Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంపుతానని బెదిరింపులు.. తమ్ముడిని హత్య చేసిన అన్నలు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తున్న తమ్ముడిని అన్నలు హత్య చేశారు. మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళ్‌హాట్‌ డివిజన్‌ గుఫానగర్‌లో నివాసం ఉండే దుర్గమ్మకు చింటూ అలియాస్‌ ప్రసాద్‌(22), నరేందర్‌ అలియాస్‌ మహేందర్‌(25), రవీందర్‌ (28) కుమారులు. రవీందర్‌ మియాపూర్‌లోని బొల్లారంలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నరేందర్‌ గుఫానగర్‌లోనే ఉంటూ పూల వ్యాపారం సాగిస్తున్నాడు. చివరి వాడైన చింటూ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో వాళ్లను కొడుతూ వేధింపులకు గురి చేసేవాడు. అతని బాధలు భరించలేక ఆరు నెలల క్రితం మహేందర్‌ తన భార్య పిల్లలతో పాటు తల్లి దుర్గమ్మను తీసుకొని సమీపంలోనే వేరే ఇంట్లో అద్దెకుంటున్నాడు.

కొంత కాలంగా ప్రసాద్‌ తరచూ తన అన్నలకు ఫోన్‌ చేసి చంపుతానంటూ బెదిరించడం ప్రారంభించాడు. దీంతో తమ్ముడిని హత్య చేయాలని సోదరులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే బొల్లారంలో ఉండే రవీందర్‌ శనివారం సాయంత్రం గుఫానగర్‌లోని తమ్ముడి ఇంటికి వచ్చాడు. రాత్రంతాచింటూ కోసం వేచి చూడగా ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో తాగిన మత్తు లో అతను ఇంటికి చేరుకున్నాడు. అతడితో మాట్లాడే ప్రయత్నం చేయగా, అప్పుడు కూడా అన్నలను చంపుతానంటూ గొడవ చేశాడు. ఇంట్లోని సామగ్రిని విసిరేస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడి చేశాడు. దీంతో నరేందర్‌, రవీందర్‌ ఇంట్లోని చున్నీని తీసుకొని ప్రసాద్‌ గొంతుకు బిగించి చెరో వైపు లాగి పట్టుకున్నారు. 


అతడు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోనే ఉన్నారు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి ప్రసాద్‌ ఎలా చనిపోయాడని ప్రశ్నించగా తామే హత్య చేశామని అంగీకరించారు. సమాచారం అందుకున్న మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి శవపరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement