పులిరాజాకు కరోనా.. ఆందోళనలో ప్రపంచం

ABN , First Publish Date - 2020-04-06T20:34:02+05:30 IST

పులిరాజాకు కరోనా సోకింది. ఈ మాట వినగానే అప్పుడెప్పుడో కొన్నేళ్లపాటు ప్రచారంలో ఉన్న ఓ నినాదం గుర్తొస్తోంది కదూ...

పులిరాజాకు కరోనా.. ఆందోళనలో ప్రపంచం

పులిరాజాకు కరోనా సోకింది. ఈ మాట వినగానే అప్పుడెప్పుడో కొన్నేళ్లపాటు ప్రచారంలో ఉన్న ఓ నినాదం గుర్తొస్తోంది కదూ... ఇప్పుడు మాత్రం న్యూయార్క్‌లో ఓ పెద్దపులికి కరోనా వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా నమోదయ్యింది. దీంతో.. ఇప్పటికే కరోనా కరాళనృత్యం చేస్తున్న అమెరికాలో భయం రెట్టింపయ్యింది. జంతువుల ద్వారా ఈ వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉందని జూలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ, దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఇంతకీ జంతువుల నుంచి కరోనా వైరస్‌ మనుషులకు వ్యాపిస్తుందా ? నిపుణులు ఏమంటున్నారు ? 

 


ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి బెడద.. ఇప్పుడు జంతువులనూ తాకింది. ఇప్పటిదాకా మనుషుల నుంచి మనుషులకే సోకుతూ.. దేశాల సరిహద్దులు దాటింది కరోనా. మనుషులను ఇళ్లల్లోనే బందీలను చేసింది. కానీ, ఇప్పుడు.. ఓ పులికి కూడా సోకింది. కరోనా టెస్టులో పులికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. 


అమెరికాలో ఈ సంఘటన బయటపడింది. కరోనా ఇప్పటికే అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలిగొంటోంది. అయితే.. ఇప్పుడు న్యూయార్క్‌లోని  బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ వెటర్నరీ లాబరేటరీస్ సర్వీసెస్ బృందం పులికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందన్న విషయాన్ని నిర్దారించింది. 


మలయన్‌ జాతి పులి నదియా.. కొద్ది రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. జూలో జంతువుల ఆలనాపాలనా చూసుకునే ఓ ఉద్యోగి ఈ లక్షణాలను గుర్తించి జూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని బోంక్స్‌జూ అధికారులు ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. అయితే.. నదియాతో పాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు జూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో.. జూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న పులులు, సింహాలు ఆహారం తీసుకోవడం బాగా తగ్గించాయని జూలో పనిచేసే సిబ్బంది తెలిపారు. ఇప్పటికైతే బాగానే తిరుగుతున్నాయంటున్నారు.  


జూలో బోన్లలో, అవి తిరిగే ఎన్‌క్లోజర్‌లో మాత్రమే ఉండే జంతువులకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. వాటి ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి ద్వారానే నదియాగా పిలిచే పులికి ఈ ప్రాణాంతక వైరస్ సోకి ఉంటుందని జూ అధికారులు అనుమానిస్తున్నారు. అదే జరిగి ఉంటుందని పశువైద్యులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఒక వ్యక్తినుంచి కోవిడ్‌-19 వైరస్‌ సోకి జంతువు అనారోగ్యానికి గురికావడం ఇదే మొదటిసారి అని.. బ్రోంక్స్‌ జూ ప్రధాన పశువైద్యుడు పాల్‌ కాలే చెప్పారు. వైరస్ బారిన పడిన పులులను జూలోని టైగర్ మౌంటెయిన్ ఎగ్జిబిట్‌లో ఉంచినట్లు జూ అధికారులు ప్రకటించారు. మార్చి 16వ తేదీ నుంచి బ్రోంక్స్‌ జూకు సందర్శకులను అనుమతించడం లేదు.  




ఈ పరిణామంతో న్యూయార్క్‌లోని బ్రోంక్‌ జూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్‌ మనుషుల మాదిరిగానే.. జంతువులకు కూడా ఒకదాని నుంచి మరొకదానికి సోకే ప్రమాదం ఉండటంతో వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. పులి పిల్ల నదియాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యే సమయానికే మిగతా జంతువులతో కలిసి తిరిగిందని.. ఇప్పుడు జూలో ఉన్న జంతువులన్నింటికీ కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం వస్తుందని అధికారులు చెబుతున్నారు.  


మార్చి చివరి వారంలో పొడి దగ్గుతో బాధపడిన నదియాకు అనుమానంతో ఏప్రిల్‌ 2వ తేదీన కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించామని న్యూయార్క్‌ జూ అధికారులు చెబుతున్నారు. నదియాకు తొలుత పశువైద్యబృందాలు అనేక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయని, చివరకు కరోనా లక్షణాలున్నాయని గ్రహించిన తర్వత కోవిడ్‌-19 పరీక్షలు చేయించామని బ్రోంక్స్‌ జూ ప్రధాన పశువైద్యుడు పాల్‌ కాలే చెప్పారు. నదియా రక్త నమూనాలను కార్నెల్ విశ్వవిద్యాలయంలోని న్యూయార్క్ స్టేట్ డయాగ్నొస్టిక్ లాబొరేటరీకి, అలాగే.. యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ వెటర్నరీ డయాగ్నొస్టిక్ లాబొరేటరీకి పంపామని తెలిపారు. 


నదియాతో పాటు మరో మలయాన్‌ పులి, రెండు సైబీరియన్‌ పులులు, ఇంకో మూడు ఆఫ్రికన్‌ సింహాలకు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని.. అయితే.. వాటికి ఇంకా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు.  అయితే.. ఈ ఏడింటిని ప్రస్తుతం జూలోని వెటర్నరీ వైద్యవిభాగం పర్యవేక్షిస్తోంది.


ఈ  పరిణామంతో అమెరికా దేశ వ్యాప్తంగా జూ కీపర్లు ఆందోళన చెందుతున్నారు. జంతువులకు.. ప్రధానంగా కోతులకు శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. వాటిద్వారా జూ కీపర్లకు శ్వాసకోశ వ్యాధులు సోకవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


వాస్తవానికి మనుషులైతే.. ఈ వైరస్‌ను అరికట్టడానికి సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, జంతువుల నుంచి వైరస్‌ సోకకుండా కట్టడిచేసే ప్రయత్నాలు అంతగా చేసే అవకాశం ఉండదు. దీంతో.. ఇప్పటినుంచి మరింత జాగరూకత అవసరమని జంతునిపుణులు, వెటర్నరీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటిదాకా మనుషుల ద్వారా వ్యాపిస్తున్న కరోనా వైరస్.. ఇక జంతువుల ద్వారా కూడా విస్తరిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 




ఈ నేపథ్యంలోనే మరో వాదన కూడా వినిపిస్తోంది. జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది కానీ, వాటి నుంచి మానవులకు వైరస్‌ సోకడం చాలా అరుదు అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులు గానీ, బందీలుగా ఉన్న అడవి జంతువుల నుంచి గానీ  కరోనా వైరస్‌ మనుషులకు వ్యాపిస్తుందని ఇప్పటివరకైతే ఆధారాలు లేవని చెబుతున్నారు.



 -  సప్తగిరి గోపగోని (ఏబీఎన్‌ రెడ్‌అలర్ట్ డెస్క్‌ ఇంచార్జ్‌)

Updated Date - 2020-04-06T20:34:02+05:30 IST