Jun 23 2021 @ 00:57AM

బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌... సినిమా చేస్తున్నార్‌!

సార్‌...

సిస్టర్స్‌ వస్తున్నార్‌!

సినిమాలు చేస్తున్నార్‌!

సెట్‌లో పనులు చూస్తున్నార్‌!

బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బాండింగ్‌...

సినిమాలకు సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా!

బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ కాంబినేషన్‌...

మేకింగ్‌లోనూ సక్సెస్‌ఫుల్‌ ఫార్ములానే!

ఒకరికొకరు అండగా సినిమాలు చేస్తున్న 

ఆ బ్రదర్‌ అండ్‌ సిస్టర్స్‌ ఎవరో చూడండి.



మహేశ్‌బాబు-మంజుల, రామ్‌చరణ్‌-సుష్మిత, నితిన్‌-నిఖిత... ఆల్రెడీ ఈ బ్రదర్‌ అండ్‌ సిస్టర్స్‌ సినిమాలు చేశారు. ప్రభాస్‌-ప్రసీధ, నాని-దీప్తి... ఇప్పుడు కొత్తగా ఈ బ్రదర్‌ సిస్టర్‌ కాంబినేషన్‌లో సినిమాలు వస్తున్నాయి. నటన లేదా నిర్మాణంలో బ్రదర్స్‌ బిజీగా ఉంటుంటే... వారికి  ఎటువంటి ట్రబుల్స్‌ లేకుండా సెట్‌లో పనులను ఈ సిస్టర్స్‌ చక్కదిద్దుతున్నారు.


నిర్మాతగా నాని ప్రారంభించిన తాజా సినిమా ‘మీట్‌ క్యూట్‌’. ఈ చిత్రానికి దర్శకురాలు ఎవరో కాదు... నాని సోదరి దీప్తి. వాల్‌ పోస్టర్‌ సినిమా సంస్థను స్థాపించిన నాని, నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ వచ్చారు. దర్శకత్వానికి దీప్తి కూడా కొత్తే. గతంలో ఓ లఘు చిత్రం తీశారంతే. కానీ, నాని సోదరి కావడం స్పెషల్‌. హీరోగా నాని బిజీ. అందువల్ల, సెట్‌లో డైరెక్షన్‌తో పాటు ప్రొడక్షన్‌ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. నాని తన సోదరిని దర్శకురాలిగా పరిచయం చేస్తుంటే... ప్రభాస్‌ తన సోదరి ప్రసీధను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు.


ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. దీని నిర్మాతల్లో ప్రసీధ ఒకరు. ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు పెద్ద కుమార్తె ఈ ప్రసీధ ఉప్పలపాటి. తండ్రి, అన్నయ్య వారసత్వంతో పరిశ్రమలోకి రాలేదు. అమెరికా వెళ్లి ఫిల్మ్‌మేకింగ్‌ కోర్స్‌ చేశారు. అక్కడ పని చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్‌లో బాధ్యతలు చూస్తున్నారు. నిర్మాణం, ప్రచారం మీద ప్రసీధకు అవగాహన ఉంది. ‘జాతిరత్నాలు’ ప్రచారంలో ఆమెది ముఖ్య భూమిక.


దర్శకురాలిగా దీప్తీ గంటా, నిర్మాతగా ప్రసీధ ఉప్పలపాటి... త్వరలో పరిచయం కానున్నారు. మంజుల, నిఖిత, సుష్మిత... ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కృష్ణ కుమార్తె మంజుల తొలుత నటిగా తెలుగు తెరపైకి వచ్చారు. తర్వాత నిర్మాతగా మారారు. మహేశ్‌బాబు హీరోగా రెండు చిత్రాలు చేశారు. ఒకటి... ‘నాని’. ఇంకొకటి... ‘పోకిరి’. హీరోగా మహేశ్‌కు ‘పోకిరి’ ఎంత పేరు తెచ్చిందో, ఎంత భారీ విజయం సాధించిందో తెలియనిది కాదు. ఈతరం వారసుల్లో తొలి తెలుగు బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ కాంబినేషన్‌ వీళ్లిద్దరిదే.


‘ఖైదీ నంబర్‌ 150’తో చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రానికి చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాత. పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు. కేవలం ఆ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాలేదు. తమ్ముడు నిర్మాత కావడంతో నిర్మాణ బాధ్యతలూ చూసుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’కూ అంతే! రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని ‘సైరా...’ ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. నితిన్‌ సోదరి నిఖితారెడ్డి అయితే నేరుగా నిర్మాణంలోకి వచ్చారు. తండ్రి సుధాకర్‌రెడ్డితో కలిసి తమ్ముడు హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘చిన్నదాన నీకోసం’ నిర్మించారు. ఇప్పుడు ‘మాస్ట్రో’ నిర్మిస్తున్నారు. మరికొంతమంది సిస్టర్స్‌ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. వారసులుగా చిత్రసీమకు వచ్చిన మహిళల శాతం తక్కువే. వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒకవేళ మహిళలు వచ్చినా... వెండితెరపైకి వచ్చినోళ్లు తక్కువ. వెండితెర వెనుక, వివిధ శాఖల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. తెర వెనుక ఉంటున్నారు కాబట్టి వాళ్ల గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు తెలుసో? లేదో? పరిశ్రమ వర్గాలకు మాత్రం తెలుసు. ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్‌ కాదు... బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బాండింగ్‌ తెలుగులో కనబడుతోంది.