాం కదా! కొట్లాటలు మానేశాం. నన్ను జాగ్రత్తగా చూసుకోవడం తన బాధ్యతగా అన్నయ్య భావిస్తున్నాడు’’ అంటుంది 21 ఏళ్ళ ఉటా. ‘‘మొదట్లో ఉటా గురించి కాస్త బెంగ పడేవాణ్ణి. ప్రాక్టీ్‌సలో, మ్యాచ్‌లలో తనకి ఏదైనా జరుగుతుందేమో అని భయపడేవాణ్ణి. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనుకొనేవాణ్ణి. క్రమంగా ఈ క్రీడ పట్ల ఆమెకు ఉన్న ఇష్టం, అంకితభావం నాకు అర్థమయ్యాయి’’ అని చెబుతాడు హిఫుమీ.


చెల్లి గెలిచాక భయం వేసింది...

తొలినాళ్ళలోనే ఉటా తన సత్తాను ఘనంగా చాటింది. ఐజెఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో... జూడోలో అతి పిన్నవయస్కురాలైన విజేతగా నిలిచింది. ప్యారిస్‌ గ్రాండ్‌స్లామ్‌లో తన తొలి ప్రత్యర్థులిద్దరినీ క్షణాల్లో గట్టి దెబ్బ తీసి తన సత్తా నిరూపించుకుంది. జపాన్‌ బయట ఆమె ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ అదే కావడం మరో విశేషం. ఒకే రోజు పతకాలు గెలవడం ఈ అన్నా చెల్లెళ్ళకు కొత్త కాదు. 2017లో ప్రతిష్టాత్మకమైన టోక్యో గ్రాండ్‌ స్లామ్‌లో 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరూ చెరో స్వర్ణ పతకం సాధించారు. హిఫుమీకి అది వరుసగా ఇరవై ఎనిమిదో విజయం. కానీ చెల్లెలి గెలుపు అన్నిటికన్నా ఆనందాన్నిచ్చిందని చెబుతాడతను. ‘‘ఆ రోజు నేను బరిలోకి దిగడానికి ముందు ఉటా మ్యాచ్‌, ఆమె గెలవడం చూశాను. అది నాకు స్వర్ణం దిశగా మరింత ప్రేరణ ఇచ్చింది. ఆమె గెలిచాక, నేను ఓడిపోతే అన్నగా నాకది కష్టంగా ఉంటుంది కదా! ఆ తరువాత ఆమె చెప్పినట్టు వినాల్సి వస్తుందని భయపడ్డాను’’ అంటాడతను. ‘‘మరి మీ అన్నయ్యకి ఏవైనా సలహాలు ఇస్తూంటావా?’’ అని ఎవరైనా అడిగితే తల అడ్డంగా తిప్పి, ‘‘ఇంకా లేదు’’ అని నవ్వేస్తుంది ఉటా. ‘‘అంతర్జాతీయ స్థాయిలో నా చెల్లెలు రాణిస్తూండడం చాలా గొప్ప విషయం. ఇదివరకు నేను పోటీలో ఆడుతున్నానంటే... ఏమౌతుందోనని అమ్మా, నాన్న తిండి మానేసేవారు. ఇప్పుడు చెల్లి కూడా రంగంలో ఉండడంతో వారి ఆందోళన రెండింతలైంది’’ అని అంంటాడు హిఫుమీ.


అది నాకు సహజంగానే ఉంది...

ఉటా జూడోలో అతి పిన్నవయస్కురాలైన సూపర్‌ స్టార్‌. విదేశాల్లో ఎన్నడూ పరాజయం పొందని రికార్డ్‌ ఆమెది. ‘‘ఎదురుదాడి చేసే ధోరణి నాకు సహజంగానే ఉంది. స్కూల్లో లెక్కలు, ఇంగ్లిష్‌ కన్నా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పీరియడ్‌ నాకు చాలా ఇష్టం. మా నాన్న పేరు కోజీ. ఆయన కోబే సిటీ అగ్నిమాపక శాఖలో పని చేస్తారు. చాలా ఉద్వేగాలున్న మనిషి. ఆయన కష్టపడి పని చేస్తారు, ఎంతో సానుకూలంగా ఉంటారు. ఆయన ప్రభావం నా మీద ఎక్కువ. అలాగే, ఆటలో, గెలవాలనే కాంక్షలో మా అన్నయ్య నాకు మార్గదర్శి. అతని అడుగుజాడల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఈ స్థాయికి రావడానికి అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు, ప్రపంచంలోనే అతి పెద్ద టవర్‌, జపాన్‌లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటైన టోక్యో స్కై ట్రీ మీద ఎన్నో ప్రచారాలకు అన్నయ్య బొమ్మని వాడుతున్నారు. మాకు మరో స్ఫూర్తి మా అంకుల్‌ తదహిరో నోమురా. ఒలింపిక్స్‌ చరిత్రలో వరుసగా మూడు ఎడిషన్లలో స్వర్ణపతకాలు సాధించింది ఆయన మాత్రమే. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలిచి, అమ్మా నాన్నలకూ, అంకుల్‌కూ గర్వకారణంగా నిలవాలనుకున్నాం. అనుకున్నది సాధించాం. ఇదే ఫలితాన్ని వచ్చే ఒలింపిక్స్‌లో పునరావృతం చెయ్యడానికి మరింత శ్రమిస్తాం’’ అంటోందామె కొండంత ఆత్మవిశ్వాసంతో.


ఫైనల్లో పోరాటం చాలా కష్టంగా అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలంటే... ఎంతో సహనంతో ఉండాలి. ఎలాంటి తప్పులూ చెయ్యకుండా జాగ్రత్త పడాలి. వెనక్కు తగ్గకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ఎదురుదాడి చేయడం నాకిష్టం. అందుకే పోటీలో నేనే ముందడుగు వేస్తాను.

Updated Date - 2021-07-28T05:46:41+05:30 IST