జగన్‌పై నేరుగా పోరుకు ‘సై’.. Brother అనిల్ క్రైస్తవ పార్టీ..!?

ABN , First Publish Date - 2022-03-20T16:06:52+05:30 IST

‘జగనన్న వదిలిన బాణం’ ఎప్పుడో తిరగబడింది. ఆయన సోదరి షర్మిల ఇప్పటికే తెలంగాణలో కొత్త...

జగన్‌పై నేరుగా పోరుకు ‘సై’.. Brother అనిల్ క్రైస్తవ పార్టీ..!?

  • జగన్‌ వైఖరితో విసిగిపోయిన షర్మిల దంపతులు
  • అన్ని రకాలుగా అన్యాయం చేశారని ఆక్రోశం
  • కొన్నాళ్లుగా క్రైస్తవ, బీసీ, ముస్లింలతో అనిల్‌ భేటీలు
  • జగన్‌ ప్రభుత్వంపై నేరుగానే విమర్శలు

‘జగనన్న వదిలిన బాణం’ ఎప్పుడో తిరగబడింది. ఆయన సోదరి షర్మిల ఇప్పటికే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. ఆమె భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్‌ అనిల్‌ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వైఖరిపై తన అసంతృప్తిని సూటిగానే  బయటపెడుతున్నారు. ఇక.. జగన్‌పై నేరుగా పోరుకు ‘సై’ అంటున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ‘క్రైస్తవ పార్టీ’ పెట్టేందుకు సిద్ధమవుతున్నారా? నేటి ‘కొత్త పలుకు’లో ఆర్కే విశ్లేషణ...


‘‘పాలన ప్రజాకంటకంగా మారినప్పుడు పాలకుడికి వ్యతిరేకంగా బాధితులంతా ఏకమవుతారు. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రభుత్వానికి సెగ పెరుగుతూ ఉంటుంది. జగన్‌ రెడ్డి సొంత బావ, చెల్లి షర్మిల భర్త అయిన బ్రదర్‌ అనిల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం మొదలెట్టారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత క్రైస్తవులు ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా మారడానికి బ్రదర్‌ అనిల్‌ తెర వెనుక ఎంతో కృషి చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం ఆయన దూరంగా ఉండేవారు. ఇప్పుడు మొదటిసారిగా బ్రదర్‌ అనిల్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. బడుగు బలహీనవర్గాలు, ముఖ్యంగా క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్‌ పార్టీని ప్రారంభించాలని బ్రదర్‌ అనిల్‌ దాదాపుగా నిర్ణయించుకున్నారు.


2019 ఎన్నికల వరకు జగన్‌ రెడ్డి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన బ్రదర్‌ అనిల్‌, విజయమ్మ, షర్మిల ప్రభృతులు జగన్‌ రెడ్డికి అధికారం అందిన తర్వాత దూరంగా గెంటివేతకు గురయ్యారు. వాస్తవానికి జగనే వారిని దూరం పెట్టారు. అధికారంలోకి వస్తే షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయించేలా అన్నాచెల్లెళ్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత షర్మిలను రాజ్యసభకు పంపడానికి జగన్‌ నిరాకరించారు. ఆ తర్వాత ఆస్తులలో వాటా ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోనూ, ఆస్తులలోనూ వాటా ఇవ్వకుండా తమకు అన్యాయం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న షర్మిల దంపతులు జగన్‌ రెడ్డిపై రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టియన్‌ పార్టీ పేరిట కొత్త పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలన్న నిర్ణయానికి బ్రదర్‌ అనిల్‌ వచ్చారని తెలిసింది. 


ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి బలమైన మద్దతుదారులుగా క్రైస్తవులు ఉన్నారు. బ్రదర్‌ అనిల్‌కు కూడా క్రైస్తవుల్లో మంచి పట్టు ఉంది. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచి కూడా క్రైస్తవుల ఓట్లను ఆ కుటుంబానికి అనుకూలంగా మళ్లించడంలో బ్రదర్‌ అనిల్‌ చేసిన కృషి విస్మరించలేనిది. ఈ నేపథ్యంలో బ్రదర్‌ అనిల్‌ నిజంగానే క్రిస్టియన్‌ పార్టీని ప్రారంభిస్తే జగన్‌ రెడ్డికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అవసరమైతే షర్మిల కూడా క్రిస్టియన్‌ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. విజయమ్మ ఏ వైఖరి తీసుకుంటారో ఇంకా స్పష్టత రాలేదు.’’

Updated Date - 2022-03-20T16:06:52+05:30 IST