తండ్రిని తప్పించాక ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన Britney

ABN , First Publish Date - 2021-10-06T01:47:28+05:30 IST

తండ్రి సంరక్షణలో 13 ఏళ్ల పాటు అనేక బాధలు అనుభవించి చివరికి బయటపడిన అమెరికన్ పాప్‌స్టార్

తండ్రిని తప్పించాక ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన Britney

లాస్‌ఏంజెలెస్: తండ్రి సంరక్షణలో 13 ఏళ్ల పాటు అనేక బాధలు అనుభవించి చివరికి బయటపడిన అమెరికన్ పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్.. తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. సంరక్షకత్వానికి సంబంధించి ఏళ్ల తరబడి అభిమానులు తనకు అండగా నిలిచినందుకు గాను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా థ్యాంక్స్ చెప్పింది. తన సంరక్షణ బాధ్యతల నుంచి తండ్రి జేమ్స్ స్పియర్స్‌ను తప్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత బ్రిట్నీ చేసిన తొలి బహిరంగ కామెంట్లు ఇవే కావడం గమనార్హం. 


తండ్రి జేమ్స్ స్పియర్ సంరక్షకత్వం (కన్జర్వేటర్‌షిప్)లో బ్రిట్నీ ఎన్నో బాధలు అనుభవించింది. తండ్రి అరాచకాలపై కోర్టుకెక్కిన ఆమె తనకు తన జీవితం తిరిగి కావాలని చెప్పడం ఆమె అనుభవించిన బాధలకు అద్ధం పట్టింది. తండ్రి నేతృత్వంలోని సంరక్షకత్వం తనను బానిసగా మార్చిందని, తన ఆత్మస్థయిర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కన్జర్వేటర్‌షిప్ నుంచి ఆయనను తొలగించి జైలులో పెట్టాలని కోర్టును అభ్యర్థించింది. 


కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ జేమ్స్ స్పియర్‌ను తప్పించిన తర్వాత తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బ్రిట్నీ థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు అభిమానులు #FreeBritney అంటూ ఆమెకు తొలి నుంచీ అండగా నిలిచారు. వారు కూడా  తండ్రి నుంచి ఆమె బంధవిముక్తిరాలు కావాలని కోరుకున్నారు. కోర్టు తీర్పుతో బంధవిముక్తురాలైన బ్రిట్నీ నిన్న సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో.. #FreeBritney పోరాటం గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదని పేర్కొంది. వారి నిరంతర పోరాటం వల్లే సంరక్షకత్వం నుంచి బయటపడగలిగానని తెలిపింది. ‘‘గత రాత్రి నేను రెండు గంటలపాటు రోదించాను. నా అభిమానులు చాలా మంచివారు. ఆ విషయం నాకు తెలుసు. మీ హృదయ స్పందన నాకు తెలుస్తుంది, అలాగే నా గురించి మీరు కూడా. నాకు తెలిసిన సత్యం అదే’’ అని పేర్కొన్న బ్రిట్నీ.. మౌనంగా ఉన్న వీడియోను పోస్టు చేసింది. 


అయితే, సంరక్షకత్వం నుంచి బ్రిట్నీ పూర్తిగా విముక్తి పొందలేదు.  2008 నుంచి అమలులో ఉన్న చట్టపరమైన అమరిక అలాగే మిగిలిపోయింది. నవంబరు 12న జరగనున్న విచారణలో దీనిని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. సంరక్షకత్వం నుంచి జేమ్స్ స్పియర్స్ తప్పుకున్నప్పటికీ ఆయనపై విచారణ కోరుతామని బ్రిట్నీ న్యాయవాది మాథ్యూ రోజెన్‌గార్ట్ అన్నారు.


జేమ్స్ స్పియర్స్‌ను తప్పించడానికి ఎలాంటి కారణాలు లేవని జేమ్స్ న్యాయవాదులు చెబుతున్నారు. ఆయనెప్పుడూ కుమార్తె బాగోగులు కోరారని, అలాగే నడుచుకున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, తండ్రి దూరం కావడం బ్రిట్నీకి తీరని లోటని చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-10-06T01:47:28+05:30 IST