ఏపీలో షర్మిల పార్టీ పెట్టడంపై ఆమె భర్త అనిల్ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-01-10T18:15:52+05:30 IST

ఏపీలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పార్టీ పెట్టడంపై ఇటీవల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

ఏపీలో షర్మిల పార్టీ పెట్టడంపై ఆమె భర్త అనిల్ ఏమన్నారంటే...

విజయవాడ : ఏపీలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పార్టీ పెట్టడంపై ఇటీవల ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. నేడు షర్మిల భర్త అనిల్ సైతం ఏపీలో పార్టీపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవునని కానీ కాదని కానీ చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. నేడు గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకోగా.. ఆయనను మీడియా ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రశ్నించింది. తాను విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చానని.. తనకు ఇక్కడ ఏమి పని లేదన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పార్టీకి, నాకు సంబంధం లేదు. నేను పార్టీ గురించి మాట్లాడను’ అని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు. 


క్రిస్మస్ పండుగ వేదికగా సీఎం జగన్, షర్మిల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందంటూ చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఏపీలో సైతం పార్టీ పెట్టేందుకు సమాయత్తమవుతున్నారంటూ ప్రచారం జోరుగా నడుస్తోంది. ‘జగనన్న వదిలిన బాణం’... ఇప్పుడు ఆ అన్నకే ఎదురు తిరగనుందంటూ చర్చలు సైతం సాగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రారంభించి.. పాదయాత్రలు, ధర్నాలతో హల్‌చల్‌ చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్‌ షర్మిల తదుపరి అడుగు సీమాంధ్రలోనేనా? ‘తెలంగాణలో నేను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నావు. నేను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి నిన్ను బలహీన పరుస్తా!’ అని అన్నకు ఆమె సవాల్‌ విసిరినట్లు సైతం ప్రచారం జరుగుతోంది. దీనిని బలపరిచేలా షర్మిల ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టకూడదని నిబంధన (రూల్‌) ఏమీ లేదు కదా’ అని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-01-10T18:15:52+05:30 IST