48 గంటల్లో ఐదువేల మొక్కలు... రికార్డ్ సృష్టించిన సోదరులు

ABN , First Publish Date - 2021-09-17T01:24:42+05:30 IST

తమిళనాడులోని వెంబకొట్టైకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు 48 గంటల్లో ఐదువేల మొక్కలు నాటి అరుదైన రికార్డ్ సృష్టించారు.

48 గంటల్లో ఐదువేల మొక్కలు... రికార్డ్ సృష్టించిన సోదరులు

విరుదునగర్: తమిళనాడులోని వెంబకొట్టైకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు 48 గంటల్లో ఐదువేల మొక్కలు నాటి అరుదైన రికార్డ్ సృష్టించారు. అరుణ్ (25), శ్రీకాంత్(22) అన్నదమ్ములు. కొవిడ్ మొదటి దశ లాక్‌డౌన్ విధించినప్పుడు వీరు హాబీగా మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఒక్క ఏడాది తర్వాత ఈ అభిరుచితో ఏదైనా సాధించాలనుకుని.... పట్టుదలతో రెండు రోజుల్లోనే ఐదువేల మొక్కలు నాటారు. ఈ సోదరుల్లో ఒకరైన శ్రీకాంత్ పాలిమర్ టెక్నాలజీలో డిగ్రీని పూర్తి చేసిన జాతీయస్థాయి సైక్లిస్ట్. మరో సోదరుడు అరుణ్ చెన్నైలోని ఒక సంస్థలో సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 


వీరిద్దరూ కలిసి ముంబయి నుంచి కన్యాకుమారి వరకు 2019 అక్టోబర్‌లో ‘‘సైక్లింగ్ ఫర్ రీ సైక్లింగ్ ’’ పేరిట రెండు వేల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్రను చేపట్టారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..‘‘ మేం 11రోజుల్లో రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశాం. ప్రయాణించే మార్గంలో 25 సంస్థల్లో ప్లాస్టిక్ పునర్వియోగంపై అవగాహన కల్పించాం ’’ అని చెప్పారు. అరుణ్ మాట్లాడుతూ.. ‘‘మేం మొక్కలు నాటడంతో పాటు సైకిల్ యాత్రను చేపట్టాం. రోజుకు ఎనిమిది గంటల పాటు పనిచేశాం. జనవరి 21 నుంచి 26 మధ్య రెండు రోజుల్లో 30 రకాలకు చెందిన ఐదు వేల మొక్కలను నాటాం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, గుళ్లకు సమీపంలో ఈ మొక్కలను నాటాం. గుంతలను తవ్వడానికి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది సహాయం తీసుకున్నాం’’ అని వెల్లడించారు. 


అత్యధిక మొక్కలు నాటుతూ చేపట్టిన సైక్లింగ్ ఉద్యమంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తమ రికార్డుల్లో వీరికి చోటు కల్పించింది. ఈ కార్యక్రమానికి వీరు ప్రైవేటు సంస్థల నుంచి నిధులను సేకరించారు. తమ సొంత నిధులను కూడా వెచ్చించారు. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వియోగంపై అవగాహన కల్పించడానికి వీరు‘ ఎన్ ఇండియా పేరిట వీరు ఒక లాభాపేక్ష రహిత సంస్థను కూడా నడుపుతున్నారు.

Updated Date - 2021-09-17T01:24:42+05:30 IST